Begin typing your search above and press return to search.

షర్మిల చేయాల్సిన పనిని కాంగ్రెస్ పెద్దాయన చేసేశాడే

By:  Tupaki Desk   |   8 July 2021 9:59 AM GMT
షర్మిల చేయాల్సిన పనిని కాంగ్రెస్ పెద్దాయన చేసేశాడే
X
రాజకీయాలు గమ్మత్తుగా ఉంటాయి. ఒక్కోసారి చిన్నపాటి ఏమరుపాటుకు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఈ రోజు తన కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించనున్న వైఎస్ షర్మిలకు షాక్ తగిలేలా చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ జీవన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దివంగత మహానేత వైఎస్ పేరును తెలంగాణ కాంగ్రెస్ నేతలు పెద్దగా తల్చుకోలేదు. ఆ మాటకు వస్తే.. వైఎస్ పేరును ప్రస్తావిస్తే రాజకీయంగా తమకు నష్టం వాటిల్లుతుందన్న ఆందోళన ఉండేది. అందుకే.. మాట వరసకు కూడా తలుచుకునే వారు కాదు. గుండెల్లో ఉన్న అభిమానాన్ని అక్కడే గూడు కట్టుకునే వారే తప్పించి.. వైఎస్ ప్రస్తావన తీసుకొచ్చి.. గులాబీ బాస్ కు కౌంటర్ ఎలా వేయాలన్న దానిపై టీ కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందుకే.. ఎవరికి వారు ఆయన పేరును ప్రస్తావించకుండా బండి లాగించేస్తున్నారు.

ఇలాంటివేళ..తెలంగాణలో దివంగత నేత వైఎస్ కుమార్తె షర్మిల పార్టీ పెట్టేందుకు సిద్ధం కావటం.. పేరులోనే కాదు.. జెండా లోనూ వైఎస్ బొమ్మ పెట్టేసిన ఆమె.. జోరుగా రాజకీయాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకాలం కిందామీదా పడి.. ఇప్పుడు రేవంత్ చీఫ్ అయ్యాక కొత్త జోష్ లో ఉన్న వేళ.. వైఎస్ పేరుతో కొంతమందిని తమ నుంచి లాగేస్తే కలిగే ముప్పును తెలంగాణ కాంగ్రెస్ నేతలు గుర్తించినట్లుగా కనిపిస్తోంది. అందుకేనేమో.. ఎప్పుడూ లేనట్లుగా వైఎస్ పేరును ప్రస్తావిస్తూ ఆసక్తికర డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కమ్ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న జీవన్ రెడ్డి కొత్త డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు.

తెలుగు వారి ఘనతను ప్రపంచానికి చాటారని.. అలాంటి ఆయనకు భారతరత్న ఇవ్వాలన్నారు. అంతేనా.. తెలుగువారిలో భారతరత్నకు అర్హత ఉన్న ఏకైక వ్యక్తి వైఎస్సార్ అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకురార్పణ వైఎస్ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ కాళేశ్వరం కింద మార్చటం.. ఆయుకట్టు పెంచటం తెలిసిందే. వైఎస్ లేకుంటే తెలంగాణ ఎండిపోయేదన్న ఆయన.. కృష్ణా నదిపై తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులకు వైఎస్ హయాంలోనే అనుమతులు వచ్చాయని చెప్పారు.

మరింతగా వైఎస్ భజన చేసిన జీవన్ రెడ్డి.. తెలంగాణ సెంటిమెంట్ విషయాన్ని అస్సలు మర్చిపోలేదు సరికదా.. తనను విమర్శించేందుకు అవకాశం ఇవ్వకుండా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఏపీలో రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ చేపట్టలేదని.. ఆ ప్రాజెక్టును అడ్డుకునే హక్కు తెలంగాణకు ఉందని చెప్పటం ద్వారా.. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు మాత్రమే తనకు ముఖ్యమన్న విషయాన్ని స్పష్టం చేశారని చెప్పాలి. మొత్తానికి షర్మిల వైపు వైఎస్ అభిమానులు వెళ్లకుండా ఉండేందుకు జీవన్ రెడ్డితో మొదలైన వైఎస్ భజన.. రానున్న రోజుల్లో మరింత పెరగటం ఖాయమని చెప్పక తప్పదు.

వైఎస్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలన్న డిమాండ్ ను తెర మీదకు తీసుకురావటం ద్వారా.. షర్మిలకు షాకిచ్చారని చెప్పాలి. పార్టీ ప్రకటన తర్వాత.. తన డిమాండ్లలో ఒకటైన వైఎస్ కు భారరత్న ఇవ్వాలన్న మాట ముందే జీవన్ రెడ్డి నోటి నుంచి వచ్చేయటం ఆమెను నిరాశకు గురి చేస్తుందని చెప్పక తప్పదు. రానున్న రోజుల్లో వైఎస్ తమ వాడంటే.. తమ వాడనే వాదన రెండు పార్టీల మధ్య మొదలవుతుందేమో?

ఇదంతాఒక ఎత్తు అయితే.. తెలుగు వారిలో భారత రత్నకు అర్హత ఉన్న ఏకైక వ్యక్తి వైఎస్ అని వ్యాఖ్యానించటం మాత్రం దారుణమనే చెప్పాలి. ఎందుకంటే.. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల చిరకాల వాంఛగా చెప్పక తప్పదు. మహానటుడిగా.. రాజకీయ నేతగా ఆయనకున్న ఇమేజ్ ను అంత పెద్ద సీనియర్ జీవన్ రెడ్డి మర్చిపోవటం ఏమిటి చెప్మా?