Begin typing your search above and press return to search.

ఆ వివాదాస్ప‌ద ఎమ్మెల్సీకి ఎట్ట‌కేల‌కు బెయిల్!

By:  Tupaki Desk   |   23 Aug 2022 4:50 AM GMT
ఆ వివాదాస్ప‌ద ఎమ్మెల్సీకి ఎట్ట‌కేల‌కు బెయిల్!
X
త‌న మాజీ డ్రైవ‌ర్, దళిత యువ‌కుడు సుబ్ర‌హ్మ‌ణ్యంను హ‌త్య చేసిన కేసులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంత్ బాబు ప్ర‌స్తుతం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో ఉన్న సంగ‌తి తెలిసిందే. అనంత్ బాబు జైలుకు వెళ్లి ఆగ‌స్టు 20 నాటికి మూడు నెల‌లు పూర్త‌య్యాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు ఎట్ట‌కేల‌కు బెయిల్ ల‌భించింది. అనంత్ బాబు త‌ల్లి మంగార‌త్నం మృతి చెంద‌డంతో ఆయ‌న‌కు మూడు రోజులపాటు తాత్కాలికంగా బెయిల్ మంజూరు చేస్తూ ఎస్సీ, ఎస్టీ ప్ర‌త్యేక న్యాయ‌స్థానం ఉత్త‌ర్వులు జారీ చేసింది. కాగా ఇంత‌కుముందు బెయిల్ కోసం అనంత్ బాబు మూడుసార్లు ద‌ర‌ఖాస్తు చేసుకోగా కోర్టు తిర‌స్క‌రించిన సంగ‌తి తెలిసిందే.

కాగా మే 19న ఎమ్మెల్సీ అనంత్ బాబు మాజీ కారు డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య‌కు గుర‌య్యాడు. అత‌డి మృత‌దేహాన్ని స్వ‌యంగా ఎమ్మెల్సీ అనంత్ బాబు త‌న కారులో తీసుకువ‌చ్చి తెల్ల‌వారుజామున సుబ్ర‌హ్మ‌ణ్యం త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించిన సంగ‌తి తెలిసిందే. రోడ్డు ప్ర‌మాదంలో సుబ్ర‌హ్మ‌ణ్యం చ‌నిపోయాడ‌ని మొద‌ట అనంత్ బాబు చెప్పాడు.

అయితే మృతుడిపై ఒంటిపై ఉన్న గాయాలతో అత‌డి త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మ‌రోవైపు ద‌ళిత సంఘాలు, మాన‌వ హ‌క్కుల సంఘాల ఒత్తిడితో పోలీసులు ఎమ్మెల్సీ అనంత్ బాబుపై కేసు న‌మోదు చేశారు. హ‌త్య జ‌రిగిన నాలుగు రోజులు త‌ర్వాత మే 23న అత‌డిని అరెస్టు చేశారు. మ‌రోవైపు వైఎస్సార్సీపీ అనంత్ బాబును పార్టీ నుంచి స‌స్పెండ్ చేసింది. మ‌రోవైపు మృతుడు సుబ్ర‌హ్మ‌ణ్యం త‌ల్లిదండ్రులు గ‌వ‌ర్న‌ర్ విశ్వభూష‌ణ్ హ‌రిచంద‌న్‌ను క‌ల‌సి త‌మ కుమారుడి మృతిపై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని కోరారు. రాష్ట్ర పోలీసులు ఈ కేసును నీరు గారుస్తున్నార‌ని ఆరోపించారు.

కాగా ఈ కేసులో ఎమ్మెల్సీ పాత్రపై మొదటి నుంచి అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు ఇప్ప‌టివ‌ర‌కు చార్జిషీట్ కూడా దాఖ‌లు చేయ‌క‌పోవ‌డాన్ని ప్ర‌తిప‌క్షాలు, ప్ర‌జా సంఘాలు, ద‌ళిత సంఘాలు త‌ప్పుబ‌డుతున్నాయి. ఎవ‌రైనా వ్య‌క్తి అరెస్టు అయితే 90 రోజుల్లోపు చార్జిషీట్ దాఖ‌లు చేయ‌క‌పోతే అత‌డికి బెయిల్ ఇవ్వ‌వ‌చ్చ‌నే నిబంధ‌న‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో పోలీసులు తాపీగా ఆగ‌స్టు 20న శ‌నివారం చార్జిషీట్ దాఖ‌లు చేశార‌ని చెబుతున్నారు. అయితే శ‌నివారం కోర్టులో వాద‌న‌లు ఉండ‌వు.

కేవ‌లం ప‌రిపాల‌న ప‌ర‌మైన కార్య‌క్ర‌మాలు మాత్ర‌మే నిర్వ‌హిస్తారు. ఇక ఆగ‌స్టు 21న ఆదివారం కోర్టుకు సెల‌వు. దీంతో ఆగ‌స్టు 22న పోలీసులు దాఖ‌లు చేసిన చార్జిషీట్‌ను ప‌రిశీలించిన కోర్టు చార్జిషీట్‌లో త‌ప్పులున్నాయ‌ని దాన్ని తిర‌స్క‌రించింది. ఈ నేప‌థ్యంలో అనంత్ బాబుకు బెయిల్ మంజూరు చేసింది.

అయితే వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు అనంత్ బాబు స‌న్నిహితుడు కావ‌డం వ‌ల్లే ఆయ‌న‌ను ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేయ‌డానికే ఉద్దేశ‌పూర్వ‌కంగా చార్జిషీట్ దాఖ‌లును ఆల‌స్యం చేయ‌డం, ఇక చిట్ట‌చివ‌రకి చార్జిషీట్‌ను దాఖ‌లు చేసినా అది తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యేలా రూపొందించ‌డం చేశార‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.