Begin typing your search above and press return to search.

పెద్దసారా మజాకానా.. వెంటబడి మరీ ఓటేయించిన కార్పొరేటర్

By:  Tupaki Desk   |   15 March 2021 11:30 AM GMT
పెద్దసారా మజాకానా.. వెంటబడి మరీ ఓటేయించిన కార్పొరేటర్
X
ఒకటి తర్వాత ఒకటిగా పరాజయాలు పలుకరించిన వేళ.. తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయిందన్న ప్రచారంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళలో వచ్చాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. రెండుస్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో దేనికదే ఇబ్బందులు ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ విషయానికి వస్తే.. టీఆర్ఎస్ కు మొదట్నించి అచ్చిరాని స్థానంగా చెప్పాలి. రెండోదానిలో సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా ఉన్నప్పటికి.. బరిలో కోదండరాం రావటంతో సీన్ ఎలా ఉంటుందన్న పరిస్థితి. ఇలాంటివేళలో.. రంగంలోకి దిగారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.

వ్యూహాన్ని రచించటమే కానీ.. స్వయంగా రంగంలోకి దిగటం ఈ మధ్యన మానేశారు గులాబీ బాస్. ఇదే.. దుబ్బాక.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగలటానికి కారణమైందని చెబుతారు. చాలా కాలం తర్వాత పోల్ మేనేజ్ మెంట్ ను స్వయంగా పర్యవేక్షించారు కేసీఆర్. దీంతో టీఆర్ఎస్ అగ్రనాయకత్వం మొదలుకొని కార్యకర్త వరకు ఫుల్ అలెర్టుగా ఉన్నారు. కీలకమైన పోలింగ్ కు పది రోజుల ముందు నుంచే ఎవరు ఏ పని చేస్తున్నారు. ఎలా చేస్తున్నారన్న విషయాన్ని రోజువారీగా మానిటర్ చేయటమే కాదు.. కీలకనేతలకు స్వయంగా ఫోన్ చేసి.. చెప్పాల్సిన విషయాల్ని చెప్పినట్లు చెబుతారు.

ఈ దెబ్బతో పలువురు కార్పొరేటర్లు ఒళ్లు వంచి మరీ పని చేసినట్లుగా చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలోని ఒక కార్పొరేటర్ పరిధిలో 740 ఓట్లు ఉంటే.. రెండు వారాల కసరత్తుతో.. ఏకంగా 490 మంది చేత స్వయంగా ఓటేయించిన వైనం ఆసక్తికరంగా మారింది. మొదట్లో పది మందితో పని చేయించిన ఆయన.. చివర్లో ఏకంగా 60 మందిని సీన్లోకి తీసుకొచ్చారు. పోలింగ్ కు మూడు రోజుల ముందు నుంచి ఒక్కొక్కరికి పదమూడు ఓట్లు అప్పజెప్పి.. కనీసం పది ఓట్లు వేయాలన్న టార్గెట్ ఇచ్చి మరీ పని చేయించారని చెబుతున్నారు.

ఇందుకోసం భారీ కసరత్తే జరిగినట్లుగా తెలుస్తోంది. ఓటు ఉన్న వారి నెంబర్లను ముందే సేకరించటం.. వారితో గ్రూపు ఏర్పాటు చేసి.. ఓటు వేశారా? లేదా? అన్న విషయాన్ని ప్రతి గంటకు ఒక రిమైండర్ పెట్టటమే కాదు.. ఓటు వేసిన వారు ఫోటోను పోస్టు చేయాలన్న రిక్వెస్టు చేశారు. అంతేకాదు.. ఓటు వేయటం ఆలస్యమైన వారు.. ఎక్కడ ఉన్నారని అడగటం.. ఓటు వేయాలని చెప్పటంతో.. వారి ఫాలోఅప్ ధాటికి తట్టుకోలేక ఓట్లు వేసినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. పోలింగ్ స్టేషన్ల లొకేషన్లను వాట్సాప్ లో షేర్ చేయటం.. వాహనాల్లో తీసుకెళ్లాలని ఎవరైనా కోరితే వారికి వాహనాల్ని పంపటం లాంటివి చేయటంతో అన్ని ఓట్లు వేయించగలిగినట్లుగా చెబుతున్నారు.

ఇప్పుడీ కార్పొరేటర్ ఉదంతం హాట్ టాపిక్ గా మారింది. ఆ మాటకు వస్తే.. అలాంటి కార్పొరేటర్లు హైదరాబాద్ పరిధిలో పలువురు ఉన్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతలా కష్టపడటానికి కారణం.. పెద్ద సారు నేరుగా సీన్లోకి వచ్చి.. నియోజకవర్గాల వారీగా ఎవరెలా పని చేస్తున్నారన్న విషయాన్ని కనుక్కోవటమే కాదు.. వారు పని చేశారా? లేదా? అన్న విషయానికి సంబంధించిన ఆధారాల్ని చెక్ చేయటంతో పార్టీ వర్గాలన్ని ఒక్కసారిగా ఫుల్ అలెర్టు అయి పని చేసినట్లుగా తెలుస్తోంది. గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో 29 శాతం పోలింగ్ అయితే.. ఈసారి ఏకంగా 52 శాతం పోలింగ్ కావటం వెనుక.. ఈ వరుస ఫాలో అప్ కూడా కారణమన్న మాట వినిపిస్తోంది. భారీగా నమోదైన పోలింగ్ తెలంగాణ అధికారపక్షానికి అనుకూలంగా మారనున్నట్లు తెలుస్తోంది. తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.