Begin typing your search above and press return to search.

మళ్ళీ మొదలవబోతున్న సీబీఐ దర్యాప్తు

By:  Tupaki Desk   |   4 Feb 2021 11:00 PM IST
మళ్ళీ మొదలవబోతున్న సీబీఐ దర్యాప్తు
X
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐ మళ్ళీ ప్రారంభించబోతోంది. దర్యాప్తు బృందంలోని అధికారులు గురువారం రాత్రికి కడపకు చేరుకుంటున్నారు. అంటే శుక్రవారం ఉదయం పులివెందులకు చేరుకుని హత్యకేసులో ఆధారాల కోసం స్ధానిక కోర్టులో పిటీషన్ వేయబోతున్నారు. అంటే హత్య ఘటనలో స్ధానిక పోలీసులు సేకరించిన ఆధారాలను తీసుకునేందుకు పులివెందుల కోర్టులో పిటీషన్ వేస్తారు.

టీడీపీ హయాంలో జరిగిన వివేకానందరెడ్డి హత్యకేసు ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. హత్య చేసిదెవరు ? హత్యకు కుట్రపన్నిందెవరు ? తెరవెనుకుండి హత్య చేయించిన వాళ్ళెవరన్న విషయంలో పోలీసులు ఎటువంటి ఆధారాలు సేకరించారో ఎవరికీ తెలీదు. అందుకనే పోలీసుల దర్యాప్తుపై అనుమానాలతోనే కోర్టు ఆదేశాలతో సీబీఐ బృందం రంగంలోకి దిగింది.

అయితే సీబీఐ అధికారులు కూడా హత్య కేసులో అనుమానితులను విచారించటం, కొందరిని అదుపులోకి తీసుకోవటంతోనే కాలం గడిచిపోతోంది. మధ్యలో కొందరు సీబీఐ అధికారులకు కరోనా వైరస్ సోకటంతో దర్యాప్తు అర్ధాంతరంగా నిలిచిపోయింది. మళ్ళీ అధికారులకు కరోనా వైరస్ తగ్గిన తర్వాత రేపటి నుండి దర్యాప్తు ప్రారంభించబోతున్నారు.

ఈ నేపధ్యంలోనే వివేకా కూతురు డాక్టర్ సునీత ఢిల్లీకి వెళ్ళి సీబీఐ ఉన్నతాధికారులను కలిశారు. ఇదే సందర్భంగా ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త జోమున్ పుతెన్ను కూడా కలిసి కేసు వివరాలను చర్చించారు. తొందరగా కేసు పరిష్కారం అవ్వటంలో సహకారం అందించాలని అడిగారు. దాంతో ఆమె కూడా సానుకూలంగా స్పందించారు. వివేకా హత్యకేసుకు సంబంధించిన కీలక ఆధారాలు తన దగ్గరున్నాయని తొందరలోనే బయటపెడతానని చెప్పటం సంచలనంగా మారింది.