Begin typing your search above and press return to search.

అర్ధరాత్రి తర్వాతే ఫలితాలు..క్లారిటీ ఇచ్చిన ఈసీ - ఈవీఎంలను ట్యాంపర్ చేశారంటూ విపక్షాల ఆరోపణలు!

By:  Tupaki Desk   |   10 Nov 2020 3:30 PM GMT
అర్ధరాత్రి తర్వాతే ఫలితాలు..క్లారిటీ ఇచ్చిన ఈసీ - ఈవీఎంలను ట్యాంపర్ చేశారంటూ విపక్షాల ఆరోపణలు!
X
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ఆసక్తి గా మారాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు పూర్తి భిన్నంగా BJP, JDU సారధ్యంలోని అధికార NDA కూటమి మరోసారి అధికారంలోకి వచ్చే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా... NDA కూటమికి 125 సీట్లలో ఆధిక్యంలో ఉంది. దీనితో ఎన్డీఏ పవర్ ‌లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే, బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు మంగళవారం రాత్రి తర్వాతే వెలువడుతాయని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం కరాకండిగా చెప్పేసింది. కౌంటింగ్ ఆలస్యంపై సర్వత్రా గందరగోళం నెలకొనడంతో బీహార్ సీఈవో హెచ్ ఆర్ శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్లు చంద్రభూషణ్ కుమార్, సందీప్ జైన్ లు మధ్యాహ్నం ప్రెస్ మీట్ నిర్వహించారు.

బీహార్ లో ఈసారి దాదాపు 4 కోట్ల ఓట్లు రాగా, కౌంటింగ్ డే మంగళవారం మధ్యాహ్నం 2గంటల సమయానికి కేవలం 1.2 కోట్ల ఓట్లను మాత్రమే లెక్కించినట్లు ఈసీ ప్రకటించింది. 2015తో పోల్చుకుంటే ఈసారి కరోనా పరిస్థితుల వల్ల పోలింగ్ బూత్ లను పెంచామని, దాంతో గతంలో కంటే 63 శాతం ఎక్కువ ఈవీఎంలను వినియోగించామన్నారు. కౌంటింగ్ ప్రక్రియలోనూ కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఒక్కో నియోజకవర్గానికి గరిష్టంగా 35 రౌండ్ల కౌంటింగ్ ఏర్పాట్లు చేశామని తెలిపింది. టేబుళ్ల సంఖ్య 14 నుంచి గరిష్టంగా 55కు పెంచామని చెప్పారు. సిబ్బంది పనిలో తేడా లేకున్నా, వారు లెక్కించే ఓట్ల కౌంట్ తక్కువగా ఉండటమే ఫలితాల ఆలస్యానికి ప్రధాన కారణమని, ఈ రోజు రాత్రి తర్వాతే తుది ఫలితాలు వస్తాయని చెప్పింది.

బీహార్‌లో కౌంటింగ్ మొదలైన కాసేపటికే.. మందకోడిగా సాగుతున్నా.. అప్పటికి 10 శాతం ఓట్లు కూడా లెక్కపెట్టకున్నా ఎన్డీయే ఆధిక్యాల పరంగా మెజారిటీ మార్క్‌ను దాటడం అనుమానాలకు తావిస్తున్నదని, ఈవీఎల ట్యాపరింగ్ జరిగి ఉండొచ్చని కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది. భూమిపై నుంచే పరికరాలతో అంగారకుడు, చంద్రుడి దశాదిశలను నిర్దేశిస్తుంటే ఈవీఎంలను ఎందుకు హ్యాక్ చేయలేరని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ ట్వీట్ చేశారు. దీనితో దీనిపై రచ్చ మొదలు కావడంతో ... ఈసీ దీనిపై వివరణ ఇచ్చింది. మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి మ్యాజిక్ ఫిగర్ 122కాగా, తాజా అప్ డేట్ ప్రకారం.. ఎన్డీఏ కూటమి 120 స్థానాల్లో, మహాకూటమి 110 స్థానాల్లో, ఎల్జేపీ 3, ఇతరులు 10 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మహాకూటమిలోని కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే ఈసారి లీడింగ్ సీట్లు తగ్గడంతో ఆ పార్టీ నేతలు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు.