Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ విషాదం.. ఏడేళ్ల కొడుకును చంపేసిన తండ్రి

By:  Tupaki Desk   |   30 Nov 2020 5:45 AM GMT
లాక్ డౌన్ విషాదం.. ఏడేళ్ల కొడుకును చంపేసిన తండ్రి
X
కనురెప్ప కంటిని కాటేస్తుందా? అంటే.. కాదంటారు. కానీ.. మారిన పరిస్థితులు మనుషుల్ని.. వారి బంధాల్ని.. అనుబంధాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. గతానికి భిన్నంగా.. ఎప్పుడూ వినని రీతిలో కొన్ని ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. బంధాలకు కొత్త సందేహాల్ని తీసుకొస్తున్న ఈ తరహా ఉదంతాలు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి. అలాంటి ఉదంతమే ఒకటి యూపీలోని కాన్పూరులో చోటు చేసుకుంది.

లాక్ డౌన్ తో ఉద్యోగాన్ని కోల్పోయిన ఒక తండ్రి.. తాను అల్లారుముద్దుగా పెంచుకునే ఏడేళ్ల కుమారుడ్ని చంపేసిన దారుణం బయటకు వచ్చింది.తీవ్ర సంచలనంగా మారిన ఈ ఉదంతం గురించి తెలిస్తే.. గుండె పిండేసిన భావన కలుగక మానదు. 43 ఏళ్ల శ్రీవాస్తవ తన భార్య సారిక.. ఇద్దరు కుమార్తెలు.. ఒక కుమారుడితో కలిసి కాన్పూరులో నివసిస్తుంటారు. లాక్ డౌన్ కారణంగా అతడి ఉద్యోగం పోయింది. దీంతో.. అతను తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు. ఇక.. అతని సతీమణి సారిక ప్రభుత్వ టీచర్ గా పని చేస్తుంటారు.

ఇటీవల కాలంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న శ్రీవాస్తవ.. కొడుకు శశాంక్ తో కలిసి నిద్రపోయాడు. తెల్లవారుజాము ప్రాంతంలో భార్యను నిద్ర లేపి.. ఇక తమ కుమారుడ్ని ఎవరు ఇబ్బంది పెట్టలేరని.. అతనికి ఎలాంటి సమస్యలు రావని భర్త చెప్పటంతో అనుమానం వచ్చిన ఆమె.. కొడుకును చూస్తే విగతజీవిగా పడి ఉన్నాడు. ఏం చేశావని అడిగితే.. కొడుక్కి ఎలాంటి సమస్యలు రాకూడదని చంపేసి.. అతడితో కలిసి నిద్రపోయినట్లు చెప్పటంతో ఆమె షాక్ తిన్నారు.

వెంటనే.. జరిగిన ఘటన గురించి పోలీసులకు.. బంధువులకు సమాచారం ఇచ్చారు. ఉద్యోగం పోయినప్పటి నుంచి తీవ్ర ఒత్తిడితో పాటు.. మానసిక కుంగుబాటుకు గురైన అతడు.. మానసికంగా సరిగా ఉండటం లేదు. కొడుకును అల్లారు ముద్దుగా పెంచటంతో పాటు.. అపురూపంగా చూసుకునేవాడని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తు గురించి తరచూ ఆందోళన చెందేవాడని సారిక వెల్లడించారు. తాను చేసిన నేరాన్ని శ్రీవాస్తవ ఒప్పుకోవటంతో అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదంతం సంచలనంగా మారింది.