Begin typing your search above and press return to search.

టీడీపీ, జనసేన మధ్య వారధి ఆ మాజీ ఎంపీ..?

By:  Tupaki Desk   |   23 March 2021 9:42 AM GMT
టీడీపీ, జనసేన మధ్య వారధి ఆ మాజీ ఎంపీ..?
X
ఏపీలో రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. అవసరార్థం ఏ పార్టీతో ఏ పార్టీ కలుస్తుందో చెప్పలేకుండా ఉంది. గతంలో టీడీపీకి మద్దతు ప్రకటించి ఆ పార్టీ తరుఫున జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కొన్ని రోజుల నుంచి కమలంకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఒంటరిగానే రాజకీయాల్లో కొనసాగుతాడా..? అన్న చర్చ సాగుతోంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ ను మరోసారి కలిపే ప్రయత్నం చేస్తున్నాడట ఓ మాజీ ఎంపీ. వీరిద్దరి కలయికతోనే వైసీపీని ఓడించగలమనే సూత్రాన్ని ఇద్దరికీ చెబుతూ ఆయన వీరి మధ్య వారధిగా ఉంటున్నాడట.

రాయలసీమ ఫైర్ బ్రాండ్ గా పేరు మోసిన జేసీ బ్రదర్స్ కు ఇప్పుడు మంచిరోజులు వచ్చాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రి మున్సిపల్ స్థానాన్ని జేసీ ఫ్యామిలీ గెలుచుకుంది. ఏపీలోని దాదాపు అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ.. తాడిపత్రిలో మాత్రం జేసీ బ్రదర్స్ ధాటికి నిలవలేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో జేసీ బ్రదర్స్ కు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కీలక నాయకుడు రాహుల్ గాంధీ సైతం ఇటీవల జేసీ దివాకర్ రెడ్డి ఫోన్ చేసి వారికి కంగ్రాట్స్ చెప్పారు.

గెలుపు జోష్ లో ఉన్న జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల తెలంగాణ కాంగ్రస్ నాయకులను కలిశారు. వారితో కలిసి లంచ్ చేశారు. పార్టీ పరిస్థితిపై మాట్లాడారు. అయితే కాంగ్రెస్ మాజీ సభ్యుడైన దివాకర్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్తున్నారా..? అన్న చర్చ సాగింది. అఫీషియల్ గా ఆయన ఎలాంటి వాఖ్యలు చేయకపోయినా వారితో పాత సంబంధాల కారణంగానే కలిశానని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా టీడీపీకి వరుస ఎన్నికల్లో ఓటమే ఎదురవుతోంది. అటు జనసేన పార్టీ పంచాయతీ ఎన్నికల్లో కొంత ప్రభావం చూపినా మున్సిపల్ ఎన్నికల్లో సినిమా పార్టీ అన్నట్లుగానే పేరు తెచ్చుకుంది. దీంతో వచ్చే ఎన్నికల వరకైనా పవన్, చంద్రబాబు కలిస్తే జగన్ ను ఓడించే అవకాశాలున్నాయని సదురు ఎంపీ ఇద్దరికీ చెప్పాడట. ఇందులో భాగంగా ఆయన చిరంజీవిని కలిసి మాట్లాడాడట. గతంలో చంద్రబాబు, పవన్ కలిసి ప్రచారం చేస్తే అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే తిరుపతి ఉప ఎన్నికల్లో ఈ ప్లాన్ అమలు పరిస్తే సక్సెస్ అవుతామని దివాకర్ రెడ్డి స్వయంగా చిరంజీవితో అన్నాడట.

అయితే ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టకున్న జనసేన కొద్ది రోజులుగా ఆ పార్టీకి దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో చేయి కలిపితే బీజేపీని కూడా కోలుకోకుండా చేయొచ్చనే అభిప్రాయంతో ఉన్నారట. మరి మాజీ ఎంపీ ప్లాన్ సక్సెస్ అవుతుందా..? లేదా..? చూడాలి.