Begin typing your search above and press return to search.

బిట్ కాయిన్ దారుణ ప‌త‌నం.. ఇదో నీటి బుడ‌గేనా..?

By:  Tupaki Desk   |   28 Feb 2021 5:30 PM GMT
బిట్ కాయిన్ దారుణ ప‌త‌నం.. ఇదో నీటి బుడ‌గేనా..?
X
క్రిప్టో కరెన్సీలో తోపుగా చెలామ‌ణి అవుతున్న బిట్ కాయిన్ ప‌త‌నం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. అత్యున్న‌తంగా 58,000 డాలర్లు దాటిన బిట్ కాయిన్ వాల్యూ.. కొన్ని రోజులుగా వేగంగా ప‌డిపోతూ వ‌స్తోంది. ఈ కాయిన్ విలువపై టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలతో అంతర్జాతీయ మార్కెట్లో మొద‌లైన ప‌డిపోయిన బిట్ కాయిన్ విలువ‌.. ఇంకా కొన‌సాగుతూనే ఉంది. గ‌త వారం 45వేల డాలర్లకు పడిపోయిన దీని వాల్యూ.. లాస్ట్ వీక్ ముగిసే నాటికి 44,239 డాలర్లకు పడిపోయింది. వారంలోనే 21 శాతం మేర ప‌త‌నం కావ‌డం గ‌మ‌నార్హం. గత ఏడాది మార్చి రెండో వారం తర్వాత బిట్ కాయిన్‌కు ఇది అత్యంత దారుణ పతనం కావ‌డం గ‌మ‌నార్హం.

గ‌తవారం భారీ ప‌త‌నం..
గ‌త మంగళవారం 45,393 డాలర్లు ఉండ‌గా.. గురువారం నాటికి 51,600 డాలర్లకు పెరిగింది. దీంతో.. మ‌ళ్లీ పెరుగుతోంద‌ని భావించారు ఇన్వెస్ట‌ర్స్‌. కానీ.. అంతలోనే ఏకంగా 44,647 డాలర్లకు పడిపోవ‌డం విశేషం. శనివారం 48,330 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ప్రధానంగా బాండ్ ఈల్డ్స్ పెరగడం, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల భారీ నష్టాల ప్రభావం బిట్ కాయిన్ పైన కనిపించింది.

దోబూచులాట‌..
బిట్ కాయిన్ వ్యాల్యూ ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు త‌గ్గుతుందో ఎవ్వ‌రూ అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. 2020 ఫిబ్రవరి 19న బిట్ కాయిన్ వ్యాల్యూ 3,865 డాలర్లుగా ఉంది. గత సోమవారం ఏకంగా 52,000 డాలర్లు దాటింది. ఈ ఏడాది జనవరి రెండో వారంలో 40,000 డాలర్లుగా ఉంది. జనవరి మూడో వారంలో 30వేల డాలర్లకు పడిపోయింది. ఈ విధంగా బిట్ కాయిన్ విలువ ఎప్పుడు ఎలా ఉంటుందో అంచ‌నా వేయ‌డం క‌ష్టసాధ్యంగా మార‌డంతో ఇన్వెస్ట‌ర్లు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

పెరుగుతున్న ఆందోళ‌న‌..
బిట్ కాయిన్లను ఎవ‌రు అమ్ముతారో.. ఎవ‌రో కొంటారు.. మూడో వ్య‌క్తికి తెలియ‌దు. వీటికి ప్ర‌పంచంలోని ఏ దేశ‌మూ పూచీక‌త్తు లేక‌పోవ‌డంతో.. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ్వ‌రికీ అర్థం కావ‌ట్లేదు. ప్రస్తుతం 8,612 క్రిప్టోకరెన్సీ సర్క్యులేషన్‌లో ఉంది. వీటి మార్కెట్ క్యాప్ 1.34 ట్రిలియన్ డాలర్లు. ఇందులో బిట్ కాయిన్ వాటా 61.6 శాతంగా ఉంది.

నిషేధించాలన్న డిమాండ్‌..
ఎలాంటి ప‌న్నులూ విధించే అవ‌కాశం లేకుండా బ్లాక్ మ‌నీ దాచుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్న ఈ బిట్ కాయిన్ ను నిషేధించాల‌నే డిమాండ్ వినిపిస్తోంది. అదే సంద‌ర్భంలో దీనిపై ఎలాంటి న‌మ్మ‌క‌మూ లేక‌పోవ‌డంతో.. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో అనే ఆందోళ‌న కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ కూడా ఎలాన్ మస్క్ తీరుగానే ఈ బిట్ కాయిన్ పై ఎన్నో అనుమానాలు వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఇటు భార‌త్ లో అతిపెద్ద ఇన్వెస్టర్ అయిన రాకేష్ ఝున్ ఝున్ ‌వాలా కూడా ఈ డిజిటల్ కరెన్సీని బ్యాన్ చేయాలని అన్నారు. ఈ నేప‌థ్యంలోనే బిట్ కాయిన్ లో మ‌దుపు చేసేందుకు ఇన్వెస్ట‌ర్లు జంకుతున్నారు. దీనిఫ‌లితంగానే కాయిన్ విలువ వేగంగా ప‌డిపోతోంది. ఇదో నీటి బుడ‌గ మాదిరిగా త‌యారైంద‌ని, ఎప్పుడు పేలుతుందో తెలియ‌ద‌ని కూడా అంటున్నారు నిపుణులు. మ‌రి, ఏం జ‌రుగు‌తుంద‌న్న‌ది చూడాలి.