Begin typing your search above and press return to search.

మూడు రాజధానుల మీద ఆ కోర్టులోనే సవాల్...?

By:  Tupaki Desk   |   24 March 2022 7:39 AM GMT
మూడు రాజధానుల మీద ఆ కోర్టులోనే సవాల్...?
X
మూడు రాజధానుల ముచ్చట ఎంత వరకూ వచ్చింది అంటే అది అలాగే ఉంది. కధ సుఖాంతం అయితే కాలేదు. హై కోర్టు కీలకమైన తీర్పు ఇచ్చిన తరువాత ప్రభుత్వానికి ఉన్న ఒకే ఒక మార్గం సుప్రీం కోర్టు తలుపులు తట్టడ‌మే. మరి ఆ విధంగా చేసినా కూడా సర్కార్ కి అనుకూలంగా తీర్పు వస్తుందా అంటే ఎవరూ చెప్పలేరు.

దాంతో గత కొన్నాళ్ళుగా ఇదే విషయం మీద మల్లగుల్లాలు పడుతున్న ప్రభుత్వం మొత్తానికి ఒక డెసిషన్ కి అయితే వచ్చింది అంటున్నారు. ఈ అంశాన్ని ప్రజా కోర్టులోనే తేల్చుకోవాలన్నదే ఆ నిర్ణయం. ప్రజా కోర్టు అంటే ఎన్నికల వరకూ వేచి ఉండడమే. ఇప్పటికి సరిగ్గా రెండేళ్ళ సమయం ఎన్నికలకు ఉంది. అంతవరకూ మూడు రాజ‌ధానుల మీద మా స్టాండ్ మారలేదు అని ప్రభుత్వం ఎప్పటికపుడు చెప్పుకుంటూ ఉండడమే.

ఇక మూడు రాజధానుల అంశాన్ని ఎన్నికల అజెండాగా చేసుకోవడానికి కూడా వైసీపీ పెద్దలు ఆలోచన చేస్తున్నారు అని తెలుస్తోంది. నిజంగా అదే చేయాలి కూడా. రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. అమరావతి రాజధాని మీద హై కోర్టు తుది తీర్పు వచ్చింది. అమరావతి మీదనే పందెం కట్టిన టీడీపీ, బీజేపీ, జనసేన సహా అన్ని పార్టీలు గెలిచాయనుకున్నాయి.

మరి ఆ తీర్పు వల్ల వచ్చిన విజయాన్ని రాజకీయంగా మలచుకోవడానికి అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. వీటికి ఎంతో కొంత ప్రయోజనం సమకూరడమూ ఖాయమే. మరి అమరావతికి యాంటీగా వైసీపీని చిత్రీకరించారు కాబట్టి ఆ పార్టీ ఏం చేయాలి. సరే ఒకే రాజధాని అని అంటూ కూర్చోలేదు కదా. ఆ విధంగా తన రాజకీయాన్ని బలిపెట్టుకోలేదు కదా.

అందుకే వైసీపీ ప్లాన్ మూడు రాజధానులను అలా కంటిన్యూ చేస్తుంది అని అంటున్నారు. ఇంతదూరం వచ్చాక అదే సరైన ఎత్తుగడ కూడా. మూడు రాజధానుల విషయంలోనే ఫక్తు రాజాకీయం కూడా ఉంది. మూడు ప్రాంతాల ఓట్లను కొల్లగొట్టాలన్న మాస్టర్ ప్లాన్ కూడా ఉంది. అందుకే వైసీపీ నిబ్బరంగా ఉంది.

ఇపుడు హై కోర్టు తీర్పు రావడంతో మూడు రాజధానుల మీద బిల్లు పెట్టకుండా న్యాయ సాంకేతిక సమస్యలను ఎలా అధిగమించడం అన్న దాని మీదనే వైసీపీ పెద్దలు దృష్టి సారించారు. మొత్తానికి వైసీపీ వూహం ఏంటి అంటే ఎన్నికల ముందు మూడు రాజధానుల బిల్లుని పెట్టి జనాల్లోకి వెళ్ళాలని. ఆ విధంగా ప్రజా కోర్టులో తీర్పును కోరాలని తీర్మానిస్తున్నట్లుగా వెల్లడి అవుతోంది. ఇవన్నీ చూసుకుంటే కనుక మూడు రాజధానుల అంశం 2024లో ప్రజా తీర్పుతోనే పరిష్కారం అయ్యేంట్లుగా కనిపిస్తోంది అంటున్నారు.