Begin typing your search above and press return to search.

ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్రం షాక్‌.. మూడు రాజ‌ధానుల‌పై సంచ‌ల‌న నిర్ణ‌యం

By:  Tupaki Desk   |   13 Sep 2022 2:18 PM GMT
ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్రం షాక్‌.. మూడు రాజ‌ధానుల‌పై సంచ‌ల‌న నిర్ణ‌యం
X
ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వానికి ఇటీవ‌ల కాలంలో ప‌లు అంశాల్లో షాక్ ఇస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం.. తాజాగా అత్యంత కీల‌క‌మ‌ని వైసీపీ నేత‌లు భావిస్తున్న మూడు రాజ‌ధానుల విష‌యంలోనూ అదే సూత్రం పాటించింది. మూడు రాజ‌ధానులను క‌ట్టి తీరుతామ‌ని.. తాజాగా రాజ‌ధాని రైతులు పాద‌యాత్ర 2.0 చేప‌ట్టిన ద‌రిమిలా మంత్రులు మ‌రింత రెచ్చిపోతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈ క్ర‌మంలో కేంద్రం `కొత్త రాజ‌ధానికి నిధులు` అని మాత్ర‌మే పేర్కొంది. వైసీపీ స‌ర్కారు చెబుతున్న మూడు రాజ‌ధానుల అంశాన్ని క‌నీసం మాట మాత్రంగా కూడా ప్ర‌స్తావించ‌కపోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో వైసీపీ ప్ర‌భుత్వ పెద్ద‌లు షాక్‌కు గుర‌య్యారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఈనెల 27న కీలక సమావేశం నిర్వహించనుంది. విభజన చట్టం ప్రకారం రాజధానికి కేంద్ర సహకారంపై భేటీలో చర్చించనున్నారు. విభజన చట్టం షెడ్యూల్‌ 9, 10లోని ఆస్తుల పంపకాలపైనా భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్థికపరమైన అంశాలూ చర్చకు రానున్నాయి. సమావేశంలో ఏ అంశాలు చర్చించాలన్న దానిపై కేంద్ర హోం శాఖ.. ఇరు రాష్ట్రాల అధికారులకు ఇప్పటికే సమాచారం అందించింది.

ఈ షెడ్యూల్‌లో మూడు రాజధానులపై కేంద్ర హోంశాఖ అజెండాలో ప్రస్తావించలేదు. `కొత్త రాజధాని`కి నిధులు అని మాత్రమే పేర్కొంది. కొత్త రాజధాని ఏర్పాటుకు కేంద్ర సహకారం, విద్యాసంస్థల స్థాపన, రాజధాని నుంచి ర్యాపిడ్‌ రైల్‌ అనుసంధానంపై చర్చించాలని కేంద్ర హోంశాఖ అజెండాలో పొందుపరిచింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా నేతృత్వంలో జరిగే ఈ భేటీకి హాజరుకావాలని ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శులతో పాటు రైల్వే బోర్డు ఛైర్మన్‌ సహా వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

కేంద్ర ఆర్థికశాఖతో పాటు విద్య, రైల్వే, పెట్రోలియం శాఖతో పాటు దాదాపు 9శాఖల అధికారులను భేటీకి ఆహ్వానించారు. ఏపీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు సంబంధించి ఇప్పటికీ కొలిక్కి రాని పరిస్థితి నెలకొంది. దీనిపై కూడా చర్చించేందుకు అజెండాలో పొందుపర్చారు. వీటితో పాటు సింగరేణి కాలరీస్‌, ఏపీ హెవీ మిషనరీ ఇంజినీరింగ్‌కు సంబంధించిన రెండు సంస్థలపై, పన్ను ప్రోత్సాహకాలు, రెవెన్యూ లోటు భర్తీ, ఏపీలో వెనుకబడిన 7 జిల్లాలకు ఇవ్వాల్సిన గ్రాంటుపై చర్చ జరగ‌నుంది. సో.. దీనిని బ‌ట్టి.. కేంద్రం కూడా మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగానే ఉంద‌నే అభిప్రాయాన్ని పంపించ‌న‌ట్టు అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.