Begin typing your search above and press return to search.

అధ్యయ‌నానికి వెళ్ళిన కార్పోరేటర్లు అక్కడ నడి రోడ్డు మీద..

By:  Tupaki Desk   |   20 Aug 2022 10:30 AM GMT
అధ్యయ‌నానికి వెళ్ళిన కార్పోరేటర్లు  అక్కడ  నడి రోడ్డు మీద..
X
వారు తామున్న చోటుకూ ఊరుకు మేలు చేద్దామనుకున్నారు. దేశంలో మంచి ప్రాజెక్టులు ఎక్కడైనా ఉంటే చూసి రావాలనుకున్నారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుగా వారంతా దేశాటనకు బయల్దేరివెళ్ళారు. వారే మహా విశాఖ నగర పాలక సంస్థకు చెందిన కార్పోరేటలు. దాదాపు తొంబై మంది దాకా కార్పోరేటర్లు, అధికారులు అంతా కలసి వంద మందికి పైగా అతి పెద్ద బృందం కొద్ది రోజుల క్రితం విశాఖ నుంచి విమానంలో దేశంలోని వివిధ మునిసిపాలిటీలను అధ్యయనం చేయడానికి బయల్దేరి వెళ్ళింది.

దానికి స్టడీ టూర్ అని పేరు పెట్టుకున్నారు. ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, సిమ్లాలలో పర్యటించిన ఈ బృందం అంతా బాగానే స్టడీ చేస్తూ సాగుతోంది. అక్కడ అమలవుతున్న ప్రాజెక్టుల గురించి తెలుసుకుంటోంది. స్వచ్చతా కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల మీద ఆయన పాలక వర్గాలు అనుసరిస్తున్న విధానాలను కూడా పరిశీలించింది.

ఇంతవరకూ బాగానే ఉంది అనుకుంటే కులుమనాలి నుంచి చండీఘడ్ వెళుతుండగా కార్పోరేటర్ల బస్సులకు అతి పెద్ద అడ్డు పడిపోయింది. ఆ ఘాట్ లో కొండ చరియలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున విరిగిపడ్డాయి. దాంతో రోడ్ బ్లాక్ అయిపోయింది.

ఇక మూడు బస్సులలో వెళ్తున్న విశాఖ కార్పోరేటర్లు ఏకంగా నడి రోడ్డు మీదనే ఉండాల్సి వచ్చింది. ఒక రాత్రి అంతా వారు అలాగే బస్సులలో గడపడమే ఇక్కడ విశేషం. దీంతో ఈ విషయం తెలిసి విశాఖలోని వారు బంధువులు, ఇతరులు ఆందోళనకు గురి అయ్యారు.

ఇక విశాఖలో ఉన్న మేయర్ హరి వెంకటకుమారి కూడా వారి పరిస్థితి గురించి వాకబు చేశారు. అనకాపల్లి వైసీపీ ఎంపీ భీశెట్టి సత్యవతి ఢిల్లీలోని ఆంధ్రాభవన్ కి ఫోన్ చేసి తన కార్పోరేటర్లను సురక్షింతంగా అక్కడ నుంచి బయటకు వచ్చేలా చూడాలని కోరారు. ఇంకో వైపు అంతా టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడిన ప్రదేశం చూస్తే బ్లాక్ అయిపోయింది ఆర్మీ అధికారులు వచ్చి వాటిని క్లియర్ చేసే చర్యలు చేపడుతున్నా కూడా టైం పట్టేలా ఉంది అంటున్నారు. దీంతో కార్పోరేటర్లు మరింత టైమ్ అలా బస్సులలో ఉండాల్సి వస్తోంది అంటున్నారు. అయితే వారిని క్షేమంగా చూసుకుంటూ అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తామని అక్కడ అధికారులు చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

అయితే ఈ అధ్యయన యాత్ర అహ్లాదంగా సాగుతూ ఉంటే ఈ ఆటంకాలు ఏమిటి అనే అంతా కలవరపడుతున్నారు. మొత్తానికి వారం రోజుల ట్రిప్ గా ఉన్న ఈ స్టడీ టూర్ లో తమ వారు ఇక అన్నీ త్వరగా ముగించుకుని వెంటనే తిరుగు ప్రయాణం అయి రావాలని బంధువులు కోరుతున్నారు. మొత్తానికి ఈ స్టడీ టూర్ వల్ల కార్పోరేషన్ కి ఎంత వరకూ ఉపయోగమో తెలియదు కానీ కార్పోరేటర్లకు మాత్రం ఒక చేదు అనుభవం మిగిలిందని అంటున్నారు.