Begin typing your search above and press return to search.

మేయర్ ఎంపికకి ముహూర్తం ఫిక్స్ ..టీఆర్‌ ఎస్ పైనే అందరి దృష్టి!

By:  Tupaki Desk   |   22 Jan 2021 1:15 PM GMT
మేయర్ ఎంపికకి ముహూర్తం ఫిక్స్ ..టీఆర్‌ ఎస్ పైనే అందరి దృష్టి!
X
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు కొత్త మేయర్ వచ్చే సమయం ఆసన్నం అయింది. గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ ఎం సీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆర్.పార్థసారథి ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్‌ ను ఎన్నుకోనున్నారు. జీహెచ్ ఎం సీ పరిధిలోని ఓ జిల్లా కలెక్టర్ ఇందుకు ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు.

షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన జీహెచ్ ఎం సీ కార్పొరేటర్లతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ఆ తర్వాత 12.30 నిమిషాలకు మేయర్ ఎన్నిక, ఆ తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక చేపడతారు. ఎన్నికల పర్యవేక్షణకు ఐఏఎస్ స్థాయి అధికారిని ఎన్నికల సంఘం నియమించింది. ఏదైనా కారణాలతో ఎన్నిక నిర్వహించలేని పక్షంలో ఫిబ్రవరి 12న ఎన్నిక నిర్వహిస్తారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెలువడి 40 రోజులు దాటిపోతుంది. అయితే, ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో.. ఈసారి మేయర్ ఎవరవుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

గత ఏడాది డిసెంబర్ మాసంలో జీహెచ్ ఎం సీ ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాల్లో హంగ్‌ ఏర్పడింది. అధికార టీఆర్‌ ఎస్‌ 55 సీట్లకే పరిమితమైంది. 2016 ఎన్నికల్లో 99 చోట్ల నెగ్గి ఏకపక్షంగా గ్రేటర్‌ మేయర్‌ పీఠాన్ని సొంతం చేసుకున్న గులాబీ పార్టీకి ఈసారి 44 స్థానాలు తగ్గాయి. 48 వార్డులు గెలిచి బీజేపీ రెండో స్థానంలో నిలిచింది.

ఇక పాతబస్తీలో మరోసారి సత్తా చాటిన ఎంఐఎం 44 వార్డులు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లకే పరిమితమయింది. బీజేపీ భారీగా వార్డులను గెలవడంతో టీఆర్ ఎస్ కు ఊహించని షాక్ తగిలింది. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ నెలకొంది. ప్రస్తుత జీహెచ్ ‌ఎంసీ పాలకమండలి పదవీకాలం ఈనెల 10వ తేదీతో ముగిసింది.

మొత్తం 52 మంది ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకుంటే మేయర్ ఎన్నికలో ఓటువేసే వారి సంఖ్య 202కి చేరనుంది. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 102 మేజిక్ ఫిగర్ అవసరం ఉంటుంది. మొత్తం 52 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో టీఆర్‌ ఎస్ ‌కు అధికంగా 37, బీజేపీకి ముగ్గురు, కాంగ్రెస్‌ కు ఒక్కరు, ఎంఐఎంకు 10 మంది ఉన్నారు. జీహెచ్ ‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ 56 స్థానాలు గెలిచింది. ఆ పార్టీకి ఉన్న ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్య 37. మొత్తం కలిపితే టీఆర్ ఎస్ బలం 93. కానీ మేయర్ పీఠం దక్కాలంటే.. మరో 9 మంది సభ్యుల మద్దతు అవసరం. దీనితో మేయర్ పీఠం మూడు పార్టీల్లో ఎవరి వశం అవుతుందో అంటూ అందరిలో ఉత్కంఠత నెలకొంది.