Begin typing your search above and press return to search.

ప్రాతిప‌దిక లేని కొత్త జిల్లాల విభ‌జ‌న‌.. న‌ష్టపోయేవి.. ఇవే!

By:  Tupaki Desk   |   28 Jan 2022 7:57 AM GMT
ప్రాతిప‌దిక లేని కొత్త జిల్లాల విభ‌జ‌న‌.. న‌ష్టపోయేవి.. ఇవే!
X
ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఆర్భాటంగా ప్ర‌క‌టించిన కొత్త జిల్లాల ప్ర‌క‌ట‌న‌.. ఆయా జిల్లాల‌కు మేలు చేసేది ఎంతో చెప్ప‌డం అలా ఉంచితే.. ఇప్పుడు ఉన్న జిల్లాల‌కు న‌ష్టం జ‌రుగుతుంద‌నే వాద‌న వినిపిస్తోంది. ముఖ్యంగా ఇప్ప‌టి వ‌ర‌కు తీర ప్రాంత జిల్లాలుగా ఉన్న.. ప్ర‌కాశం, కృష్ణా, తూర్పుగోదావ‌రి జిల్లాల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని అంటున్నారు. ఇక్క‌డ తీర‌ప్రాంతాలు ఎక్కువ‌. దీంతో ఈ తీర ప్రాంతాల్లో ప‌రిశ్ర‌మ‌లు పెట్టేందుకు పెద్ద‌గా ఎవ‌రు ముందుకు రారు. ఎందుకంటే.. భూగ‌ర్భ జ‌లాల‌న్నీ.. ఉప్పునీటితో నిండి ఉంటాయి. దీంతో ఇక్క‌డ పంట‌లు కూడా పండ‌వు. అదేవిధంగా ప‌రిశ్ర‌మ‌లు కూడా పెట్టేందుకు ఎవ‌రు ముందుకురారు.

అందుకే బ్రిటీష్ హ‌యాంలో ప్ర‌కాశం జిల్లాలో తీర ప్రాంతాన్ని ఒకే ప్రాంతానికి ప‌రిమితం చేశారు. దీంతో చీరాల వ‌ర‌కు మాత్ర‌మే తీర ప్రాంతం ప‌రిమిత‌మైంది. అయితే.. ఇప్పుడు తీర ప్రాంతాన్ని మ‌రో రెండు జిల్లాల‌కు విస్త‌రించేలా నిర్ణ‌యించుకున్నారు. ఇక‌, తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా కాకినాడ ఉంది. కృష్ణా జిల్లా కేంద్రంగా మచిలీపట్నం ఉంది. ఇవి కూడా తీర ప్రాంతాలు. వీటి ఏర్పాటు వెనుక ఒక ప్ర‌త్యేక‌ ఉద్దేశం ఉంది. అప్పట్లో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మరో ప్రధాన నగరం రాజమండ్రికే అభివృద్ధి పరిమితం కాకుండా జిల్లా కేంద్రాన్ని కాకినాడలో ఏర్పాటు చేయడం ద్వారా దానికి కూడా అభివృద్ధి ఫలాలు అందేలా చేశాయి.

అలాగే కృష్ణాజిల్లాలో విజయవాడకే అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా మచిలీపట్నాన్ని జిల్లా కేంద్రంగా పెట్టారు. తద్వారా ఆయా నగరాల్లో అధికార కార్యకలాపాలు ఎక్కువగా ఉండటంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు అక్కడికి వచ్చేవారు. దీంతో ఈ రెండు నగరాలు కొంత అభివృద్ధి చెందాయి. అంటే.. తీర ప్రాంతాలు అభివృద్ధికి దూరం కాకూడ‌ద‌నే ఉద్దేశం ఉంది. అయిన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టికీ ఆయా ప్రాంతాలు పెద్ద‌గా అభివృద్దికి నోచుకోలేదు. ఇప్పుడు కాకినాడ జిల్లా కేంద్రంగా మారబోతున్న కాకినాడ నగరం గతంలో పాశ్చాత్య దేశాల వర్తక కేంద్రంగా ఉండేది. తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా ఉన్నప్పటికీ జిల్లాలో ఎక్కువగా అభివృద్ధి చెందిన నగరంగా మాత్రం మారలేకపోయింది.

చివరకు కేంద్రం స్మార్ట్ సిటీని ప్రకటించినా మౌలిక సౌకర్యాల అభివృద్ధి మాత్రమే జరిగింది. మిగతా పరిస్ధితులన్నీ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు కానీ, కొత్తగా భారీ పరిశ్రమల ఏర్పాటు కానీ జరగలేదు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా తొలగించి కాకినాడ జిల్లా ఏర్పాటు చేసి కాకినాడ జిల్లా కేంద్రం చేయడం వల్ల పూర్తిగా తీర ప్రాంతంగా మారుతుంది. దీంతో ఇక్క‌డ అభివృద్ధి నెమ్మదిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా గతంలో వచ్చినన్ని పరిశ్రమలు మరోసారి ఇక్కడికి వస్తాయా అన్న ప్ర‌శ్న వ్య‌క్త‌మ‌వుతోంది.

అదేవిధంగా కృష్ణాజిల్లా కేంద్రంగా ఉన్న మచిలీపట్నం ఇప్పుడు అదే పేరుతో జిల్లాగా ఏర్పాటు కావడంతో పాటు జిల్లా కేంద్రం కొనసాగబోతోంది. దీనివల్ల బందరుకు లభించే అదనపు ప్రయోజనం క‌నిపించ‌డం లేదు. ఇప్పటికే అభివృద్ధి చెందిన విజయవాడ శివార్లు కలవడం మినహా బందరుకు ఈ కొత్త జిల్లా వల్ల కలిగే ప్రయోజనం ఏంటో తెలియ‌డం లేదు. ఇప్పుడు మచిలీపట్నం జిల్లా ఏర్పాటుతో విజయవాడతో పాటు అభివృద్ధి చెందిన మెట్ట ప్రాంతాల అభివృద్ధి బందరుకు విస్తరించడం ఆగిపోవడం ఖాయం.

గతంలో ఉమ్మడి జిల్లాలో బందరు పోర్టుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అయినా ముందడుగు పడటం లేదు. ఇప్పుడు కొత్త జిల్లాతో బందరు పోర్టు నిర్మాణంపైనా ప్రభావం పడబోతోంది. గతంలో ఉమ్మడి జిల్లాల్లో జిల్లా కేంద్రాలుగా ఉన్నప్పుడు కాస్తో కూస్తో అభివృద్ధి చెందిన మచిలీపట్నం, కాకినాడ నగరాలకు ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

ఎందుకంటే గతంలో ఉమ్మడి జిల్లాల్లో అభివృద్ధి చెందిన ప్రాంతాల నుంచి అభివృద్ధి ఇక్కడికి కాస్తో కూస్తో విస్తరించింది. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుతో అవి స్వయం సమృద్ధి సాధించక తప్పదు. అందులో విఫలమైతే మరిన్ని కష్టాలు పెరగడం ఖాయం. అసలే తీర ప్రాంతాలకు నిధుల కొరత వేధిస్తోంది. ప‌రిశ్ర‌మ‌లు లేవు. అంతేకాదు.. ఇక్క‌డ ఎలాంటి ప‌నులు చేయాల‌న్నా.. నీటి స‌మ‌స్య వెంటాడుతోంది. దీంతో తాజాగా తీసుకువ‌చ్చిన నిర్ణ‌యం ఆయా జిల్లాల‌కు శ‌రాఘాత‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.