Begin typing your search above and press return to search.

చంద్రబాబు పరిస్థితి ఇలాగైపోయిందే ?

By:  Tupaki Desk   |   22 Oct 2021 3:30 AM GMT
చంద్రబాబు పరిస్థితి ఇలాగైపోయిందే ?
X
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది. అధికారంలో ఉంటే ఒకలాగ ఖర్మకాలి ప్రతిపక్షంలోకి వస్తే మరోలాగ వ్యవహరించటం చంద్రబాబుకు బాగా అలవాటే. ఇపుడిదంతా ఎందుకంటే పదే పదే ప్రతి విషయంలోను కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర బలగాలు భద్రత కావాలట, సీబీఐ విచారణ జరిపించాలట, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వెంటనే కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలట.

ఓ రెండున్నర సంవత్సరాల వెనక్కు వెళితే అధికారంలో ఉన్నపుడు ఇదే చంద్రబాబు ఏమి మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకుందాం. అప్పట్లో తన పార్టీ ఎంపీలైన సుజనాచౌదరి, సీఎం రమేష్ తదితరులపై సీబీఐ వరుసబెట్టి దాడులు చేసింది. అవినీతి, అక్రమాలపై తమ ఎంపిలను సీబీఐ ఎక్కడ అరెస్టు చేస్తుందో అన్న భయంతో సీబీఐని రాష్ట్రంలోకి అడుగుపెట్టేందుకు లేదంటు ఉత్తర్వులు జారీచేశారు. ప్రత్యర్థులపై నరేంద్ర మోడీ సీబీఐని ఒక పావుగా ప్రయోగిస్తున్నారంటు నానా గోల చేశారు.

ఇదే పద్దతిలో చంద్రబాబు పాలనపై కేంద్రం జోక్యం చేసుకోవాలని అప్పట్లో ప్రతిపక్షమైన వైసీపీ నేతలు డిమాండ్ చేస్తే తన పాలనలో కేంద్రం జోక్యం చేసుకునేందుకు లేదంటు చంద్రబాబు అంతెత్తున లేచారు. రాష్ట్రప్రభుత్వాల అధికారాల్లో కేంద్రం పెత్తనమేంటని నిలదీశారు. పనిలో పనిగా ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు రాష్ట్రంలో అసలు ప్రతిపక్షాలు ఎందుకంటు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం గుర్తుకురాదు, రాజ్యంగం గురించి ఆలోచించరు, మీడియా స్వేచ్చపై మాట్లాడేందుకు లేదు. సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపుతారు.

ప్రతిపక్షంలోకి రాగానే వెంటనే ప్రజాస్వామ్యం విలువల గురించి లెక్షర్లు ఇస్తున్నారు. ప్రతిపక్షాలు ప్రాధాన్యత గురించి గంటలపాటు మాట్లాడుతున్నారు. మీడియా స్వేచ్ఛను ప్రభుత్వం హరించేస్తోందంటు గోల చేస్తున్నారు. పోలీసులు అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నట్లు మండిపోతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే అరెస్టులు చేస్తారా ? అంటు నిలదీస్తున్నారు. పదే పదే కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి లేఖ రాశారు.

ఇలాంటి పరస్పర విరుద్ధమైన వైఖరి వల్లే చంద్రబాబు జనాల్లోనే కాదు కేంద్రం ముందు కూడా పలుచనైపోయారు. ఎప్పటికప్పుడు తనకు ఏది అడ్వాంటేజ్ అన్న విషయాన్ని మాత్రమే చంద్రబాబు మాట్లాడుతారు. మీడియా మద్దతు ఏకపక్షంగా ఉన్నపుడు చంద్రబాబు ఏమి చేసినా చెల్లుబాటైపోయింది. కానీ ఇది మీడియా కాలం కాదు సోషల్ మీడియా కాలమని చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. ఇపుడు చంద్రబాబు ఏమి మాట్లాడినా ఒకపుడు ఇదే అంశంపై ఏమి మాట్లాడారనే విషయాన్ని జనాలకు సోషల్ మీడియా గుర్తుచేస్తోంది. ఇపుడు మనం మాట్లాడుకున్న విషయాలనే బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా ప్రస్తావిస్తున్నారు.