Begin typing your search above and press return to search.

ప్ర‌గ‌తి భ‌వ‌న్ ఖ‌ర్చు.. అదిరిపోతోందిగా!

By:  Tupaki Desk   |   9 Sep 2022 1:49 AM GMT
ప్ర‌గ‌తి భ‌వ‌న్ ఖ‌ర్చు.. అదిరిపోతోందిగా!
X
తెలంగాణ అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర‌స‌మితి అధికారిక భ‌వ‌నం.. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌. పార్టీ కార్య‌క్ర‌మాలు.. స‌మావేశాలు.. అన్ని ఇటీవ‌ల కాలంలో ఇక్క‌డ నుంచే జ‌రుగుతున్నాయి. అయితే.. ఈ భ‌వ‌న్‌కు చేస్తున్న భారీ ఖ‌ర్చుపై.. ప్ర‌తిప‌క్షాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌జాధ‌నాన్ని మంచినీళ్ల ప్రాయంలా... ఈ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు ఖ‌ర్చు చేస్తున్నార‌ని వారు లెక్క‌లు.. ప‌త్రాల‌తో స‌హా వివ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అస‌లు ప్ర‌గ‌తి భ‌వ‌న్ పూర్వాప‌రాలు.. ఖ‌ర్చు.. వంటివి చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.

తాజాగా.. ఇదే విష‌యంపై స‌మాచార హ‌క్కు కింద‌.. ఆర్టీఐ కార్య‌క‌ర్త ఒకరు లెక్కలు సేక‌రించారు. RTI కార్యకర్త రాబిన్ జాక్వెస్ పెట్టిన అప్లికేష‌న్‌కు రోడ్లు మరియు భవనాల శాఖ ఈ గణాంకాలను బహిరంగపరి చింది. దీని ప్ర‌కారం.. కేసీఆర్ ప్ర‌భుత్వం ఈ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌పై భారీగానే ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు తెలిసింది. భ‌వ‌నం నిర్మాణం నుంచి మెయింటెనెన్స్ వ‌ర‌కు.. కూడా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు కోట్ల రూపాయ‌ల్లో ఖ‌ర్చులు చేస్తున్నారు.

తొమ్మిది ఎకరాల్లో రూ.45.91 కోట్లతో 2016లో నిర్మించిన ఈ భవనంలో ఇప్పటి వరకు వివిధ పనులకు రూ.50.90 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఆఫీసర్స్ కాలనీలో 10 మంది ఐఏఎస్ అధికారులు, 24 మంది ప్యూన్‌ల క్వార్టర్లను కూల్చివేసి ప్రగతి భవన్ నిర్మించారు.

ఆవరణలోని ఐదు భవనాలకు పెయింటింగ్‌ పనులకే రూ.75 లక్షలు వెచ్చించారు. సీఎం నివాసంలో మాడ్యులర్(అధునాత‌న వంట‌గ‌ది) కిచెన్ కోసం మరో రూ.26 లక్షలు వెచ్చించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో శాశ్వత వేదిక కోసం రూ.89,108 వెచ్చించారు.

2017-18లో నివాసంలో అత్యవసర నిర్వహణ పనులకు రూ.44,277 ఖర్చు చేశారు. సెక్యూరిటీ గార్డు కోసం షెడ్డు నిర్మించేందుకు రూ.7.85 లక్షలు వెచ్చించారు. భవన్‌లోని ప్లంబర్లు, కార్పెంటర్లు, ఇతర సిబ్బందికి చెల్లింపుల కోసం దాదాపు రూ.14.45 లక్షలు వెచ్చించారు.

2018-19లో అత్యవసర నిర్వహణ పనులకు రూ.99,000, ప్లంబర్లు, కార్పెంటర్లు, ఇతర సిబ్బందికి చెల్లింపుల కోసం రూ.22.06 లక్షలు, సీఎం సభా వేదిక పొడిగింపు కోసం రూ.40,467 ఖర్చు చేశారు. ఆ తర్వాతి సంవత్సరాల్లో ప్లంబర్లు, కార్పెంటర్లకు చెల్లించేందుకు మరో రూ.35.03 లక్షలు, సెక్యూరిటీ గార్డుకు మరుగుదొడ్డి, డ్రెస్సింగ్ రూమ్ నిర్మాణానికి రూ.9.38 లక్షలు వెచ్చించారు.

ప్రధాన భవనంలోని మొదటి అంతస్తులో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.3.14 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా తేలింది. ప్రధాన గేటు బారికేడింగ్‌, పొడిగింపుపై రూ.7.15 లక్షలు, భవనం తూర్పు వైపున ఉన్న పెట్రోలింగ్‌ కారిడార్‌పై రూ.26 లక్షలు. మరుగుదొడ్లు, థర్మాకోల్ సీలింగ్ మరమ్మతులకు రూ.5.14 లక్షలు వెచ్చించారు. అయితే.. ఇదంతా ప్ర‌జాధ‌న‌మేన‌ని.. మంచి నీళ్ల ప్రాయంగా ఖ‌ర్చు చేశార‌ని.. ప్ర‌తిప‌క్షాలు దుయ్య‌బ‌డుతున్నాయి. ఇంత ఆరోప‌ణ‌లు వ‌స్తున్నా.. అధికార పార్టీ నుంచి ఎలాంటి స‌మాధానం లేక పోవ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.