మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారుకు గండం పొంచి ఉన్నట్లే ఉంది. అందుకే కారు గుర్తులాంటి గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని టీఆర్ఎస్ నేతల ఎన్నికల కమీషనర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అభ్యర్ధులకు ఎన్నికల కమీషన్ కేటాయించబోయే గుర్తుల నుండి 8 గుర్తులను తొలగించాలంటు కమీషనర్ కు కారు నేతలు అభ్యర్ధన అందించారు. నేతల లెక్క ప్రకారం కెమెరా, చపాతిరోలర్, డాలీ, రోడ్డురోలర్, సబ్బుపెట్టె, టీవీ, కుట్టుమిషన్, ఓడ గుర్తులను తొలగించాలి లేదా ఎవరికీ కేటాయించకూడదన్నది వీళ్ళ డిమాండ్.
ఇంతకీ వీళ్ళ సమస్య ఏమిటంటే కారు గుర్తును పోలుండే ట్రాక్టర్, రోడ్డురోలర్, జీపు లాంటి గుర్తులను గతంలో కమీషన్ ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించింది. ఆ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది. టీఆర్ఎస్ అభ్యర్థులపై ప్రత్యర్ధులు గెలిచిన మెజారిటి కన్నా ట్రాక్టర్, జీపు, రోడ్ రోలర్ గుర్తులున్న అభ్యర్ధులకు ఎక్కువ ఓట్లొచ్చాయి. దాని కారణంగా 2018 ఎన్నికల్లో మునుగోడు, సిర్పూరు, జహీరాబాద్, డోర్నకల్, నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్ధిపేట, అసిఫాబాద్, బాన్సువాడ, నాగార్జునసాగర్ నియోజవర్గాల్లో గట్టి దెబ్బపడింది.
అప్పట్లోనే పై గుర్తులపై టీఆర్ఎస్ నానా గోలచేసింది. అయితే ఎన్నికల కమీషన్ వీళ్ళ గోలను పట్టించుకోలేదు. అందుకనే ఇపుడు కమీషన్ తో మాట్లాడిన నేతలు పై గుర్తులను గనుక బ్యాలెట్ లిస్టునుండి తొలగించకపోతే తాము కోర్టులో కేసు వేస్తామని కూడా చెప్పారు.
అయితే వీళ్ళ అభ్యర్ధనలను కమీషన్ పరిగణలోకి తీసుకునేది చాలా తక్కువ. ఎందుకంటే ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో ఎవరికి ఏ గుర్తు కేటాయించాలన్నది ఎన్నికల కమీషనర్ ఇష్టంకాదు. ఈ గుర్తులన్నీ కేంద్ర ఎన్నికల కమీషన్ నిర్ణయిస్తుంది. కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల ప్రకారమే ఎన్నికల కమీషనర్లు నడుచుకుంటారంతే. ఇపుడు టీఆర్ఎస్ నేతలు అభ్యంతరాల ప్రకారం ఆ గుర్తులను బ్యాన్ చేసే అవకాశం ఎన్నికల కమీషనర్ కు లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.