Begin typing your search above and press return to search.

డేటింగ్ యాప్ ఆమెను సేవ్ చేసింది

By:  Tupaki Desk   |   29 Jan 2020 12:30 AM GMT
డేటింగ్ యాప్ ఆమెను సేవ్ చేసింది
X
అదేదండి బాబు.. డేటింగ్ యాప్ అంటే.. మోసపోవటం లాంటివి జరగాలే కానీ.. ఒక మహిళ ప్రాణాల్ని కాపాడటమా? అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే.. ఈ ఉదంతం గురించి విన్నంతనే విచిత్రంగా అనిపించటమే కాదు.. డేటింగ్ యాప్ ల కారణంగా ఇంతకాలం నష్టమే ఉంటుందని ఫీలయ్యే వారు తమ అభిప్రాయాన్ని మార్చుకునే వీలుందని చెప్పాలి. ఇంతకీ.. బాధిత మహిళను డేటింగ్ యాప్ ఎలా సేవ్ చేసిందన్న విషయంలోకి వెళితే..

లోనియా హెగర్ అనే ఆవిడకు సాహస యాత్రలు అంటే ఇష్టం. తన ఇష్టానికి తగ్గట్లు తన ఫ్రెండ్ తో పాటు ఒక కుక్కను తీసుకొని బయలుదేరింది. తన యాత్రలో భాగంగా జర్మనీ.. డెన్మార్క్.. స్వీడన్.. ఫిన్లాండ్.. నార్వే యాత్ర కు బయలుదేరింది. జర్నీ స్టార్ట్ అయినప్పుడు బాగానే ఉంది కానీ యూరప్ ఉత్తర ప్రాంతానికి చేరుకున్నాక కొత్త కష్టాలు ఎదురయ్యాయి. నార్వేలో రోడ్లు మంచుతో మూసుకుపోయాయి.

దీనికి తోడు భారీ వర్షాలు షురూ అయ్యాయి. రోడ్లు బాగు పడ్డాయని అనుకొని కారులో పది అడుగులు వేశారో లేదో.. వారు ఏకంగా సముద్రం లో పడిపోయే పరిస్థితి. అదే సమయంలో మంచు పెళ్లలు వారి వాహనం మీద పడటం మొదలైంది. ముందుకు వెళ్ల లేరు.. వెనక్కి పోలేని దుస్థితి. ఇలానే ఉంటే తమ ప్రాణాలు పోవటం ఖాయమని ఫీల్ అవుతున్న వేళ.. అనూహ్యంగా ఆమె ఫ్రెండ్ కు ఒక ఆలోచన వచ్చింది.

డేటింగ్ యాప్ అయిన టెండర్ లో ప్రొఫైల్ ను అర్జెంట్ గా అప్ లోడ్ చేయాలన్న సూచనతో.. హెగర్ తన ప్రొఫైల్ అప్ లోడ్ చేసింది. వెంటనే అక్కడికి సమీపంలోని ఒక వ్యక్తి అకౌంట్ కు మ్యాచ్ అయ్యింది. అతగాడు వెంటనే లైన్లోకి రావటం.. ఆమె తాను ఉన్న పరిస్థితిని వివరించటం తో ఆమెను రక్షించేందుకు వీలుగా తన బుల్ డోజర్ ను తీసుకొని ఆమె ఉన్న ప్రాంతానికి వచ్చాడు. అలా తన ప్రాణాల్ని డేటింగ్ యాప్ రక్షించినట్లుగా హెగర్ తాజాగా తన ఇన్ స్టాలో పేర్కొంది. ఇప్పుడీ ఉదంతం వైరల్ గా మారింది.