Begin typing your search above and press return to search.

గ్రేటర్ కు కాబోయే మేయర్ కేకే కుమార్తె?

By:  Tupaki Desk   |   10 Feb 2021 6:30 AM GMT
గ్రేటర్ కు కాబోయే మేయర్ కేకే కుమార్తె?
X
మరో రోజులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు కొత్త మేయర్.. డిప్యూటీ మేయర్లు రానున్నారు. ఇప్పటికే ఈ పదవిపై పలువురు ఆశావాహులు.. కర్చీప్ లు.. తువ్వాలు వేసుకొని.. మాదంటే మాదనేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల తెలంగాణ భవన్ లో నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మేయర్ పదవి అంశంపై క్లారిటీ ఇచ్చేశారు. మేయర్ ఎన్నిక జరిగే ఫిబ్రవరి11న ఉదయం పది గంటలకు కార్పొరేటర్లుగా గెలిచిన పార్టీ నేతలు.. ఎక్స్ అఫిషియో సభ్యులు తెలంగాణ భవన్ కు చేరుకోవాలని.. అక్కడి నుంచి బస్సులో బల్దియా భవనానికి వెళ్లాలని చెప్పారు.

ఆ సందర్భంగా తాను సీల్డ్ కవర్ లో పేరును ఖరారు చేస్తానని చెప్పారు. దీంతో.. కవరులో ఎవరు?అన్నది క్వశ్చన్ గా మారింది. ఇదిలా ఉంటే.. మేయర్ పదవికి ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అనే పరిస్థితి. ఇలాంటివేళ.. అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుందని చెబుతున్నారు. ఇదే.. ఇప్పటివరకు ఉన్న అంచనాల్ని మార్చినట్లుగా తెలుస్తోంది. తొలుత గ్రేటర్ మేయర్ పదవిని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళా కార్పొరేటర్ కు కట్టబెట్టాలని భావించారు.

అనంతరం చోటు చేసుకున్న సామాజిక సమీకరణలతో నిర్ణయంమారినట్లుగా తెలుస్తోంది.మరి.. ముఖ్యంగా మంగళవారం రాజ్యసభ సభ్యుడు.. టీఆర్ఎస్ సీనియర్ నేత కేకే ప్రగతిభవన్ కు వెళ్లటం.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవటంతో సమీకరణాలు మారాయన్న మాట బలంగా వినిపిస్తోంది. గతంలో తనకు ఇచ్చిన మాటను గుర్తు చేయటంతో పాటు.. తన కుమార్తె గద్వాల విజయలక్ష్మికి మేయర్ పదవిని కట్టబెట్టాలన్న మాటను అడిగినట్లుగా చెబుతున్నారు.

కేకే విన్నపానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. ఒకింత ఉత్కంటతో ప్రగతిభవన్ కు వెళ్లిన కేకే.. తిరిగి వచ్చిన తర్వాత మాత్రం మాంచి జోష్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. తన కుమార్తె గద్వాల విజయలక్ష్మీకి మేయర్ కుర్చీ ఖాయమన్న భావనలో ఉన్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించటంతోనే.. పదవి ఖరారైందన్న మాట వినిపిస్తోంది. ఈ నిర్ణయం తీసుకోవటానికి బలమైన రాజకీయ అంశాలు కారణంగా ఉన్నాయని చెప్పాలి.

ప్రస్తుతం బీసీలకు రాజ్యాధికారం దక్కలేదన్న ఆగ్రహం తెలంగాణలో ఉంది. దీనికి తోడు.. బీజేపీ బీసీలకు పెద్ద పీట వేయటమే కాదు.. తెలంగాణలో బలమైన సామాజిక వర్గాల్లో ఒకటైన మూన్నురుకాపుకు చెందిన బండి సంజయ్ ను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బీజేపీ ఎంపిక చేసింది. బీజేపీ గళాన్ని బలంగా వినిపించే ఎంపీ అర్వింద్ తో పాటు.. సీనియర్ నేత లక్ష్మణ్ సైతం ఇదే సామాజిక వర్గానికి చెందిన నేత అన్నది మర్చిపోకూడదు. దీంతో.. ఇదే సామాజిక వర్గానికి చెందిన గద్వాల విజయలక్ష్మిని మేయర్ ను చేస్తే.. బీసీలకు సముచిత ప్రాధాన్యతను టీఆర్ఎస్ ఇస్తుందన్న మాట బలంగా వెళుతుందన్న ఆలోచనలో పార్టీ అధినాయకత్వం ఉందని చెబుతున్నారు. ఈ కారణంతోనే..గద్వాల విజయలక్ష్మిని మేయర్ పదవిని అప్పజెప్పే అవకాశాలే ఎక్కువన్న మాట బలంగా వినిపిస్తోంది.