Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరికి లిట్మస్ టెస్టు పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్

By:  Tupaki Desk   |   1 March 2021 3:30 PM GMT
ఆ ఇద్దరికి లిట్మస్ టెస్టు పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్
X
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారధిని ఎంపికను నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తర్వాత వరకు వాయిదా వేసిన కాంగ్రెస్ అధినాయకత్వం.. తాజాగా జరుగుతున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. రెండు స్థానాలకు వేర్వేరు నేతలకు బాధ్యతల్ని అప్పగించింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ ఇద్దరు పీసీసీ చీఫ్ కుర్చీ కోసం పోటీ పడుతున్న వారే కావటం.

హైదరాబాద్.. రంగారరెడ్డి..మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల స్థానానికి ఎన్నికల ప్రచారకర్తగా రేవంత్ రెడ్డితో పాటు.. సంపత్ ను నియమించారు. అదే సమయంలో ఖమ్మం.. నల్గొండ.. వరంగల్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికల ప్రచారకర్తగా సీఎల్పీ నేత భట్టి విక్రవార్క.. సమన్వయకర్తగా బెల్లయ్య నాయక్ ను నియమించారు. రేవంత్.. భట్టి.. ఇద్దరు పీసీసీ చీఫ్ పదవి కోసం షార్ట్ లిస్టు అయిన వారే కావటం గమనార్హం.

పార్టీ పగ్గాలు అప్పగించే వేళలో.. ఎవరైతే తమ సత్తాను చాటుతారో వారికి పీసీసీ చీఫ్ పదవి అప్పజెప్పే అవకాశం ఉందంటున్నారు. కీలకమైన ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు మీద ఎవరికి ఎలాంటి ఆశలు లేవు. అయితే.. ప్రత్యర్థి పార్టీలకు పోటీ ఇచ్చే విషయంలో ఎవరెంత సత్తా చాటుతారన్న అంశాన్ని మదింపు చేసేందుకు వీలుగా తాజా ఎంపిక ఉంటుందని అంటున్నారు. ఒకవిధంగా పార్టీలోని నాయకుల్ని సమన్వయం చేసుకోవటం.. ఎన్నికల వేళ నాయకత్వ లక్షణాల్ని ప్రదర్శించటంతో పాటు మిగిలిన అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకునేందుకు వీలుగా ఈ ఎంపిక ఉందని చెబుతున్నారు. మరీ.. లిట్మస్ టెస్టులో విజయం ఎవరిదన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.