Begin typing your search above and press return to search.

అర్ధరాత్రి దౌత్యం.. సమసిన డోక్లాం

By:  Tupaki Desk   |   10 Sept 2017 11:30 AM IST
అర్ధరాత్రి దౌత్యం.. సమసిన డోక్లాం
X
డోక్లాం... భార‌త్‌-చైనా- టిటెట్‌ల మ‌ధ్య ఉన్న ప్రాంతం. ప్రపంచపటం మీద సూదిమొన మోపేంత భూభాగం కూడా కాదు. భూటాన్‌కు చెందిన ఆ చిన్న భూమి చెక్కమీద చైనా రోడ్డు వేసే నెపంతో కాలు మోపింది. భూటాన్‌తో రక్షణ ఒప్పందం కలిగిన భారత్ అడ్డువెళ్లింది. 73 రోజులపాటు తీవ్ర ఉత్కంఠ. రెండు ఆసియా దిగ్గజాల మధ్య యుద్ధం తప్పదా? అనేంతవరకు వెళ్లింది. చివరకు ఉభయపక్షాలు వెనుకకు తగ్గడంతో ఉద్రిక్తతలకు తెరపడింది. బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత్-చైనా భాయ్‌ భాయ్ కరచాలనాలతో డోక్లాం సమస్యకు తెరపడింది. అయితే సమస్య పరిష్కారం ఎలా జరిగిందీ వివరాలు పెద్దగా బయటకు రాలేదు. ఇప్పుడిప్పుడే అధికారవర్గాలు నోరు విప్పుతున్నాయి. అదీ పేర్లు వెల్లడించకుండా కావ‌డం గ‌మ‌నార్హం.

ఆగస్టు 27 సాయంత్రం చైనాలో భారత రాయబారి విజయ్ గోఖలేకు చైనా నాయకత్వం నుంచి పిలుపు వచ్చింది. అప్పుడాయన హాంకాంగ్‌లో ఉన్నారు. హడావుడిగా అర్ధరాత్రి దాటిన తర్వాత బీజింగ్ చేరుకున్నారు. రాత్రి 2 గంటలకు డోక్లాం చిక్కుముడి విప్పడంపై చైనా అధికారులతో ఆయన మంతనాలు మొదలయ్యాయి. మూడుగంటలు మల్లగుల్లాలు పడ్డ తర్వాత ఉభయపక్షాలకూ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించింది. మరుసటి రోజు రెండు దేశాలు ప్రతిష్టంభన తొలగిపోయినట్టు ప్రకటించడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. ఘర్షణలు నివారించి, అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని తీర్మానించుకున్నట్టు భారత్ - చైనా వెల్లడించాయి. ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య బ్రిక్స్ సదస్సు సందర్భంగా జరిపిన చర్చల్లో కుదిరిన స్థూల ఒప్పందం సమస్య పరిష్కారానికి పునాదిని వేసిందని సీనియర్ అధికారులు వెల్లడించారు. సంబంధాలను పరస్పర ప్రయోజనకరంగా, అభివృద్ధి రథాన్ని వేగంగా ముందుకు తీసుకువెళ్లే సాధనంగా ఉపయోగించుకోవాలని నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు.

డొక్లాం విష‌యంలో గ‌తంలో గంభీర ప్ర‌క‌ట‌న‌లు చేసిన చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ కూడా ఇదే చెప్పారు. సరిహద్దు ఘర్షణలను నివారించి ఆరోగ్యకరమైన, సుస్థిరమైన అభివృద్ధికి ఊతం ఇవ్వాలని బ్రిక్స్ సదస్సు సందర్భంగా విడిగా కలుసుకున్నప్పుడు నేతలిద్దరూ అంగీకారానికి వచ్చారని ఆయన శనివారం బీజింగ్‌ లో మీడియాకు చెప్పారు. భారత-చైనా సంబంధాలు పట్టాలు తప్పలేదు. రెండు దేశాల అనుబంధం ప్రపంచ భవిష్యత్తుకు ప్రతీక. పరస్పర ప్రయోజనకరమైన సహకారం అనివార్యం.. సరైన మార్గం అని వాంగ్ యీ నొక్కిచెప్పారు.

మ‌రోవైపు ప్రతిష్టంభన కొనసాగుతున్నప్పుడు చైనాతో సంబంధాలు ప్రభావితం కాకుండా ప్రధాని మోడీ జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ కాలంలోనే అరడజను మంది మంత్రులు చైనాకు అధికారిక కార్యక్రమాలపై వెళ్లివచ్చారు. దూకుడుకు పేరుపడ్డ మోడీ సంయమనంతో నెరపిన దౌత్యం ఫలితాలనిచ్చిందని అంటున్నారు. ఈ వివాదం నలుగుతున్నన్ని రోజులూ ప్రధాని మోడీ కఠినమైన క్రమశిక్షణను అమలు చేశారు. ప్రకటనలు విదేశాంగశాఖ ద్వారానే జరుగాలి. ఎవరు పడితే వారు మాట్లాడి గందరగోళం సృష్టించరాదు అనే నిబంధనను ఆయన కఠినంగా అమలు చేశారు. చివరకు పాలక బీజేపీని కూడా కట్టడి చేశారు. అందువల్లే చైనా మీడియా ఎంతగా రెచ్చగొట్టినా పాలకపక్షీయులు ఎవరూ స్పందించలేదు. బీజేపీలో అంతర్గతంగా చైనాపై కిరికిరి వినిపించినా ఆయన పట్టించుకోలేదు. సర్కారు ఊగిసలాట ధోరణి చూపుతుందన్న విమర్శలకూ స్పందించలేదు. ఈ క్రమశిక్షణ ఎంతగా అలవడిందంటే చివరకు ప్రతిష్టంభన తొలగిపోయినప్పుడు విజయోత్సాహం ప్రకటించడమూ పెద్దగా జరుగలేదు. పార్టీవర్గాలు ఇప్పుడు ప్రధాని దౌత్య ప్రతిభపై ప్రశంసలు కురిపిస్తున్నాయని అంటున్నారు.