Begin typing your search above and press return to search.

మునుగోడులో కాంగ్రెస్ గెలవదు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుమారం

By:  Tupaki Desk   |   22 Oct 2022 8:10 AM GMT
మునుగోడులో కాంగ్రెస్ గెలవదు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుమారం
X
కోమటిరెడ్డి బ్రదర్స్.. వీళ్లద్దరూ కాంగ్రెస్ లోనే ఎదిగారు.. కాంగ్రెస్ లోనే అసమ్మతి రాజేశారు. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరగా.. అన్న వెంకటరెడ్డి ఇంకా కాంగ్రెస్ లోనే ఉంటూ ఆ పార్టీలోనే అసమ్మతి రాజేస్తున్నాడు. ఆ మధ్య ప్రత్యర్థి పార్టీలో ఉన్న తన తమ్ముడిని గెలిపించాలని వెంకటరెడ్డి చేసిన ఫోన్ కాల్స్ దుమారం రేపాయి. ఆ గొడవ సద్దుమణిగిన తర్వాత ఇక వెంకటరెడ్డి స్టార్ క్యాంపెయినర్ హోదాలో మునుగోడు ప్రచారం చేస్తాడని.. తమ్ముడిని ఓడించడానికి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడానికి తన చిత్తశుద్ధిని చాటుకుంటాడని అంతా అనుకున్నారు.కానీ ఆస్ట్రేలియా వెళ్లిపోయి అక్కడి నుంచి తమ్ముడికి మద్దతుగా ఫోన్ కాల్స్ చేస్తుండడం దుమారం రేపుతోంది.

కాంగ్రెస్ లో ఉంటూనే అసమ్మతి రాజేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుమారం రేపుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడుతూ బీజేపీ తరుఫున నిలబడ్డ తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని ఆయన మాట్లాడిన ఆడియో ఒకటి వైరల్ అయ్యింది. తమ్ముడికే ఓటు వేయాలంటూ కాంగ్రెస్ ఎంపీగా ఉండి ఈ లాబీయింగ్ చేయడంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా వెళ్లిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ అభిమానులతో మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.

తాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని.. పార్టీ అధికారంలోకి వస్తుందంటూ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు వెంకటరెడ్డి అసలు మునుగోడులో కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదని తేల్చి చెప్పడం పెనుదమారం రేపుతోంది. తాను మునుగోడుకు వెళ్లి ప్రచారం చేసినా పదివేల ఓట్లు వస్తాయన్నారు. అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న రెండు పార్టీలు కొట్లాడుతున్నప్పుడు ఏం చేయగలుగుతామని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ ఆ రెండు పార్టీల స్థాయిలో డబ్బులు పెట్టలేదన్నారు. పార్టీ ఎవరు డబ్బులు పెట్టాలని ప్రశ్నించారు. తాను 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని.. ఇక చాలని చెప్పుకొచ్చారు. తాను పాదయాత్ర చేద్దామనుకున్నానని.. అయితే కాంగ్రెస్ లో ఒక్కొక్కరిది ఒక్కో గ్రూపుగా ఉందన్నారు. తాను వెళ్లి ప్రచారం చేసినా ఓడిపోయేదనని అన్నారు.ఓడిపోయే సీటుకు ప్రచారం ఎందుకని ప్రశ్నించారు.

మునుగోడుకు వెళ్లి కాంగ్రెస్ కు ఓటు వేయమని చెప్పలేమని కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గెలుస్తారని వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు మునుగోడులో మూడుప్రధాన పార్టీల మధ్య ప్రతిష్టాత్మకంగా మారిన వేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ వేర్వేరు పార్టీలో ఉన్నా కూడా ఆ ఇద్దరూ ఒక్కటేనని కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ లోనే ఉంటూనే వెంకటరెడ్డి ఇలా చేస్తుండడాన్ని కాంగ్రెస్ వాదులు జీర్ణించుకోవడం లేదు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.