Begin typing your search above and press return to search.

ఇదెక్కడ నిర్ణయం? మన్యం జిల్లాగా మైదాన ప్రాంతమా?

By:  Tupaki Desk   |   27 Jan 2022 6:06 AM GMT
ఇదెక్కడ నిర్ణయం? మన్యం జిల్లాగా మైదాన ప్రాంతమా?
X
కొత్త జిల్లాల్ని ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పలు జిల్లాల్లోని వారు కొత్త జిల్లాలతో తమకు సౌలభ్యం కంటే అవస్థలే ఎక్కువ అవుతాయని చెబుతున్నారు. మరికొన్ని జిల్లాల వారు భావోద్వేగపరమైన అంశాల్ని తెర పైకి తీసుకొస్తున్నారు. అదే సమయంలో కొత్త జిల్లాల విషయంలో ప్రభుత్వం ప్రాక్టికల్ ఇబ్బందుల్ని గుర్తించకుండా.. తమకు తోచినట్లుగా చేసిందన్న ఫిర్యాదులు ఎక్కువ అవుతున్నాయి.

కొత్త జిల్లాల పేరుతో రాజకీయంగా అధిక్యతను ప్రదర్శించేందుకు వీలుగా ప్లాన్ చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల పేర్ల మీద అభ్యంతరాలు వ్యక్తమవుతే.. మరికొన్ని చోట్ల భౌగోళికంగా ఎదరయ్యే ఇబ్బందుల్ని పెద్ద ఎత్తున ప్రస్తావిస్తున్నారు. సంబంధం లేని అంశాల్ని కొత్త జిల్లాల పేరుతో ఆపాదించటం సరికాదన్న వాదన వినిపిస్తోంది. ఇలాంటి వాటికి సంబంధించి ప్రముఖంగా వినిపిస్తున్న అభ్యంతరాల్ని చూస్తే..

మన్యం అన్నంతనే విశాఖ ఏజెన్సీని గర్తు చేసుకుంటారు ఎవరైనా. ఇందుకు తగ్గట్లే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విశాఖ జిల్లాలని మంపను కేంద్రంగా చేసుకొని బ్రిటీష్ అధికారులపై ఆయన పోరాటం చేశారు. ఆయన సమాధి సైతం విశాఖ జిల్లాలోని గొలుగొండ మండలంలోని కృష్ణాదేవిపేటలో ఉంది. అందుకే విశాఖలోని ఏజెన్సీ ప్రాంతాలన్నింటిని కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేసి దీనికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.

తాజాగా ప్రభుత్వం చేసిన కొత్త జిల్లాల ప్రకటనలో అరకు ఎంపీ స్థానంలోని పాడేరు.. అరకు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరాన్ని కలిపి పాడేరు కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటించి.. దానికి అల్లూరి పేరును పెట్టటం తెలిసిందే. అయితే.. విజయనగరం జిల్లాలోని పార్వదీపురం.. సాలూరు.. కురుపాం.. శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గాల్ని కలిపి మన్యం జిల్లాగా ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించటాన్నితప్పు పడుతున్నారు.

విశాఖ ఏజెన్సీని మన్యంగా వ్యవహరిస్తుంటే.. అందుకు భిన్నంగా పూర్తి మైదాన ప్రాంతాలైన పార్వతీపురం.. సాలూరు.. పాలకొండ.. కురుపాంలను కలిపి మన్యంగా పేర్కొనటం ఏమిటన్న అభ్యంతరాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. దీనికి వేరే పేరు పెట్టాలని కోరుతున్నారు. మన్యం- సీతారామరాజు అంటూ రెండింటిని వేర్వేరుగా విడదీయటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.