Begin typing your search above and press return to search.

'సంక్షోభంలో సంక్షేమం..' పోరెత్తిన టీడీపీ..

By:  Tupaki Desk   |   20 Sep 2022 9:30 AM GMT
సంక్షోభంలో సంక్షేమం.. పోరెత్తిన టీడీపీ..
X
సంక్షోభంలో సంక్షేమం నినాదంతో నారా లోకేష్‌ ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభా పక్షం నిరసన చేపట్టింది. వివిధ సంక్షేమ పథకాల రద్దును నిరసిస్తూ అసెంబ్లీ సమీపంలోని తుళ్లూరు ట్రాఫిక్ పీఎస్ వద్ద తెలుగుదే శం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్న క్యాంటీన్లు, పెళ్లి కానుక, పండుగ కానుకలు, అంబేడ్కర్ విదేశీ విద్య పథకాల రద్దును నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. సబ్ ప్లాన్ నిధుల పక్కదారి, అమ్మ ఒడి కుదింపు, డ్వాక్రా కి టోకరా, కరెంట్ బిల్లుల ఆధారంగా పింఛన్ కోత తదితర అంశాలపై ఆందోళన చేపట్టారు.

రేషన్ బియ్యం కుంభకోణం, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నయవంచన నినాదాలతో కాలినడకన అసెంబ్లీకి వెళ్లారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని టీడీపీ నేతలు మండిపడ్డారు. తెలుగుదేశం అమలు చేసిన పథకాల పేర్లు మార్చి సగం కూడా ఇవ్వట్లేదని దుయ్యబట్టారు. వైసీపీ నేతలే బియ్యం అక్రమ రవాణా చేస్తూ సంక్షేమానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. పేదల పథకాలు రద్దు చేసిందని, ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని తెలిపారు.

సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టి బడుగు బలహీన వర్గాలను నాశనం చేస్తోందంటూ టీడీపీ ఎస్సీ నేతలు ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఛలో అసెంబ్లీకి వెళ్తున్న టీడీపీ ఎస్సీ నాయకురాలు కంభంపాటి శిరీష పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మల్కాపురం వద్ద శిరీషను తాళ్లతో కట్టి మగ పోలీసులు లాగారు. పోలీసుల తీరు పట్ల శిరీష తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వం సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిందని నిరసిస్తూ అసెంబ్లీ సమీపంలో తెలుగుదేశం నేతలు ఓ భవనం ఎక్కి ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు నేతలు పాల్గొన్నారు. దళిత ద్రోహి సీఎం అంటూ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్ రాజు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

నేతల్ని పోలీసులు బలవంతంగా భవనంపై నుంచి దించి అరెస్టు చేశారు. అరెస్టు చేసే సమయంలో పోలీసులకు, నాయకులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. అసెంబ్లీ సమీపంలో పలువురు కార్యకర్తలు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. అతి కష్టం మీద వారినీ పోలీసులు కిందకు దింపారు.

తెలుగుదేశం ఛలో అసెంబ్లీకి పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ పరిసరాలను డ్రోన్‌తో పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. పొలాల నుంచి వస్తారనే అనుమానంతో పొలాల చుట్టూ డ్రోన్లు అమర్చారు. అసెంబ్లీకి దారితీసే అన్ని మార్గాల్లోనూ పోలీసులు నిఘా పెట్టారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపట్టారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.