Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే తొలి ఎయిర్ పోర్టు.. శంషాబాద్.. ఎందులోనంటే?

By:  Tupaki Desk   |   12 May 2023 12:46 PM GMT
ప్రపంచంలోనే తొలి ఎయిర్ పోర్టు.. శంషాబాద్.. ఎందులోనంటే?
X
ఎన్నింటికి వస్తావ్? అని అడిగితే ఐదింటికి అని చెబితే.. ఇండియా టైమా?జపాన్ టైమా? అన్న మాట కొందరి నోట వినిపిస్తూ ఉంటుంది. భారతీయుల సమయపాలన మీద ఉండే జోకులు అన్ని ఇన్ని కావు. మనం చెప్పిన టైం కంటే గంట ఆలస్యంగా వెళ్లటమే పర్ ఫెక్టుగా వెళ్లినట్లుగా చాలామంది తీరు ఉంటుంది.

అలాంటి దేశంలో.. సెకన్లను.. మిల్లీ సెకన్లను సైతం లెక్క కట్టుకొని బతికే ఎన్నో దేశాలకు మించి.. ప్రపంచంలోనే సమయపాలనలో మొదటి స్థానాన్ని మన శంషాబాద్ ఎయిర్ పోర్టు సొంతం చేసుకోవటానికి మించింది మరింకేం ఉంటుంది?

ఏమియేషన్ విశ్లేషణ సంస్థ 'సిరియమ్' తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత సమయపాలన (పంక్చువాలిటీ) కలిగిన విమానాశ్రయంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు నిలిచింది. మార్చి నెలలో శంషాబాద్ ఎయిర్ పోర్టు 90.43 శాతం సమయపాలన ను నమోదు చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సమయపాలనలో 90 శాతం మార్కును దాటిన ఏకైక ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు శంషాబాద్ ఒక్కటే కావటం విశేషం.

గత నవంబరులో పంక్చువాలిటీ సూచీలో శంషాబాద్ ఎయిర్ పోర్టు 88.44 శాతం ఉంటే.. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకోవటం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాల్లోని 50 లక్షల విమానాల రాకపోకల్ని విశ్లేషించిన సిరియమ్ సంస్థ.. వాటిని విశ్లేషించి.. తాజా నివేదికను సిద్ధం చేసింది.

సమయపాలనతో పాటు.. గ్లోబల్ ఎయిర్ పోర్ట్.. లార్జ్ ఎయిర్ పోర్టు విభాగాల్లోనూ శంషాబాద్ ఎయిర్ పోర్టు అగ్రస్థానంలో నిలిచినట్లుగా పేర్కొన్నారు. ఏమైనా.. అంతర్జాతీయ స్థాయిలో పలు దేశాల ఎయిర్ పోర్టులతో పోటీ పడి అగ్రస్థానంలో నిలవటం నిజంగా ఆసక్తికరం. తెలుగు వారందరికి గర్వకారణంగా చెప్పక తప్పదు.