Begin typing your search above and press return to search.

కిమ్ కాస్కో: ఉత్తర కొరియాలో తొలి పాజిటివ్ కేసు

By:  Tupaki Desk   |   26 July 2020 5:30 AM GMT
కిమ్ కాస్కో: ఉత్తర కొరియాలో తొలి పాజిటివ్ కేసు
X
ఇన్నాళ్లు వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్టంగా కట్టడి చర్యలు అమలుచేస్తూ వైరస్ రహిత దేశంగా నిలిచిన ఉత్తర కొరియాలో ఎట్టకేలకు వైరస్ ప్రబలింది. ఆ దేశంలో తొలి కేసు తాజాగా నమోదైంది. ఆ మహమ్మారి వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తుండగా ఉత్తర కొరియాలో మాత్రం ప్రవేశించలేదు. ఆ దేశం తీసుకున్న చర్యలు కలిసి వచ్చాయి. అయితే తాజాగా అక్రమ వలసదారుడి ద్వారా ఆ వైరస్ వ్యాపించింది. దీంతో ఆ దేశం అప్రమత్తమైంది. 200లకు పైగా దేశాల్లో వైరస్ పరిస్థితి చూసి కట్టడి చర్యలు ముమ్మరం చేసింది. అయితే గతంలోనే కేసులు నమోదైనా బయటకు ప్రకటించలేదని వార్తలు వస్తున్నాయి.తాజాగా ఆ దేశమే అధికారికంగా ప్రకటించింది.

దక్షిణ కొరియా నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో వైరస్ లక్షణాలు కనిపించాయి. జ్వరం, దగ్గు, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులతో ఆ వ్యక్తి ఆస్పత్రిలో చేరాడు. వైద్య పరీక్షలను నిర్వహించగా పాజిటివ్ తేలింది. వైరస్ బారిన పడ్డ ఆ వ్యక్తి మూడేళ్లుగా దక్షిణ కొరియాలో నివసిస్తున్నాడు. ఈ నెల 19వ తేదీన అక్రమంగా సరిహద్దులను దాటుకుని స్వదేశానికి తిరిగి వచ్చాడు. దక్షిణ కొరియా సరిహద్దులకు ఆనుకునే ఉంటుంది ఈ కయీసాంగ్ నగరం. ఆ నగరంలో పరిశ్రమలు అధికం. ఉత్తర కొరియాలోకి ప్రవేశించిన ఈ ఐదు రోజుల వ్యవధిలో అతను ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యాడు? అతడి కుటుంబసభ్యుల వివరాలు ఆరా తీస్తున్నారు. దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని కిమ‌జొంగ్ ఆదేశించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) వెల్లడించింది.

ఈ వార్తతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జొంగ్ ఉన్ వెంటనే అప్రమత్తమై సంచలన నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర పరిస్థితిని విధించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి అత్యవసర పరిస్థితిని విధించారు. ఆదివారం నుంచి ఉత్తర కొరియాలో అమల్లోకి వచ్చింది. వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే కిమ్‌జొంగ్ వెంటనే పార్టీ ప్రతినిధులతో అత్యవసరంగా పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహించారు. వైరస్ లక్షణాలు కనిపించిన వ్యక్తి నివసిస్తున్న కయీసంగ్ నగరాన్ని సీల్‌ డౌన్ చేయాలని ఆదేశించారు. అత్యంత కఠినంగా అత్యవసర పరిస్థితులను నిర్వహించాల్సి ఉంటుందని ఆయన ఆదేశించినట్లు సమాచారం.

ఈ సందర్భంగా ళకియాంగ్ నగరంలో వైరస్ సోకిన వ్యక్తి తిరిగిన ప్రదేశాల్లో ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలను చేయడం, వారిని క్వారంటైన్‌కు తరలించేలా ఏర్పాట్లు చేయాలని కిమ్‌జొంగ్ ఆదేశాలను జారీ చేసినట్లు ఆ దేశ అధికార మీడియా తెలిపింది. వైరస్ ను ఎదుర్కొనేందుకు ఉత్తర కొరియా ఎప్పుడో సిద్ధంగా ఉంది. రష్యా నుంచి ఉత్తర కొరియా ఆ దేశం నుంచి వేల సంఖ్యలో వైరస్ కిట్లను ఇదివరకే తెప్పించుకుంది. కొన్ని పొరుగు దేశాల నుంచీ కిట్లను కొనుగోలు చేసింది. ముందుజాగ్రత్త చర్యగా క్వారంటైన్ సెంటర్లను నెలకొల్పింది. సరిహద్దులను మూసివేసింది. సరిహద్దు నగరాల్లో కఠిన ఆంక్షలను విధించింది. కొద్దిరోజుల కిందటే ఈ ఆంక్షలను సడలించింది. వైరస్ వ్యాప్తితో మరోసారి దేశ సరిహద్దులు మూసివేయొచ్చని తెలుస్తోంది. దక్షిణ కొరియా నుంచి అక్రమంగా సరిహద్దులను దాటుకుని వచ్చిన ఉదంతంపై కిమ్‌జొంగ్ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. దీనికోసం ఆర్మీ అధికారులతో ఓ కమిటీని వేశారు. వైరస్ వ్యాప్తి చెందకూడదని కఠిన ఆదేశాలను జారీ చేసినట్లు ఆ దేశ అధికార మీడియా కేసీఎన్ఏ తెలిపింది.