Begin typing your search above and press return to search.

రష్యా నుంచి కరోనా వైరస్‌కు తొలి వ్యాక్సిన్‌ .. పుతిన్‌ కుమార్తెకి 'టీకా'‌ !

By:  Tupaki Desk   |   11 Aug 2020 11:30 AM GMT
రష్యా నుంచి కరోనా వైరస్‌కు తొలి వ్యాక్సిన్‌ .. పుతిన్‌ కుమార్తెకి టీకా‌ !
X
కరోనా వైరస్ మహమ్మారి భయంతో గజగజ‌ వణికిపోతోన్న ప్రపంచానికి రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. కరోనాను అంతం చేసే వ్యాక్సిన్‌ ను అభివృద్ధి చేస్తున్నామని , మొదట కరోనా వ్యాక్సిన్ తెచ్చేది మేమే అంటూ రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా రష్యా నుంచి కరోనా వైరస్ ‌కు తొలి వ్యాక్సిన్‌ వచ్చింది. ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వ్యాక్సిన్ ‌పై అధికారికంగా ప్రకటన చేశారు.

ప్రపంచంలోనే తొలి కరోనా వైరస్‌ వ్యాక్సిన్ ‌ను మంగళవారం ఉదయం రష్యా నమోదు చేసిందని మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ‌లో పుతిన్‌ తెలిపారు. వ్యాక్సిన్‌ పనితీరు పై తనకు సమాచారం అందించాలని ఆరోగ్య మంత్రి మైఖేల్‌ మురష్కోను ఆయన కోరారు. అలాగే తన కుమార్తె కు టీకా వేయించినట్లు పుతిన్ ప్రకటించారు. ఈ టీకా ద్వారా రోగనిరోధకత పెరిగి కరోనా నియంత్రణలోకి వస్తుందని చెప్పారు. మొదట ఈ వ్యాక్సిన్ ను వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, చిన్నారులకు వేయనున్నట్లు తెలిపారు. దీనితో కరోనా వ్యాక్సిన్‌ ను రిజిస్టర్ చేసిన తొలి దేశంగా రష్యా నిలిచింది. రష్యాకు చెందిన గామలేయా ఇనిస్టిట్యూట్‌ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది.

అంతర్జాతీయంగా ఇప్పటివరకూ 2 కోట్లకు పైగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు వెలుగుచూడగా 7.35 లక్షల మంది మహమ్మారి బారినపడి మరణించారు. 1.2 లక్షల మంది ఈ వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.