Begin typing your search above and press return to search.

బీజేపీ.. 'ఆప‌రేష‌న్ 144'.. 2024 ఎన్నిక‌ల‌పై ప‌క్కా స్కెచ్ ఇదే!

By:  Tupaki Desk   |   10 Oct 2022 4:01 AM GMT
బీజేపీ.. ఆప‌రేష‌న్ 144.. 2024 ఎన్నిక‌ల‌పై ప‌క్కా స్కెచ్ ఇదే!
X
కేంద్రంలో వ‌రుస‌గా రెండుసార్లు అధికారంలోకి వ‌చ్చి రికార్డు సృష్టించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లోనూ.. విజ‌యం ద‌క్కించుకుని ముచ్చ‌ట‌గా మూడోసారి కూడా.. పాగా వేయాల‌ని.. హ్యాట్రిక్ కొట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర ముందుగానే.. ప‌క్కా స్కెచ్ వేశారు. ప్ర‌స్తుతం ఉన్న స్థానాల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏదైనా వ్య‌తిరేక‌త కార‌ణంగా.. పోగొట్టుకున్నా.. మిగిలిన వాటిని వ‌దులుకోకూడ‌ద‌నే పంతంతో వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే గ‌తంలో పోటీ చేయ‌ని.. లేదా.. ఓడిపోయిన స్థానాలు.. 144పై.. ఇప్ప‌టి నుంచి 'ఆప‌రేష‌న్‌' ప్రారంభించాల‌ని నిర్ణ‌యించారు. ఒక్క‌సారి గ‌తంలోకి వెళ్తే.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 437 స్థానాల్లో పోటీ చేసింది. వాస్త‌వానికి దేశంలో ఉన్న పార్ల‌మెంటు స్థానాలు 547. అయితే.. 110 స్థానాల్లో అస‌లు పోటీ చేయ‌నేలేదు. ఈ క్ర‌మంలో గ‌త ఎన్నిక‌ల్లో గెలిచినవి 303 సీట్లు. మరి మిగిలిన నియోజకవర్గాల సంగతేంటి? అక్కడ కమలదళం ఎందుకు ఓడిపోయింది? అనేది ప్ర‌శ్న‌.

ప్రస్తుతం ఆయా చోట్ల పార్టీ పరిస్థితి ఏంటి? వ‌చ్చే 2024 లోక్సభ ఎన్నికల్లో ఆ నియోజకవర్గాల్నీ దక్కించు కోవాలంటే ఏం చేయాలి?.. కొంతకాలంగా బీజేపీ నేత‌లను ఆలోచింపచేసిన ప్రశ్నలివి. తీవ్ర మేధోమధ నం తర్వాత ఓ స్పష్టతకు వచ్చారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన, ప్రస్తుతం పార్టీ బలహీనంగా ఉన్న 144 నియోజకవర్గాల్ని గుర్తించి.. ఆయా స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కేలా వ్యూహాన్ని ఖరారు చేశారు.

'లోక్సభ ప్రవాస్ యోజన' రెండో దశలో భాగంగా 144 నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు బీజేపీ నేత‌లు. దేశంలోని 40 కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్ర‌చారం చేయ‌నున్నారు. భారీ స్థాయిలో బహిరంగ సభలు నిర్వహించనున్నా రు. మిగిలిన 104 స్థానాల బాధ్యత.. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేబినెట్ మంత్రులకు అప్ప‌గించారు. వారు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు.

ఒక్కో నియోజకవర్గాన్ని ఒక్కో క్లస్టర్గా పరిగణిస్తారు. ప్రతి క్లస్టర్కు ఒక కేంద్ర మంత్రి బాధ్యునిగా ఉంటారు. స్థానికంగా ఉండే వేర్వేరు రంగాల ప్రముఖులతో తరచుగా సమావేశాలు నిర్వహించడం, అసమ్మతి నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడి, వారి సమస్యలు పరిష్కార‌మయ్యేలా చూడడం కేంద్ర మంత్రుల బాధ్యత. లోక్సభ ప్రవాస్ యోజన రెండో దశ అమలు కోసం మంత్రులకు ఐదు అంశాలతో స్పష్టమైన ప్రణాళికను ఖరారు చేశారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి మొత్తం 353 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 52 సీట్లకు పరిమితం కాగా.. ఆ పార్టీ సారథ్యంలోని యూపీఏకు 91 స్థానాలు వచ్చాయి. ఇతర పార్టీలు అన్నింటికీ కలిపి 98 సీట్లు వచ్చాయి. ఇప్పుడు.. మొత్తంగా అన్ని సీట్ల‌పైనా క‌న్నేయాల‌నేది.. బీజేపీ వ్యూహం మ‌రి ఏమేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.