Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లో చల్లారిన అసమ్మతి

By:  Tupaki Desk   |   15 July 2021 12:30 PM GMT
కాంగ్రెస్ లో చల్లారిన అసమ్మతి
X
పంజాబ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ లో తలెత్తిన సంక్షోభం ఎట్టకేలకు ముగిసిందనిపిస్తోంది. రాష్ట్ర సీఎంగా అమరీందర్ సింగ్ కొనసాగుతారని.. ప్రముఖ క్రికెటర్, రాజకీయ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూను రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గా నియమించేలా కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరినీ రాజీ చేసినట్టు సమాచారం. దీంతో పంజాబ్ కాంగ్రెస్ లో అసమ్మతి జ్వాల చల్లారినట్టే కనిపిస్తోంది.

అమరీందర్ కు సీఎం పోస్టు.. సిద్దూకు పీసీసీ చీఫ్ పోస్టు తీసుకోవడానికి ఇద్దరూ అంగీకరించారని తెలిసింది. సిద్దూకు ఒక పదవిని ఇస్తారని కొన్నాళ్లుగా ఊహాగానాలు సాగుతున్న విషయం గమనార్హం. ఇక వీరితోపాటు హిందూ, దళిత వర్గాల నుంచి ఇద్దరు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా ఉంటారని సమాచారం. దీంతో ఇద్దరి మధ్య ఏర్పడిన వివాదం ముగిసినట్టేనని పంజాబ్ కాంగ్రెస్ ఇన్ చార్జి హరీష్ రావత్ తెలిపారు.

కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి సీఎం అమరీందర్ సింగ్ కట్టుబడి ఉంటారని చెబుతున్నారు. త్వరలోనే జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమరీందర్, సిద్దూ ఇద్దరూ కలిసి పనిచేస్తారని అంటున్నారు.
మరో రెండు మూడు రోజుల్లో తాజా పరిష్కారం గురించి పార్టీ ప్రకటన ఇస్తుందని చెబుతున్నారు.

మొదట నవజ్యోత్ సింగ్ సిద్దూకు డిప్యూటీ సీఎం పదవి లేదా రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పదవిని ఇచ్చినా తాను అంగీకరించబోమని భీష్మించిన అమరీందర్ సింగ్ ఆ తర్వాత ఢిల్లీకి రాగానే చల్లబడ్డారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో సమావేశమైన అనంతరం అమరీందర్ వెనక్కి తగ్గారు.

ఇక అమరీందర్ కు కూడా కాంగ్రెస్ అధిష్టానం వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. ఒక దఫా సీఎం చేయడంతో తన పదవికే ఎసరు వస్తుందని అమరీంద్ కామ్ గా సిద్దూ చేరికను అంగీకరించినట్టు తెలిసింది. సిద్దూ ఇక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడని.. తాను ఏం చేయాలో.. ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఏది చేయాలన్నా ఈ విషయాన్ని గుర్తించుకోవాలని హరీష్ రావత్ వ్యాఖ్యానించారు.

అయితే ఈ కొత్త ఫార్ములాకు సిద్దూ పూర్తిగా అంగీకారం తెలిపారా? లేదా ? అన్నది ఇంకా స్పష్టం కాలేదు. దీనిపై సిద్దూ స్పందించాల్సి ఉంది.

-అసలు వివాదం ఇదీ
ఇటీవల పంజాబ్ లోని కాంగ్రెస్ లో లొల్లి ముదిరింది. సీఎం అమరీందర్ ను వ్యతిరేకించి బయటకొచ్చిన క్రికెటర్ , మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ అధిష్టానం వద్దకు వచ్చారు. సీఎం అమరీందర్ పై ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ రాగా.. రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదట.. కాంగ్రెస్ లోని రెబల్స్ ను ఎప్పుడూ రాహుల్ గాంధీ ఎంకరేజ్ చేయరు. గతంలో మధ్యప్రదేశ్ లో తన ప్రియ శిష్యుడు జ్యోతిరాధిత్యసింధియా నాటి కాంగ్రెస్ సీఎంపై అసమ్మతి రాజేస్తే రాహుల్ ఊరుకోలేదు. తనకు క్లోజ్ ఫ్రెండ్ అయినా పక్కనపెట్టారు. దీంతో సింధియా బీజేపీలోకి చేరిపోయారు. అయినా రాహుల్ మాత్రం దానిపై వెనక్కి తగ్గలేదు.

ఇప్పుడు పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వైదొలిగి సీఎం అమరీందర్ సింగ్ పై తిరుగుబాటు ఎగురవేసిన ప్రముఖ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను సైతం రాహుల్ గాంధీ పక్కనపెట్టారు. పంజాబ్ నుంచి తనను కలిసేందుకు వచ్చినా కూడా ఏమాత్రం అవకాశం ఇవ్వకపోవడం విశేషం. త్వరలోనే పంజాబ్ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ బీజేపీకి ఆశలు లేకున్నా.. కాంగ్రెస్ లోని అనైక్యత చేటు తెస్తోంది.

ఈ క్రమంలోనే సిద్దూ పంజాబ్ కాంగ్రెస్ లో అసమ్మతి లేవదీశారు. ఢిల్లీకి వచ్చి రాహుల్ అపాయింట్ మెంట్ కోరితే ఇవ్వలేదట... అసమ్మతులపై తాను ఉక్కుపాదమే మోపుతానని సంకేతాలిస్తూ సిద్దూ వ్యతిరేకవర్గంతో రాహుల్ గాంధీ వరుస సమావేశాలు నిర్వహించారు. దీంతో విధి లేని పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ముఖం చాటేయడంతో ఆయన చెల్లెలు ప్రియాంక గాంధీని సిద్దూ కలిశాడు. ప్రియాంక గాంధీ చొరవ తీసుకొని సిద్దూతో సమావేశమై శాంతింప చేశారట.

అనంతరం స్వయంగా రాహుల్ గాంధీకి ఫోన్ చేసి మరీ సిద్దూతో భేటి కావాలని సూచించిందట.. చెల్లి ప్రియాంక కోరికను కాదనలేక రాహుల్ సైతం వెంటనే సిద్దూకు ఫోన్ చేసి భేటి అయ్యారు. పంజాబ్ లోని అసమ్మతిని చల్లార్చాలని.. కలిసి పనిచేయాలని సూచించాడట.. మొత్తానికి ప్రియాంక గాంధీ చొరవతో కాంగ్రెస్ లో పెద్ద అసమ్మతి కట్టడి అయ్యిందని కాంగ్రెస్ వర్గాలు హ్యాపీగా ఫీల్ అవుతున్నాయట..