Begin typing your search above and press return to search.

కేంద్రం సంచలన నిర్ణయం.. కేసీర్, జగన్ కు ఝలక్

By:  Tupaki Desk   |   7 March 2020 6:27 AM GMT
కేంద్రం సంచలన నిర్ణయం.. కేసీర్, జగన్ కు ఝలక్
X
గత కొన్నాళ్లుగా శాసనసభ, లోక్ సభ నియోజకవర్గాల పెంపు అంశంపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. గతంలోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని చాలాసార్లు కోరారు. స్వయంగా ప్రధానమంత్రి, హోంమంత్రిని కలిసి విన్నవించినా స్పందన రాలేదు. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాలకు ఝలక్ ఇస్తూ ఇతర రాష్ట్రాల్లో నియోజవర్గాల పునర్విభజనకు కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఓ కమిషన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

నాలుగు ఈశాన్య రాష్టాలు నాగాలాండ్, మణిపూర్, అసోం, అరుణాచల్ ప్రదేశ్ తో పాటు కొత్తగా విభజించిన జమ్ము, కశ్మీర్ లో నియోజకవర్గాల పునర్విభజనకు ప్రక్రియ కేంద్రం మొదలుపెట్టింది. నియోజకవర్గాల పునర్విభజన కోసం ఒక కమిషన్ ను ఏర్పాటుచేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో నియోజకవర్గాలను విభజించేందుకు ఒక ప్రత్యేక కమిషన్ వేసి ఆ కమిషన్ నివేదిక అనంతరం చర్యలు చేపట్టనున్నారు. నాలుగు ఈశాన్య రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నియోజకవర్గ పునర్విభజన త్వరలోనే ప్రారంభం కానుంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ రంజన్ ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా కేంద్ర ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన స్థానిక ప్రధాన ఎన్నికల కమిషనర్ తో కూడిన కమిషన్ ను కేంద్రం ప్రకటించింది. 2002 నాటి నియోజకవర్గాల పునర్విభజన చట్టాన్ని అనుసరించి ఈ కమిషన్ పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏడాదిలోపు కమిషన్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా పునర్విభజనను చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది.

అకస్మాత్తుగా ఈ నిర్ణయం ప్రకటించడం వెనుక ఆ రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులే కారణమని తెలుస్తోంది. 370 చట్టం రద్దు తర్వాత జమ్ము, కశ్మీర్ విభజన జరగడంతో ఆ రెండు ప్రాంతాల్లో విపత్కర పరిస్థితులు ఉన్నాయి. ఈశాన్య ప్రాంతంలోని నాలుగు రాష్ట్రాల్లో ఎన్సార్సీతో తీవ్ర ప్రభావం ఏర్పడింది. దీంతో ఆందోళనలతో ఆ రాష్ట్రాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో శాంతి నెలకొల్పేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నియోజకవర్గాల పునర్విభజనకు మొగ్గు చూపింది. ఇతర రాష్ట్రాలు కోరుతున్నా వాటిని కాదని కేవలం ఈ రాష్ట్రాల్లో నియోజకవర్గాలను విభజిస్తే పరిస్థితులు అదుపులోకి వస్తాయని కేంద్రం భావిస్తోంది. ఆ క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే ఎప్పటి నుంచో నియోజకవర్గాల విభజన చేయాలని తెలుగు రాష్ట్రాలు కోరుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చారు. స్వయంగా వచ్చి కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. రాజకీయ కారణాలతోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నియోజకవర్గాల పునర్విభజన కోరుతున్నారని భావించి కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. ఆ ప్రాంతాల్లో పరిస్థితులు సక్రమంగా లేకపోవడంతోనే నియోజకవర్గాల పునర్విభజనకు మొగ్గు చూపిందని కేంద్రం వెల్లడించింది. అయితే తెలుగు రాష్ట్రాల వినతిపై ఇప్పుడే కేంద్రం మొండి వైఖరి మాత్రం వీడడం లేదు.