Begin typing your search above and press return to search.

'జగనన్నే మా భవిష్యత్తు'కు షాకిచ్చిన రైతు!

By:  Tupaki Desk   |   18 April 2023 9:48 AM GMT
జగనన్నే మా భవిష్యత్తుకు షాకిచ్చిన రైతు!
X
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పెద్ద లక్ష్యమే నిర్దేశించుకున్నారు. ఇందులో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు వరకు నిర్వహించాలని జగన్‌ నిర్దేశించారు. ఇందులో భాగంగానే ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు 'జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఇందులో భాగంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రంలో ప్రతి ఇంటికీ వెళ్లి ఈ నాలుగేళ్లలో జరిగిన మంచిని ప్రజలకు వివరిస్తున్నారు. పథకాలు వస్తున్నాయా? మళ్లీ ఇలాంటి పథకాలు కావాలా? మరోసారి జగన్‌ ను గెలిపించడానికి ఇష్టపడుతున్నారా? వంటి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడుతున్నారు. వాటిని తమ పుస్తకాల్లో నమోదు చేసుకుంటున్నారు. జగన్‌ కు మద్దతు తెలపడానికి మొబైల్‌ నంబర్‌ కు మిస్డ్‌ కాల్‌ ఇప్పిస్తున్నారు.

ఈ క్రమంలో 'మా నమ్మకం నువ్వే జగన్‌' పేరిట రూపొందించిన స్టిక్కర్లను ప్రజల ఇళ్లకు, మొబైల్‌ ఫోన్లకు అతికిస్తున్నారు. అయితే వైసీపీ నేతల బలవంతం మీద తమ ఇళ్లకు, ఫోన్లకు స్టిక్కర్లు అతికించుకుంటున్న ప్రజలు వారు వెళ్లి పోగానే ఆ స్టిక్కర్లను పీకేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటి గోడకు అతికించిన 'మా నమ్మకం నువ్వే జగన్‌' స్టిక్కర్‌ ను ఓ కుక్క పీకేసిన వీడియో వైరల్‌ గా మారిన సంగతి తెలిసిందే.

తాజాగా వైసీపీ నేతలకు ఒక రైతు షాకిచ్చాడు. తమ ఇంటి గోడకు అతికించిన మా నమ్మకం నువ్వే జగన్‌ స్టిక్కర్‌ ను ఆ రైతు స్వయం పీకేశాడు. ముందు తమ గ్రామంలో సమస్యలు పరిష్కరించిన తర్వాతే తన ఇంటికి 'మా నమ్మకం నువ్వే జగన్‌' స్టిక్కరు అతికించాలని తేల్చిచెప్పాడు. సమస్యలు పరిష్కరించకుండా ఈ స్టిక్కర్లు ఏంటని నిలదీశాడు.

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం వెలగవాడ పంచాయతీ పీఆర్‌ రాజుపేటలో ఈ ఘటన జరిగింది. ఆ గ్రామానికి చెందిన రైతు కండాపు ప్రసాదరావు తన ఇంటికి అతికించిన మా నమ్మకం నువ్వే జగన్‌ స్టిక్కర్‌ ను తీసేశారు.

పీఆర్‌ రాజుపేట గ్రామంలో 'జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్రమాన్ని స్థానిక వైసీపీ నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు ఇంటికి వైసీపీ నేతలు స్టిక్కరు అతికించగా.. ఆయన దాన్ని తొలగించాడు. తమ గ్రామానికి సరైన రోడ్డు లేదని.. ముందు రోడ్డు సదుపాయం కల్పించాలని కోరాడు. అలాగే తోటపల్లి పాత ఆయకట్టు కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశాడు. జలసిరి కింద గ్రామంలో బోర్లు వేయలేదని మండిపడ్డాడు. ముందు సమస్యలు పరిష్కరించాక.. అప్పుడు మా నమ్మకం నువ్వే జగన్‌ అనాలని తేల్చిచెప్పాడు.