Begin typing your search above and press return to search.

అయోధ్యలో దేదీప్యమానంగా దీపోత్సవం..గిన్నిస్ రికార్డ్ కైవసం

By:  Tupaki Desk   |   14 Nov 2020 1:10 PM GMT
అయోధ్యలో దేదీప్యమానంగా  దీపోత్సవం..గిన్నిస్ రికార్డ్ కైవసం
X
దీపావళి వేళ రామజన్మభూమి రమణీయంగా ముస్తాబైంది. మిరుమిట్లు గొలిపే విద్యుత్​దీపాలతో ఈ ప్రదేశమంతా ఆధ్యాత్మికశోభను సంతరించుకున్నది. సరయూ నది తీరంలో నిర్వహించిన దీపోత్సవం గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించింది దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు జరుగుతున్న వేళ రామజన్మభూమి అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రం అయోధ్య సమీపంలోని సరయూ నది తీరంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ‘దీపోత్సం’ గిన్నిస్​ రికార్డుల్లోకి ఎక్కింది. శుక్రవారం రాత్రి 5,84,572 దీపాలను నదీ తీరంలో ఏర్పాటు చేశారు. ఆ అరుదైన వేడుకను కోట్లాది మంది ప్రజలు ఆన్​లైన్​లో టీవీల్లో వీక్షించారు.

రామాలయానికి భూమిపూజ జరిగిన తర్వాత తొలిసారి జరుపుకుంటున్న దీపావళి కావడంతో ఈ ప్రాంతాన్ని అందంగా ముస్తాబు చేశారు. సరయూ నది తీరాన ఏర్పాటు చేసిన లేజర్ షో ద్వారా రాముడి చరిత్రను కళ్లకు కట్టారు. శ్రీరాముడు సీతాసమేతంగా పుష్పక విమానంలో లంక నుంచి వచ్చిన ఘటనను లేజర్‌, సౌండ్‌ షోలో ప్రదర్శించారు. 6 లక్షల దీపాల వెలుగులో అయోధ్య దేదీప్యమానంగా వెలిగింది. ఆదివారం రాత్రి వరకూ దీపోత్సవం జరుగనుందని నిర్వాహకులు తెలిపారు.

అయోధ్యలోని సాకేత్‌ కళాశాల నుంచి నదీతీరం వరకూ సుమారు 5 కిలోమీటర్ల పొడవున శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. రామాయణ కీలక ఘట్టాల్ని ప్రతిబింబించేలా శకటాలు ఏర్పాటు చేశారు. యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ వేడుకలను తిలకించారు. ‘గడచిన 500ఏళ్లలో ఎంతోమంది సాధువులు, పుణ్యాత్ములు రామజన్మభూమిలో రామాలయాన్ని చూడాలని కలగన్నారు. ఇది చూడగలుగుతున్న మన తరం ఎంతో అదృష్టవంతులం. రామరాజ్య స్థాపనకు కృషి చేసిన ప్రధాని మోదీకి నా కృతజ్ఞతలు’’ అని యోగి ఆదిత్యనాథ్‌ పేర్కొన్నారు. అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, అత్యాధునిక బస్‌స్టాండ్‌ను తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు.