Begin typing your search above and press return to search.

విచారణలో సహకరించని డాక్టర్ ?

By:  Tupaki Desk   |   3 Dec 2020 11:10 AM GMT
విచారణలో సహకరించని డాక్టర్ ?
X
ఆమధ్య విజయవాడలోని స్వర్ణాప్యాలెస్ కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదం అందరికీ తెలిసిందే. ఆ ప్రమాదంలో 11 మంది కరోనా వైరస్ రోగులు సజీవదహనం అయిపోయారు. ఆ ఘటనకు సంబంధించి పోలీసులు రెండు రోజులుగా డాక్టర్ రమేష్ పోతినేనిని విచారిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ కోసమని రమేష్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. విచారణలో గురువారం ఆఖరు రోజు అవుతుంది. ఇది పేరుకే విచారణ కానీ రమేష్ ఏమాత్రం పోలీసులకు సహకరించటం లేదని సమాచారం.

నిజానికి అగ్నిప్రమాద ఘటన జరగ్గానే పోలీసులు డాక్టర్ ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన పోలీసులకు దొరకకుండా తప్పించుకుని హైడౌట్ లోకి వెళ్ళిపోయారు. ఎంత వెతికినా డాక్టర్ ఆచూకీ కనబడకపోవటం వల్లే రమేష్ ఆచూకీ చెప్పిన వాళ్ళకు లక్ష రూపాయల బహుమానం ఇస్తామని పోలీసులు ప్రకటించటం అప్పట్లో సంచలనమైంది. సరే అనేక కారణాల వల్ల పోలీసులను తప్పించుకుని తిరిగిన డాక్టర్ చివరకు కోర్టులో లొంగిపోయారు.

అనేక విచారణల తర్వాత చివరకు విచారణ నిమ్మిత్తం పోలీసుల ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. తాజాగా రెండు రోజులుగా పోలీసుల విచారణకు డాక్డర్ హాజరైనప్పటికీ నోరు మాత్రం తెరవలేదట. పోలీసులు ఏమి అడిగినా తనకేమీ గుర్తులేదనే సమాదానం ఇస్తున్నారట. కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేసినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవటం, లైసెన్సుకు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నారని, ఆసుపత్రితో ఇంకెవరైనా టైఅప్ అయ్యారా ? అనేటువంటి ప్రశ్నలు పోలీసులు వేశారట.

చివరకు ఆసుపత్రి యాజమాన్యంలో ఎంతమంది భాగస్తులన్న ప్రశ్నకు కూడా తనకేమీ గుర్తు లేదని మాత్రమే రమేష్ సమాధానిమస్తున్నట్లు సమాచారం. రోగులదగ్గర నుండి ఎంతెంత ఫీజులు వసూలు చేశారన్న ప్రశ్నకు కూడా తనకేమీ గుర్తు లేదనే చెప్పారట. అంటే కోర్టు ఆదేశాల ప్రకారం తన లాయర్ కూడా విచారణలో పాల్గొంటున్న కారణంగా డాక్టర్ కు ఎక్కడ లేని ధైర్యం వచ్చినట్లు అర్ధమవుతోంది.

మరి ఇలాంటి పద్దతిలో ఎన్ని రోజులు విచారణకు అవకాశం ఇచ్చినా పోలీసులు డాక్టర్ నుండి రాబట్టే సమాచారం ఏమీ ఉండదు. గురువారం విచారణ కూడా పూర్తయిన తర్వాత జరిగిన విచారణ పద్దతిని, డాక్టర్ సహాయ నిరాకరణను ఓ నివేదిక రూపంలో కోర్టుకే అందచేద్దామని పోలీసు అధికారులు అనుకున్నట్లు సమాచారం. మరి ఆ నివేదిక తర్వాత కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.