Begin typing your search above and press return to search.

దేశంలో మూడో వేవ్ మొదలయ్యేది ఎక్కడి నుంచో చెప్పిన ప్రముఖుడు

By:  Tupaki Desk   |   9 July 2021 4:13 AM GMT
దేశంలో మూడో వేవ్ మొదలయ్యేది ఎక్కడి నుంచో చెప్పిన ప్రముఖుడు
X
వణికించే కరోనా పుణ్యమా అని.. దేశంలోని పలువురు డాక్టర్లు.. పలు రంగాలకు చెందిన నిపుణులు.. ముఖ్యులు చాలామంది తెర మీదకు వచ్చారు. అంతేకాదు.. సాధారణంగా మీడియాలో ఎప్పుడూ ఫోకస్ కాని సంస్థలు.. వాటికి సంబంధించిన ప్రముఖులు సైతం మీడియాలో మొదటి పేజీని ఆక్రమించేసిన ప్రత్యేక పరిస్థితి మహమ్మారి కారణంగా చోటు చేసుకుందని చెప్పాలి. అలా సుపరిచితులైన ప్రముఖుల్లో ముఖ్యులు పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ సారధి కమ్ పద్మభూషణ్ డాక్టర్ కె.శ్రీనాథ్ రెడ్డి.

తాజాగా దేశంలో సాగుతున్న వ్యాక్సినేషన్ గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు నడుస్తున్న టీకా కార్యక్రమంలో వేగం లేదని తప్పు పట్టిన ఆయన.. కనీసం రోజుకు కోటి మందికైనా టీకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పటం గమనార్హం. వైరస్ లో ఊహించని మార్పులు జరిగినా.. జాగ్రత్తలు విస్మరించినా.. అంచనాల కంటే కూడా వేగంగా థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చారు.

అంతేకాదు.. దేశంలో థర్డ్ వేవ్ మొదలైతే ఎక్కడి నుంచి వస్తుందన్న విషయం మీదా స్పష్టత ఇచ్చారు. మూడో వేవ్ కు మూలంగా ఢిల్లీ.. ముంబయి.. బెంగళూరు.. చెన్నై.. హైదరాబాద్ లాంటి మహానగరాల నుంచే మొదలవుతుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. సెకండ్ వేవ్ ఇంకా తగ్గిపోలేదని.. కాకుంటే తగ్గుముఖం పట్టిందన్నారు. మణిపూర్.. అరుణాచల్ ప్రదేశ్.. మేఘాలయ లాంటి ఈశాన్య రాష్ట్రాలతో పాటు కేరళ.. రాజస్థాన్ తో పాటు మరికొన్నిరాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు.

లాక్ డౌన్ వేళ ఇళ్లకు పరిమితమైన ప్రజలు.. ఆంక్షల సడలింపుతో స్వేచ్ఛగా బయటకు తిరుగుతున్నారన్నారు. కులూ.. ముసోరీలాంటి పర్యాటక ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వేలాది మంది గుమిగూడటం లాంటివి చోటు చేసుకుంటున్నాయని.. ఇలాంటి చర్యలు మూడో వేవ్ ను ఆహ్వానించటమేనని స్పష్టం చేశారు.

మూడో వేవ్ ఎప్పటి నుంచి మొదలవుతుంది? అన్న దానిపైసూత్ర మోడల్ ప్రకారం అక్టోబరు -నవంబరులో మూడో వేవ్ వస్తుందంటున్నారు. ఆగస్టు నుంచే ఈ ముప్పు ఉందని ఎన్ బీఐ అధ్యయనం చెబుతోంది. వైరస్ లో మార్పులు.. ప్రజల్లో అప్రమత్తం ఆధారంగానే థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుందని చెప్పే వీలుందని చెబుతున్నారు. ఏమైనా.. ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండటం క్షేమకరం.