Begin typing your search above and press return to search.

నిజాం కాలం నాటి డ్రైనేజ్ .. వారెవ్వా అంటున్న భాగ్య నగర వాసులు !

By:  Tupaki Desk   |   19 Oct 2020 10:20 AM GMT
నిజాం కాలం నాటి డ్రైనేజ్ .. వారెవ్వా అంటున్న భాగ్య నగర వాసులు !
X
హైదరాబాద్ ..విశ్వ నగరంగా ప్రపంచ వ్యాప్తంగా ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది. ఐటీ పరంగా కానీ , టూరిస్ట్ స్థలాల పరంగా కానీ హైదరాబాద్ కి దేశంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. బుద్దుడి విగ్రహం , చార్మినార్ , గోల్కొండ ఖిలా ఇలా హైదరాబాద్ పేరు చెప్తే ఎన్నో గుర్తుకు వస్తాయి. కానీ, గత వారం కురిసిన భారీ వర్షాల దెబ్బకి విశ్వ నగరం ముసుకు మొత్తం తొలగిపోయింది. విశ్వ నగరం అంటూ ఒకవైపు డప్పు కొడుతుంటే మరోవైపు వరదల దెబ్బకి నగరం సముద్రాన్ని తలపించింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లోని కాలనీలు ముంపులోనే ఉన్నాయి. ప్రస్తుత హైదరాబాద్ పరిస్థితి చూసి ..విశ్వ నగరం అంటే ఇదేనా అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో హైదరాబాద్ పై మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

భారీ వర్షాలకు నగరం మొత్తం అతలాకుతలం అయినప్పటికీ .. కుతుబ్‌ షాహీ, ఆసఫ్ ‌జాహిల కాలంలో ఏర్పడ్డ బస్తీ లు కొన్ని ఇప్పటికీ చెక్కుచెదరకుండా, వరద ముప్పు లేకుండా ఉన్నాయి. పాత బస్తీలోని పలు పాత మొహల్లాల నివాసితులు తమ ప్రాంతాలకు ఇప్పటికీ వరద ముప్పు లేదని, దానికి నాటి నిజాం పాలకులు, ఇంజినీర్ల కృషే కారణమని అంటున్నారు. చార్మినార్, మొఘల్ ‌పురా, ఖిల్వాట్, షా అలీ బండా, ఫతే దర్వాజా, పురాని హవేలి, నూర్ ‌ఖాన్‌ బజార్, హుస్సేనీ ఆలం, దూద్ ‌బౌలి, ఇంజిన్‌ బౌలి, కోట్ల అలీజా, పత్తర్‌ గట్టి, పంజేషా పంచ మొహల్లా, చంచల్‌ గూడ, ఖాజీపురా, కార్వాన్, జియాగుడ, అఫ్జల్ ‌గంజ్, ఫీల్‌ ఖానా, జుమేరాత్‌ బజార్‌ తదితర ప్రాంతాలు భారీ వరదల్లోనూ ముంపునకు గురికాలేదు. జనాభా అనేక రెట్లు పెరిగినప్పటికీ వందేళ్ల క్రితం నిజాం కాలంలో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటికీ సమర్థవంతంగా పనిచేస్తోంది. వర్షం పడిన గంట, అరగంటలోపే పాతబస్తీలోని అత్యధిక బస్తీల్లో నీరు డ్రైనేజీ ద్వారా వెళ్లిపోతోంది.

1908లో మూసీ వరద విపత్తు తర్వాత నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను సంప్రదించి హైదరాబాద్‌ నగరాన్ని వరద నుంచి రక్షించేందుకు, నీరు సాఫీగా వెళ్లేందుకు డ్రైనేజీ వ్యవస్థను సిద్ధం చేయాలని కోరారు. హైదరాబాద్‌ నగర పునర్నిర్మాణంలో సలహాలు ఇవ్వాలని, వరదల నుంచి నగర భవిష్యత్‌ రక్షణ కోసం ప్రతిపాదనలు రూపొందించాలని, నీటిపారుదలకు సంబంధించి సర్వం సిద్ధం చేయాలని కోరారు. 1911లో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ మరణించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ నగరంలో మెరుగైన పౌర సౌకర్యాలను అందించడానికి ‘సిటీ ఇంప్రూవ్‌మెంట్‌ బోర్డు’ను స్థాపించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచనలు అమలు చేశారు. ఆ కాలంలోనే పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థతో పాటు, వర్షపు నీరు వెళ్లడానికి రోడ్లపై ప్రత్యేక భూగర్భ నీటిపారుదల కోసం లైన్స్‌ ఏర్పాటు చేశారు. ఆ వ్యవస్థనే ఇప్పటికి అక్కడ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. నిజాం కాలంలో పకడ్బందీగా నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ నేటికీ చెక్కు చెదరకుండా ఉంది. దీంతో పాటు భూగర్భ అంతర్గత పైప్‌లైన్‌ల డిజైన్‌ వ్యవస్థ నేటికీ ఆయా ప్రాంతాలను వరద ముప్పు నుంచి కాపాడుతోంది. కొత్తగా ఏర్పడ్డ బస్తీలే జలమయం అయ్యాయి.