Begin typing your search above and press return to search.

పోల‌వరంపై.. కురిపించని వ‌రం!

By:  Tupaki Desk   |   19 Oct 2021 11:30 AM GMT
పోల‌వరంపై.. కురిపించని వ‌రం!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న పోల‌వరం ప్రాజెక్టుపై కేంద్రం మౌనం పాటిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్త‌యే దిశ‌గా ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్ర సర్కారు ఎలాంటి తోడ్పాటు అందించ‌డం లేదు. తుది అంచ‌నా వ్య‌యం ద‌గ్గ‌ర నుంచి పెండింగ్‌లో ఉన్న బిల్లులు కీల‌క డిజైన్లు ఇలా అనేక విష‌యాల‌ను ప‌ట్టించుకోకుండా మొండి వైఖ‌రి ప్ర‌ద‌ర్శిస్తోంది. పోల‌వ‌రం తుది అంచ‌నా వ్యయంపై మొండి ప‌ట్టు ప‌డుతోంది. 2013-14 నాటి రూ.20,398 కోట్ల‌కు మించి పైసా ఇచ్చేది లేద‌ని తేల్చి చెబుతోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం ఎన్ని విన్న‌పాలు చేసినా ప‌ట్టించుకోవ‌డం లేదు. గ‌తంలో కేంద్ర కేబినేట్ ఆమోదించిన అంచ‌నా వ్య‌యాన్ని మించి ఒక్క పైసా ఎక్కువ ఖ‌ర్చు చేసినా ఇచ్చేది లేద‌ని చెప్తూ రూ.1,658 కోట్ల బిల్లుల‌ను వెన‌క్కి పంపించేసింది.

హెడ్‌వ‌ర్క్స్ బిల్లులు రూ.461.25 కోట్లు, కుడి ఎడ‌మ కాలువ‌ల బిల్లులు రూ.209.87 కోట్లు, భూసేక‌ర‌ణ‌కు రూ.291.20 కోట్లు, స‌హాయ పున‌రావాసానికి రూ.440.99 కోట్లు, ప‌రిపాల‌నా వ్య‌యం కింద ఖ‌ర్చు చేసిన రూ.255.60 కోట్లు ఇలా మొత్తం రూ.1,658 కోట్ల బిల్లుల‌ను పోల‌వరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) క‌నీసం కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ ప‌రిశీల‌న‌కు పంప‌కుండానే తిప్పిపంపింది. పోల‌వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్ర‌క‌టించినపుడు దీని నిర్మాణానికి పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌ని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన హామీల త‌ర‌హాలోనే దీన్ని గాలికి వ‌దిలేసింద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌గ‌న్ ప్ర‌భుత్వం అంచ‌నా వ్య‌యాన్ని రూ.56,548.87 కోట్ల‌కు పెంచింది. కానీ కేంద్రం మాత్రం 2013-14 నాటి అంచ‌నా వ్య‌యం రూ.20,398.61 కోట్ల‌కు మించి ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేద‌ని చెబుతోంది.

ఈ పెరిగిన అంచ‌నా వ్య‌యంపై సీఎం జ‌గ‌న్ ప్ర‌ధాని మోడీకి లేఖ కూడా రాశారు. భూసేక‌ర‌ణ స‌హాయ పున‌రావాస కార్య‌క్ర‌మాల‌కే రూ.33 వేల కోట్లు అవుతుంద‌ని అప్పుడు పేర్కొన్నారు. అనంత‌రం ఢిల్లీలో ప్ర‌ధాని, కేంద్ర మంత్రులు అమిత్ షా నిర్మ‌లా సీతారామ‌న్ గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌ల‌ను జ‌గ‌న్ క‌లిశారు. ఆర్థిక శాఖ నియ‌మించిన క‌మిటీ రూ.55,656.87 కోట్ల‌ను కుదించి రూ.47,725.74 కోట్లుగా అంచ‌నా వ్య‌యాన్ని ఖ‌రారు చేసింది. ఈ మొత్తానికి ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి షెకావ‌త్ కేంద్ర ఆర్థిక శాఖ‌ను కోర‌గా.. ఆ శాఖ అందుకు ఒప్పుకోలేదు. ప్రాజెక్టులో తాగునీటి స‌ర‌ఫ‌రా ప‌థ‌కం కోసం వ్యయం చేసే రూ.4,400 కోట్లు ఇవ్వాల‌న్న విన‌తిని కూడా ఆర్థిక మంత్రి నిర్మ‌ల ప‌క్క‌కుపెట్టారు. ఈ ప్రాజెక్టుకు రూ.20,396.61 కోట్ల‌కు మించి ఒక్క రూపాయి అద‌నంగా చెల్లించాల‌న్న కేంద్ర కేబినేట్ ఆమోదం త‌ప్ప‌నిస‌రని ఆమె స్ప‌ష్టం చేశారు.

మ‌రోవైపు ప్రాజెక్టులో ప‌లు కీల‌క డిజైన్ల‌ను కూడా ఇంకా ఆమోదించాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల స‌మీక్ష జ‌రిపిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కేంద్రం నిధులు రీయింబ‌ర్స్‌మెంట్ చేయ‌క‌పోవ‌డంపై చ‌ర్చించారు. ప్రాజెక్టు నిర్మాణ వ్య‌యం మొత్తం రాష్ట్రం భ‌రించేలా కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేంద్రంపై ఒత్తిడి పెంచాల‌ని జ‌ల వ‌న‌రుల శాఖ‌ను జ‌గ‌న్ ఆదేశించిన‌ట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ అధికారులు.. కేంద్ర జ‌ల‌శ‌క్తి ఉన్న‌తాధికారుల‌ను క‌లిసేందుకు సన్న‌ద్ధ‌మ‌వుతున్నారు. కానీ జ‌గ‌న్‌తో పాటు ఆర్థిక మంత్రి బుగ్గ‌న ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రుల‌ను క‌లిసినా ఎలాంటి ఫ‌లితం లేన‌ప్పుడు తాము వెళ్తే మాత్రం కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ స్పందిస్తుందా అని రాష్ట్ర అధికారులు కిందా మీదా ప‌డ‌తున్న‌ట్లు స‌మాచారం.