Begin typing your search above and press return to search.

ప్రధానికి మోడీకి టీకా పరీక్ష పెట్టిన కాంగ్రెస్.. ఏమవుతుంది?

By:  Tupaki Desk   |   5 Jan 2021 3:00 AM GMT
ప్రధానికి మోడీకి టీకా పరీక్ష పెట్టిన కాంగ్రెస్.. ఏమవుతుంది?
X
కరోనా వ్యాక్సిన్ ఏమో కానీ.. గడిచిన రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా కొత్త చర్చకు తెర తీసినట్లైంది. కరోనా వ్యాక్సిన్ కు ఇప్పటికే రెండు కంపెనీలకు (సీరమ్.. భారత్ బయోటెక్) అనుమతులు ఇవ్వటం తెలిసిందే. పూర్తిస్థాయిలో పరీక్షలు కాకుండానే తొందరపాటుతో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కు అనుమతులు ఇవ్వటాన్ని విపక్షాలు తప్పు పడుతున్నాయి. అందరి కంటే ఎక్కువగా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు.

భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు ఇవ్వటంపై ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలు తాజాగా ప్రధాని మోడీని ఉద్దేశించి కొత్త సవాలు విసిరారు. ఇంత త్వరగా వ్యాక్సిన్ వినియోగానికి అనుమతులు ఇవ్వటం సరికాదని.. టీకా సామర్థ్యంపై జనాల్లో సందేహాలు ఉన్నాయన్నారు.

ఈ క్రమంలో ప్రధాని మోడీ బహిరంగంగా మొదటి డోస్ తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా బిహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అజీత్ శర్మ ఒక అడుగు ముందుకేసి మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ కు చెక్ పెట్టే వ్యాక్సిన్ కు అత్యవసర అనుమతి ఇవ్వటంతో ప్రజలకు ఏర్పడిన సందేహాలకు సమాధానాలు చెప్పేందుకు రష్యా.. అమెరికా ప్రధానులు బహిరంగంగా తొలి డోస్ వేసుకున్నారని.. వారి మాదిరే ప్రధాని మోడీ కూడా టీకా వేయించుకుంటారా? అని ప్రశ్నించారు. మోడీతో పాటు.. మరికొందరు సీనియర్ బీజేపీ నేతలు కూడా వ్యాక్సిన్ వేసుకోవాలని సవాలు విసురుతున్నారు.

గురి చూసి విడిచిన బాణం మాదిరి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే తీసుకొచ్చిన ప్రతిపాదన ఇప్పుడు కొత్త చర్చగా మారటమే కాదు.. ప్రధాని మోడీ ఏదో ఒక నిర్ణయం తీసుకునేలా చేస్తుందని చెప్పక తప్పదు. మరి.. వ్యాక్సిన్ వేసుకునే విషయంలో ప్రధాని మోడీ ఎంత ముందుకు వస్తారో చూడాలి. తాజా వ్యాఖ్యలతో మోడీకి పెద్ద పరీక్షే పెట్టారని చెప్పక తప్పదు.