Begin typing your search above and press return to search.

తీవ్ర దుమారం: 2011 ప్రపంచ కప్ ఓటమిపై మాజీమంత్రి సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   19 Jun 2020 9:10 AM GMT
తీవ్ర దుమారం: 2011 ప్రపంచ కప్ ఓటమిపై మాజీమంత్రి సంచలన వ్యాఖ్యలు
X
కొన్నేళ్ల తర్వాత భారతదేశం క్రికెట్ ప్రపంచ కప్ సొంతం చేసుకున్నది 2011లో. ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకను ఓడించి కప్ ను కైవసం చేసుకుంది. అయితే దీని పై ఇప్పటికీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీలంక ఓటమి పాలవ్వడం పలు సందేహాలు లేవనెత్తాయి. తాజాగా ఇదే విషయమై శ్రీలంకకు చెందిన మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశ జట్టు ఫైనల్ మ్యాచ్ లో ఉద్దేశపూర్వకంగా ఓటమి పాలయ్యిందని ఆరోపించారు.

ఆరోపించింది ఎవరో కాదు శ్రీలంక క్రీడా శాఖ మంత్రి మహిందానంద. 2011 ప్రపంచ కప్ సమయంలో ఆ దేశ క్రీడా శాఖ మంత్రిగా కొనసాగిన వ్యక్తే. అందుకే ఈ వ్యాఖ్యలు శ్రీలంకతో పాటు భారతదేశంలో కలకలం రేపుతోంది. భారత్‌తో జరిగిన 2011 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో తమ జట్టు ఉద్దేశపూర్వకంగానే ఓడిందని శ్రీలంక మాజీ క్రీడా మంత్రి మహిందానంద అలుత్‌గమగె సంచలన ఆరోపణలు చేశారు. ఆ మ్యాచ్‌లో తమ జట్టు అమ్ముడుపోయిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

2010 నుంచి 2015 వరకు లంక క్రీడా మంత్రిగా వ్యవహరించిన మహిందానంద ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ మరో పది బంతులుండగానే 6 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.

ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిందానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘2011 వరల్డ్‌కప్‌లో మా జట్టు అమ్ముడుపోయిందని స్పష్టంగా చెప్పగలను. అంతేకాదు.. నా మాటకు కట్టుబడి ఉంటాను. ఆ సమయంలో నేను శ్రీలంక క్రీడా మంత్రిగా ఉన్నాను. అయితే దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేను. ఆ ఫైనల్‌ మ్యాచ్‌ మాత్రం లంక జట్టే గెలవాల్సింది. ఈ విషయంలో ఎలాంటి చర్చకైనా నేను సిద్ధమే. ఆటగాళ్లకు ఇందులో భాగస్వామ్యం లేకపోయినా కొన్ని వర్గాలు మాత్రం ఈ ఫిక్సింగ్‌లో పాలుపంచుకున్నాయి’ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.


ఈ 2011 ఫైనల్‌ మ్యాచ్‌పై గతంలోనూ శ్రీలంక నుంచి ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. మాజీ కెప్టెన్‌ అర్జున రణతుంగ కూడా తమ జట్టు ఓటమిపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. శ్రీలంక మాజీ మంత్రి దయసిరి జయశేఖర కూడా ఇదే తరహా వాదనను వినిపించాడు.


ఈ వ్యాఖ్యలతో శ్రీలంకలో కలకలం రేపాయి. మాజీమంత్రి మహిదానంద వ్యాఖ్యలపై కొందరు క్రికెట్ ఆటగాళ్లు స్పందించారు. 2011 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో తాము కావాలనే ఓడామనడానికి ఆధారాలు చూపాల్సిందిగా అప్పటి శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్‌ కుమార సంగక్కర, జయవర్ధనె డిమాండ్‌ చేశారు. మాజీ క్రీడామంత్రి మహిదానంద గమగె దగ్గర దీనికి సంబంధించి ఏమైనా సాక్ష్యాలుంటే వెంటనే ఐసీసీకి, అవినీతి వ్యతిరేక యూనిట్‌కు అందించాలని సూచించారు. అప్పుడే వారు క్షుణ్ణంగా విచారణ జరుపుతారని సంగక్కర ట్విట్టర్ లో కోరాడు.

జయవర్ధనె కూడా గమగె వ్యాఖ్యల పై మండిపడ్డారు. ‘చూస్తుంటే సర్కస్‌ ఆరంభమైనట్టు కనిపిస్తోంది.. ఇప్పుడేమైనా ఎన్నికలు జరగబోతున్నాయా? మరి పేర్లు, సాక్ష్యాలేమైనా ఉన్నాయా?’ అంటూ జయవర్ధనె ట్వీట్‌ చేశాడు. వీటి పై భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు నిశితంగా పరిశీలిస్తున్నారు.