Begin typing your search above and press return to search.

బీజేపీలో కీలక పదవుల ‘ఎంపిక’ వెనుక అంత లెక్క?

By:  Tupaki Desk   |   27 Sep 2020 8:50 AM GMT
బీజేపీలో కీలక పదవుల ‘ఎంపిక’ వెనుక అంత లెక్క?
X
బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని తాజాగా ప్రకటించటం తెలిసిందే. పలువురు కొత్త ముఖాలకు చోటివ్వటమే కాదు.. బలమైన నేతలు పార్టీలో ఉన్నా.. వారిని సరిగా వాడుకోవటం లేదన్న విమర్శలకు చెక్ పెట్టేలా నిర్ణయం తీసుకోవటం గమనార్హం. భవిష్యత్తును పరిగణలోకి తీసుకొని నేతల్ని ఎంపిక చేసినట్లుగా తాజా పరిణామాల్ని చూస్తే అర్థం కాక మానదు. తెలంగాణలో ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు పొందిన డీకే అరుణకు.. ఏపీ నుంచి ప్రజాకర్షణ ఉన్న మహిళా నేతగా పేరున్న దగ్గుబాటి పురందేశ్వరికి కీలకమైన జాతీయ పదవులు లభించటం గమనార్హం.

డీకే అరుణకు జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి లభిస్తే.. పురందేశ్వరికి జాతీ ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చారు. తెలంగాణ బీజేపీ మాజీ రథసారధి లక్ష్మణ్ కు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్ష పదవిని అప్పజెప్పటం చూస్తే.. పార్టీ విషయంలో కమిట్ మెంట్ గా వ్యవహరించే వారికి పదవులు ఆటోమేటిక్ గా లభించినట్లుగా చెప్పక తప్పదు.

తాజా ఎంపికను జాగ్రత్తగా చూస్తే.. సామాజిక సమీకరణాలతో పాటు.. వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లుగా చెప్పక తప్పదు. ఏపీ విషయానికే వస్తే.. ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజుకు పార్టీ పగ్గాలు అప్పజెప్పగా.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన పురందేశ్వరికి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయటం ద్వారా ఆమెను అందలానికి ఎక్కించారని చెప్పాలి. ఏపీలో టీడీపీ మసకబారుతున్న వేళ.. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వీలుగా తాజా నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పక తప్పదు.

ఇక.. తెలంగాణ విషయానికి వస్తే.. డీకే అరుణను జాతీయ స్థాయిలో కీలకమైన ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేయటం చూస్తుంటే.. తెలంగాణలో బలమైన రెడ్డి సామాజిక వర్గానికి పార్టీలో ఎంతటి కీలక స్థానం ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లైందని చెప్పాలి. అదే సమయంలో డాక్టర్ లక్ష్మణ్ కు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్ష పదవి లభించటం చూస్తే.. వెనుకబడిన కులాల నుంచి వచ్చి పార్టీ పట్ల కమిట్ మెంట్ తో వ్యవహరించే ఆయనకు మరోసారి గుర్తింపు లభించటంతో పాటు.. సీనియర్ కు ఇవ్వాల్సిన మర్యాదను ఇచ్చినట్లుగా చెప్పక తప్పదు.