Begin typing your search above and press return to search.

తెలంగాణతో పాటు ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు.. ఆసక్తికరమే

By:  Tupaki Desk   |   3 Nov 2022 12:30 PM GMT
తెలంగాణతో పాటు ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు.. ఆసక్తికరమే
X
తెలంగాణలోని మునుగోడులో ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతోంది. ఇదే సమయంలో మరో ఐదు రాష్ట్రాల్లోనూ ఉప ఎన్నికలు సాగుతుండడం గమనార్హం. ఇందులో దాదాపు అన్ని రాష్ట్రాలూ కీలకమైనవే కావడం మరో గమనించాల్సిన అంశం. తెలంగాణలో.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వైదొలగి.. బీజేపీలో చేరడంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు పార్టీలతో పాటు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కూ ఈ ఉప ఎన్నిక ప్రతిష్ఠాత్మకమైంది.

బీజేపీ.. వర్సెస్ ప్రాంతీయ పార్టీలు ఇక్కడ చిత్రమేమంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ప్రాంతీయ పార్టీలు ఈ ఉప ఎన్నికల్లో తలపడుతున్నాయి. ఆరు రాష్ట్రాల్లోని ఏడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక జరుగుతోంది. మునుగోడులో టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మారాక పోటీ చేస్తుండడం.. ఈ మధ్యలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం వెలుగులోకి రావడం.. నేరుగా బీజేపీ అధిష్ఠానంపైనే గురిపెట్టడంతో ఈ ఉప ఎన్నిక అన్నిటికీ మించి జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.

బిహార్ లో నీతీశ్-తేజస్వికి సవాల్ సరిగ్గ మూడు నెలల కిందట అధికారం చేజారిన (సంకీర్ణం) బిహార్ లో బీజేపీకి ఇప్పుడు ఉప ఎన్నిక పరీక్ష ఎదురైంది. ఈ రాష్ట్రంలో మోకామా, గోపాల్ గంజ్ లలో ఉప ఎన్నిక జరుగుతుండగా.. వీటిలో మోకామాలో ఆర్జేడీ, గోపాల్ గంజ్ లో బీజేపీ ఇదివరకు గెలిచాయి. దీంతో కనీసం గోపాల్ గంజ్ లో అయినా గెలవడం బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇక్కడ నీతీశ్ ప్రచారానికి రాకపోవడం కాస్త ఆసక్తి రేపుతోంది.

హరియాణలో ఇలా.. గత ఆగస్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్.. బీజేపీలో చేరారు. తన నియోజకవర్గం హరియాణలోని అదంపూర్. మాజీ సీఎం భజన్ లాల్ చిన్న కుమారుడీయన. ఐదు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంపై కాంగ్రెస్ పట్టు కొనసాగుతోంది. ఇప్పుడు కుల్దీప్ కుమారుడు భవ్య బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి, రెండుసార్లు ఎమ్మెల్యే, మూడుసార్ల ఎంపీగా చేసిన జైప్రకాష్ (కాంగ్రెస్)తో పోటీ పడుతున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ లో గోలా గోరఖ్ నాథ్ సీటు బీజేపీకి ప్రతిష్ఠాత్మకం. ఎస్పీతో నేరుగా తలపడుతన్నది. ఇది బీజేపీ సిట్టింగ్ స్థానం. ఎమ్మెల్యే అర్వింద్ గిరి మరణంతో ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్, బీఎస్సీ దూరంగా ఉన్నాయి. ఒడిశాలోని ధామ్ నగర్ కూడా బీజేపీ సిట్టింగ్ స్థానమే.

మహారాష్ట్రలో మరో సమరం ఇక మహారాష్ట్రలో నాలుగు నెలల కిందట జరిగింది ఏమిటో అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. కాంగ్రెస్-ఎన్సీపీ-శివ సేన సారథ్యంలోని కూటమి ప్రభుత్వాన్ని.. ఏక్ నాథ్ షిండేను అడ్డుపెట్టుకుని కూల్చింది బీజేపీ. ఇప్పుడక్కడ ముంబై అంథేరీ తూర్పు నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతోంది. అయితే, ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థిని నిలపలేదు. శివసేన (ఉద్ధవ్), శివసేన (షిండే) పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ సాగుతోంది. ఈ అన్ని ఉప ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.