2020 వస్తుంటే.. చాలామంది ఈ ఏడాది గురించి చాలానే ఆసక్తిని ప్రదర్శించారు. అంకెల్లో ఉన్న వైవిధ్యం కారణంగా 2020ను అభిమానించి.. ఆరాధించినోళ్లు బోలెడంత మంది ఉన్నారు. కానీ.. ఏడాది మొదలై నాటి నుంచి చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ దరిద్రపు సంవత్సరం ఎంత త్వరగా పూర్తి అయితే అంత బాగుండని తిట్టుకోని వారు దాదాపుగా లేని పరిస్థితి. ఎప్పుడు చూడని వింతలు.. విశేషాలతో నిండిన ఈ ఏడాదిలో తాజాగా బయటకు వచ్చిన ఒక విడ్డూరం నోట మాట రాకుండా చేస్తోంది.
థాయ్ లాండ్ కు చెందిన ఒక కుర్రాడు పామును పెళ్లి చేసుకున్నాడు. విషపూరితమైన కోబ్రాను (ఇప్పుడైతే కోరలు పీకేసి.. విషం తీసేశారు లెండి) వివాహమాడారు. తన స్నేహితులకు.. బంధువులకు తాను పెళ్లి చేసుకున్నట్లు చెప్పిన అతగాడు.. ఆ అమ్మాయి ఎవరని చూసినోళ్లకు నోట మాట రాని పరిస్థితి. పామును పెళ్లి చేసుకోవటం ఏమిటంటే.. ఐదేళ్ల క్రితం చనిపోయిన తన లవ్వర్ పాముగా పుట్టిందని.. అందుకే ఆమెను పెళ్లాడినట్లు చెబుతున్నారు.
దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. తాను ఆమెను ఎంతో ప్రేమించేవాడినని.. ఆమె పాములా ఉన్నా తాను ప్రేమిస్తానని చెబుతున్నాడు. పది అడుగుల పొడవున్న ఆ పాముతోనే ఉంటున్న అతడు.. టీవీ చూడటం.. భోజనం చేయటం.. ఆ పాముతోనే నిద్రపోవటం లాంటివి చేస్తున్నాడట. చివరకు పాముతోనే రొమాన్సు చేస్తున్నట్లు చెప్పిన మాటలు వింటే.. ఒంటి మీద తేళ్లు.. జెర్రెలు పాకినట్లుగా అనిపించక మానదు. పాము తన ప్రియురాలే కావటంతో.. తనకేమీ అనిపించట్లేదని చెబుతున్నాడు. అప్పుడప్పడు దానని తీసుకొని పిక్నిక్ కూడా వెళుతున్నాడట. ఇతగాడి ప్రేమో.. వెర్రో.. మరింకేమో అంటూ బుగ్గలు నొక్కేసుకుంటున్నారు. పిచ్చపలు విధాలు అని ఊరికే అనలేదేమో?