Begin typing your search above and press return to search.

ఆనందంతో వినోద్ ఉక్కిరిబిక్కిరి..ఉమ్మడి రాష్ట్రంలో కల ఇప్పటికి నిజమైందట

By:  Tupaki Desk   |   8 Jan 2020 4:39 AM GMT
ఆనందంతో వినోద్ ఉక్కిరిబిక్కిరి..ఉమ్మడి రాష్ట్రంలో కల ఇప్పటికి నిజమైందట
X
తెలుగు నేల మీద ప్రముఖ ఐటీ కంపెనీలు అన్నంతనే హైదరాబాద్ గుర్తుకు వస్తుంది. తర్వాత విశాఖపట్నం నిలుస్తుంది. ఇక.. టైర్ టూ సిటీలైన విజయవాడ..రాజమండ్రి.. కరీంనగర్.. వరంగల్ లాంటి నగరాల్లో మాత్రం పెద్ద కంపెనీలు రాలేదు. ఈ కొరతను తీరుస్తూ తాజాగా ప్రముఖ ఐటీ కంపెనీలైన టెక్ మహీంద్రా.. సైయెంట్ సంస్థలు తమ క్యాంపస్ లను వరంగల్ లో ఏర్పాటు చేయటం పై ఆనందం వ్యక్తమవుతోంది.

ఉమ్మడి రాష్ట్రంలో టైర్ టూ సిటీస్ లోనూ ఐటీ సంస్థల్ని ఏర్పాటు చేయాలన్నప్పుడు అప్పటి ప్రభుత్వ ప్రాధామ్యాలలో విశాఖపట్నం.. విజయవాడ పేర్లే కనిపించాయని.. తెలంగాణకు చెందిన ఏ పట్టణం లెక్కలోకి రాలేదని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి. ఉమ్మడి రాష్ట్రంలో తాను కన్న నేటికి నిజమైందంటూ ఆయన ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో కొనసాగుతున్న వేళ.. టైర్ 2 స్కీంలో భాగంగా విజయవాడ.. విశాఖపట్నం.. లాంటి నగరాలకు ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణలోని కరీంనగర్.. వరంగల్ లాంటి పట్టణాల్లో కూడా ఏర్పాటు చేయాలని తాను అప్పట్లో ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తాజాగా.. ఆ లోటు కొంత తీరుతూ వరంగల్ పట్టణంలో రెండు ప్రముఖ ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ.. చేదోడు వాదోడుగా ఉండాలన్న తన స్వప్నం కొంతమేర తీరినట్లుగా ఆయన చెబుతున్నారు. వరంగల్ లో తాజాగా మొదలైన ఐటీ కంపెనీలు.. ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు పూర్తి అయిన వెంటనే కరీంనగర్ లోనూ ఐటీ కంపెనీలు షురూ కానున్న విషయాన్ని వెల్లడించారు.కలలు కంటూ ఉంటే ఏదో ఒక రోజుకు సాకారం కావటం అన్న దానికి ఈ ఉదాహరణను సైతం చేర్చాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.