Begin typing your search above and press return to search.

ప్రయాణికుని ఘనకార్యం.. గాల్లోనే తెరుచుకున్న విమానం డోర్‌

By:  Tupaki Desk   |   26 May 2023 10:07 PM GMT
ప్రయాణికుని ఘనకార్యం.. గాల్లోనే తెరుచుకున్న విమానం డోర్‌
X
విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుని 'ఘనకార్యం'తో గాల్లో ఎగురుతుండగానే డోర్‌ తెరుచుకుంది. దీంతో ఒక్కసారిగా క్యాబిన్‌ లోకి భయంకరంగా గాలి చొచ్చుకువచ్చింది. అందులో ఉన్న ప్రయాణికులు గజగజ వణికిపోయారు. కొద్ది క్షణాల్లో విమానం కూలిపోతుందని, తమ ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని అంతా అనుకున్నారు. దక్షిణ కొరియాకు చెందిన ఈ విమానం కథ ఏంటో చూద్దాం.

దక్షిణ కొరియాలోని బెజూ ద్వీపం నుండి డెయగూ నగరానికి ఏసియానా ఎయిర్‌ లైన్స్‌ ఎయిర్‌ బస్‌ విమానం-321 బయలు దేరింది. మొత్తం 194 మంది ప్రయాణికులు ఉన్నారు. రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం గంట. అంత సవ్యంగా సాగుతోంది. కొద్ది నిమిషాల్లో విమానం రన్‌ వేపైకి ల్యాండ్‌ కాబోతోంది. ఇంతలో అత్యవసర ద్వారం వద్ద ఉన్న ప్రయాణికుడు ఉన్నట్టుండి ఎగ్జిట్‌ బటన్‌ నొక్కేందుకు ప్రయత్నిస్తున్నాడు.

తోటి ప్రయాణికులు వారించారు. కానీ అప్పటికే ప్రమాదం ముంచుకొచ్చింది. ఎమర్జెన్సీ డోర్‌ తెరుచుకుంది. ఒక్కసారిగా భయంకరమైన రీతిలో గాలి లోపలికి చొరబడింది. ప్రయాణికులు బెంబేలెత్తారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చున్నారు. పైలట్‌ చాకచక్యంతో విమానాన్ని ల్యాండ్‌ చేయడంతో పెనుప్రమాదం తప్పింది. కానీ చాలా మంది ప్రయాణికులకు భారీ గాలి ప్రభావంతో శ్వాసకోస వ్యాధులు తలెత్తాయి. కొంత మంది స్వల్పంగా గాయపడ్డారు.

డోర్‌ తెరిచినట్లు భావించిన వ్యక్తిని పోలీసులు అదుఉలోకి తీసుకున్నారు. ఈ చర్యకు పాల్పడడం వెనుక అతని ఉద్ధేశం ఏంటనేది విచారిస్తున్నారు. సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఏసియానా ఎయిర్‌ లైన్స్‌ వెల్లడించింది. ఈ ఘటనను విమానంలో ఉన్న కొంతమంది ప్రయాణికులు మొబైల్‌ లో చిత్రీకరించారు. విమానం లోపలికి వీస్తున్న భారీ గాలితో ప్రయాణికులు ఆందోళన చెందుతున్న దృశ్యాలు కనిపించాయి.