Begin typing your search above and press return to search.

బయటపడిన ‘దేశం’ నేత అజ్ఞానం!

By:  Tupaki Desk   |   22 Nov 2020 9:50 AM GMT
బయటపడిన ‘దేశం’ నేత అజ్ఞానం!
X
తెలుగుదేశంపార్టీలో కొందరు నేతలున్నారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడేయటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. అధికారప్రతినిధి హోదాలో ఉండి కూడా సినీనటి, దివ్యవాణి మాట్లాడిన మాటలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తిరుపతిలో నగిరి వైసిపి ఎంఎల్ఏ రోజా మాట్లాడుతూ చంద్రబాబునాయుడుపై ధ్వజమెత్తారు. తిరుపతి లోక్ సభ ఎంపి బల్లి దుర్గా ప్రసాదరావు చనిపోతే జరగబోయే ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిని ఎలా పోటీ చేయిస్తోందని ప్రశ్నించారు. చంద్రబాబు సంప్రదాయానికి గండి కొడుతున్నారంటూ మండిపడ్డారు.

ఇదే విషయమై మిగిలిన నేతలు ఎవరు స్పందించకపోయినా దివ్యవాణి మాత్రం చాలా స్పీడుగా స్పందించేశారు. నంద్యాల ఉపఎన్నికల్లో వైసీపీ ఏమి చేసిందంటూ రోజాను నిలదీశారు. నంద్యాలలో టీడీపీ ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డి మరణంతో జరిగిన ఉపఎన్నికలో వైసీపీ ఎలా పోటీ చేసిదంటూ రోజాను ప్రశ్నించటంతో అందరు ఆశ్చర్యపోయారు. అసలు నంద్యాలలో గెలిచిన భూమా నాగిరెడ్డి ఏ పార్టీ తరపున గెలిచారో కూడా దివ్యవాణికి తెలీకపోవటమే విచిత్రంగా ఉంది.

2014 ఎన్నికల్లో వైసీపీ తరపున భూమా నాగిరెడ్డిని తర్వాత చంద్రబాబు ప్రలోభాలకు గురిచేసి టీడీపీలోకి లాక్కున్నారన్న కనీస సమాచారం కూడా దివ్యవాణి దగ్గర లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. భూమా టీడీపీలోకి ఫిరాయించినా సాంకేతికంగా వైసీపీ సభ్యుడే అన్న విషయం కూడా దివ్యవాణికి తెలీలేదు. తమ సభ్యుడు మరణించారు కాబట్టే ఉపఎన్నికల్లో తమ పార్టీ తరపున అభ్యర్ధిని పోటీ చేయిస్తున్నట్లు అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు.

మిగిలిన విషయాలను పక్కన పెట్టేస్తే ఎంఎల్ఏ బతికున్నంత కాలం చంద్రబాబు కూడా ఏనాడూ భూమాను టీడీపీ ఎంఎల్ఏ అని చెప్పుకోలేకపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఇన్ని మాటలు మాట్లాడుతున్న దివ్యవాణి తిరుపతి ఎంఎల్ఏగా ఉన్న వెంకటరమణ చనిపోతే జరిగిన ఉపఎన్నికల్లో వైసీపీ పార్టిసిపేట్ చేయలేదని తెలీదా ? అలాగే కృష్ణా జిల్లాలోని నందిగామ ఎంఎల్ఏ తంగిరాల ప్రభాకర్ చనిపోయిన తర్వాత జరిగిన ఉపఎన్నికలో కూడా పోటీకి దిగలేదు. మీడియాలో ప్రముఖంగా వచ్చేస్తుందన్న కారణంతోనే చాలామంది నోటికేదొస్తే అది మాట్లాడేస్తున్నారు. దివ్యవాణి కూడా ఇలాంటి వాళ్ళ కోవలోకే చేరిపోయిందని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు.