Begin typing your search above and press return to search.

పవన్ 3 పెళ్లిళ్ల పేరు విమర్శలు.. ఆ మహిళలకు వేధింపులు కావా?

By:  Tupaki Desk   |   22 Oct 2022 4:11 AM GMT
పవన్ 3 పెళ్లిళ్ల పేరు విమర్శలు.. ఆ మహిళలకు వేధింపులు కావా?
X
మూడు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ ముఖ్యమంత్రి మొదలు వైసీపీ కార్యకర్త వరకు నిత్యం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విరుచుకుపడటాన్ని కాసేపు సమర్ధిద్దాం. పవన్ లాంటి అత్యంత దారుణమైన.. నీతి లేని ఒక నాయకుడు తప్పుడు పని చేశారంటూ నిత్యం విరుచుకుపడదాం సరే.

పవన్ కారణంగా ఇప్పటికే విడాకులు తీసుకున్న ఇద్దరు మహిళలు.. మూడో పెళ్లితో ఆయనకు భార్యగా వ్యవహరిస్తున్న మరో మహిళకు ప్రైవసీ అన్నది లేదా? పవన్ ను టార్గెట్ చేసే క్రమంలో ఆయన్ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయటం సరే. కానీ.. ఏం పాపం చేశారని ఆ ముగ్గురు మహిళల్ని.. వారి ఫోటోల్ని ఇష్టారాజ్యంగా వాడేస్తున్న వారిని ఏమనాలి? వారి కారణంగా తరచూ జనం నోళ్లలో నానుతున్న ఆ ముగ్గురి మానసిక పరిస్థితి ఏమిటి?

మూడు పెళ్లిళ్లతో పవన్ దారుణమైన నేరాన్ని చేసినట్లుగా అభివర్ణించే ఉత్తములు.. మరి.. తమ మాటలతో తరచూ ఆ ముగ్గురు మహిళల మనసులకు గాయమయ్యేలా మాట్లాడటాన్ని ఏమనాలి? ఏలా చూడాలి. వ్యక్తిగత అంశాలే.. రాజకీయ విమర్శలకు ప్రధాన అస్త్రాలుగా మారిన పక్షంలో.. ప్రతి రాజకీయ నాయకుడి కుటుంబానికి చెందిన వ్యక్తిగత అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చి చర్చించే దమ్ము ఉందా? మూడు పెళ్లిళ్లు అంటూ ముఖ్యమంత్రే మాట్లాడిన ఉదంతం కారణంగా.. ఆ ముగ్గురు మహిళల గురించి అదే పనిగా చర్చ జరగటం.. ఆ ముగ్గురు మహిళలకు ఎంతటి వేదనను కలిగిస్తుందన్న విషయాన్ని ఎవరూ ఎందుకు పట్టించుకోరు?

పెళ్లి చేసుకొని కలిసి ఉండటం ఒక ఎత్తు. విడిపోవటం మరో ఎత్తు. చట్టబద్ధంగా విడిపోయిన తర్వాత ఎవరి దారి వారిదన్నట్లుగా బతుకుతున్న వారికి.. వారికంటూ జీవితాలు ఉంటాయన్నది మర్చిపోకూడదు. కాలంతో పాటు ప్రయాణిస్తూ.. గతానికి చెందిన చేదు గురుతుల్ని మర్చిపోయేందుకు ప్రయత్నించే వారికి.. అదే పనిగా గాయాన్ని కెలికే వైనాన్ని ఎలా చూడాలి? వారి కారణంగా అయ్యే గాయాలకు మందేంటి?
మూడు పెళ్లిళ్ల ఎపిసోడ్ లో పవన్ మాత్రమే లక్ష్యమైతే.. ఆయన్ను వేలెత్తి చూపటం.. ఆయన చేసింది దారుణాతి దారుణమైన నేరమైతే ఆయనపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి. అందుకు భిన్నంగా.. ఆయన పేరుతో ఆయన గత జీవితానికి సంబంధించిన మహిళల ప్రస్తావనను తరచూ తెర మీదకు తీసుకురావటం ఎంతవరకు న్యాయం? మరెంత వరకు ధర్మం?

మూడు పెళ్లిళ్లు అంటూ వేదన గొంతుతో మాట్లాడే ముఖ్యమంత్రి.. ఈ సున్నిత అంశంలో తన మాటలతో పవన్ మాత్రమే లక్ష్యం కావట్లేదని.. ఆయన మాజీ భార్యలు సైతం తరచూ తెర మీదకు వస్తున్నారన్న అంశాన్ని ఆయనకున్న పెద్ద మనసు ఎందుకు ఆలోచించలేకపోతోంది? అన్నది ఒక ప్రశ్నగా మారుతోంది.

ఒక ప్రముఖుడి మూడు పెళ్లిళ్ల ఇష్యూ సమాజం మీద చూపించే దారుణ ప్రభావాన్ని విప్పి.. వివరించి చెప్పి.. మహిళా లోకంపై అంతులేని కరుణను ప్రదర్శించే దయామయుడైన ముఖ్యమంత్రి.. తన మాటల కారణంగా గతాన్ని వదిలేసి.. వర్తమానంలో బతుకుదామని ప్రయత్నించే బాధిత మహిళలకు అదే పనిగా గతాన్ని గుర్తు చేయటం సరైనదేనా? ఈ సున్నితమైన అంశాన్ని పట్టించుకోకుండా తనకు తగ్గ రాజకీయం కోసం మూడు పెళ్లిళ్ల మాటను అదే పనిగా ప్రస్తావించటం న్యాయమేనా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేదెవరు?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.