Begin typing your search above and press return to search.

వారాహి యాత్ర తొలిదశ ముగిసింది... మళిదశ ఎప్పుడంటే...?

By:  Tupaki Desk   |   1 July 2023 12:05 PM GMT
వారాహి యాత్ర తొలిదశ ముగిసింది... మళిదశ ఎప్పుడంటే...?
X
జూన్ 14వ తేదీ నుంచి అన్నవరం లో పూజల అనంతరం వారాహి యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. నాడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొదలైన జనసేన వారాహి యాత్ర జూన్ 30న భీమవరం సభతో ముగుస్తుందని తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ విషయంపై నేడు జనసేన నుంచి ఆన్ లైన్ వేదికగా అధికారిక ప్రకటన వెలువడింది. మలిదశ ఎప్పుడనే విషయాల పైనా స్పందించింది.

అవును... ఆంధ్రప్రదేశ్ లో పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర తొలిదశ పూర్తయ్యిందని జనసేన ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈ తొలిదశ యాత్ర లో వైసీపీ ప్రభుత్వ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పై జనసేనాని స్పందించారని తెలిపింది. ఈ నేపథ్యంలో... బహిరంగ సభల్లోని ప్రసంగాల్లో పవన్ ప్రస్థావించిన విషయాలను జనసేన ఆన్ లైన్ వేదికగా మరోసారి ప్రస్థావించింది.

ఇందులో భాగంగా... దళితుల సంక్షేమ పథకాలు, నిరుద్యోగ యువత, ఉపాధి అవకాశాలు, విద్యార్థుల కష్టాల పై ఏపీ సర్కార్ ని పవన్ ప్రశ్నించారని పేర్కొంది! ఇదే సమయంలో రైతుల సమస్యలు, పంట నష్ట బీమా, వెనుకబడిన వర్గాల సమస్యలు, రోడ్ల పరిస్థితి పై ప్రభుత్వాన్ని ఎండగట్టారని ప్రకటించింది. ఈ సందర్భంగా సభల్లో పవన్ ప్రసంగాల్లో ప్రస్థావించిన అంశాలను ఆ ట్వీట్ లో పొందుపరిచింది.

అనంతరం మళిదశ యాత్ర పై జనసేన స్పందించింది. స్పష్టంగా తేదీలు ప్రకటించకపోయినా.. షెడ్యూల్ విడుదల చేయకపోయినా... మరికొద్ది రోజుల్లో మొదలవ్వబోతోందని మాత్రం తెలిపింది.

కాగా... జనసేన వారాహి యాత్ర లో భాగంగా... ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లో పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ బహిరంగ సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇదే సమయం లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో పవన్ వారాహి యాత్ర కొనసాగింది.