Begin typing your search above and press return to search.

బీజేపీకి ఎదురుదెబ్బే.. కాంగ్రెస్ మేలుకోవాల్సిందే

By:  Tupaki Desk   |   24 Oct 2019 5:40 AM GMT
బీజేపీకి ఎదురుదెబ్బే.. కాంగ్రెస్ మేలుకోవాల్సిందే
X
కేంద్రంలో అధికారంలో ఉంది. విస్తృతమైన అధికారం, డబ్బు పరపతి ఉంది. మొన్ననే దేశంలో క్లియర్ కట్ మెజార్టీతో ప్రజల మద్దతు పొంది మోడీషాలు అధికారం చేపట్టారు. ఈ నేపథ్యంలో దేశంలో సార్వత్రిక ఎన్నికల తర్వాత 5 నెలలకే వచ్చిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని అంతా భావించారు. ఇక బీజేపీ ప్రభంజనం తట్టుకోవడం కష్టమని భావించి కాంగ్రెస్ రథసారథులు సోనియా, ప్రియాంకగాంధీలు అస్సలు ప్రచారానికే రాలేదు. ఇక రాహుల్ గాంధీ మంది మానానికి వచ్చినట్టు వచ్చి క్రికెట్ ఆడుతూ మహారాష్ట్ర, హర్యానాలో ప్రచారాన్ని మమ అనిపించారు..

దేశంలో బీజేపీ హవా నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ కూడా కమలం పార్టీదే రెండు రాష్ట్రాలు అని కుండబద్దలు కొట్టాయి. అయితే దేశ ఓటర్లు బీజేపీకి గట్టి షాకే ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి చుక్కలు చూపించారు.

తాజాగా వెలువడుతున్న మహారాష్ట్ర, హర్యానా ఫలితాల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలేట్టు కనిపిస్తోంది.. మహారాష్ట్రలో గత సారి సాధించిన మెజార్టీ కంటే తక్కువ సీట్లను బీజేపీ కట్టబెట్టారు. ఇక హర్యానాలో కాంగ్రెస్ పోటాపోటీ ఇవ్వడం బీజేపీకి షాక్ లా పరిణమించింది. హర్యానాలో హంగ్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

గత అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో మొత్తం 288 సీట్లకు గాను బీజేపీకి 122 సీట్లు, దాని మిత్రపక్షం శివసేనకు 63 సీట్లు దక్కాయి. మొత్తం 185 సీట్లతో మేజిక్ ఫిగర్ కు కంటే ఎక్కువే దక్కించుకొని మహారాష్ట్రలో అధికారం చేపట్టింది. ఇక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 42 సీట్లు సాధించగా.. దాని మిత్రపక్షం ఎన్సీపీ 41 సీట్లకే పరిమితమైంది.

ఇక 2019 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి మహారాష్ట్రలో బీజేపీకి షాక్ తగిలింది. ఉదయం 11 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం.. మహారాష్ట్రలో పోయిన సారి కంటే తక్కువ సీట్లకే బీజేపీ పరిమితం అవ్వడం ఆ పార్టీకి షాక్ లా మారింది. ఇప్పటివరకు బీజేపీ , శివసేన కలిసి కేవలం 157 సీట్లకే పరిమితమైంది. ఇక కాంగ్రెస్ 93 సీట్లు సాధించి పోయినసారి కంటే డబుల్ ఫిగర్ తో ఉంది. ఇండిపెండెంట్లు,ఎంఐఎం, ఇతరులు ఏకంగా 37 స్థానాల్లో ఆధిక్యంలో ఉండడం గమనార్హం. మహారాష్ట్రలో మేజిక్ ఫిగర్ 144.. అన్ని సీట్లను బీజేపీ సాధించినా అదీ బోటాబోటీనే. దీంతో నైతికంగా మహారాష్ట్రలో బీజేపీ గెలిచినా.. అక్కడ ఓడిపోయినట్టే లెక్క. మహారాష్ట్రలో గతంతో పోలిస్తే కాంగ్రెస్ బాగా పుంజుకుంది. మంచి పోటీనిచ్చింది. ఇక శరద్ పవార్ ఎన్సీపీ కూడా మెజార్టీ సీట్లలో ఆధిక్యంలో దూసుకెళుతోంది. అసలు ఎన్సీపీ పోటీనే కాదని భావించిన బీజేపీకి షాక్ ఇస్తూ ఆ పార్టీ ఏకంగా 51 స్థానాల్లో లీడ్ లో ఉండడం బీజేపీకి షాక్ లా మారింది. కాంగ్రెస్ కూడా ఎన్సీపీలా ప్రయత్నిస్తే మహారాష్ట్రలో అధికారం దక్కేదన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

ఇక హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్ నువ్వానేనా అన్నట్టు పోటీ నెలకొంది. అక్కడ హంగ్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఉదయం 11 గంటల వరకు చూస్తే హర్యానాలోని మొత్తం 90 సీట్లలో బీజేపీ 40 సీట్లలో, కాంగ్రెస్ 31 సీట్లలో ఆధిక్యంలో ఉంది. స్వతంత్రులు 10 మంది ఇక్కడ కీలకంగా ఉన్నారు. వారు ఎటు మద్దతిస్తే వారిదే హర్యానా పీఠం. మేజిక్ ఫిగర్ 45. ఇక్కడ అధికారం దక్కించుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుండగా.. డిప్యూటీ సీఎం పోస్టు ఇస్తే కాంగ్రెస్ కు మద్దతిస్తామని బీజేపీ ఆఫర్ ఇవ్వడం గమనార్హం.

దేశంలో అధికారంలో ఉండి.. గట్టిగా పోరాడిన బీజేపీకి ఈ బోటాబోటీ ఫలితాలు షాక్ లా మారాయి. మోడీ షా సహా కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బూత్ స్థాయి వరకూ దేశం మొత్తం మీద నుంచి వచ్చి ప్రచారం చేసినా మహారాష్ట్రలో కన్నులొట్టబోయి బీజేపీ బటయపడేలా ఉంది.. ఇక హర్యానాలో అయితే మెజార్టీకి దూరంగా అధికారం కోల్పోవడం చూస్తే రాహుల్ ఫెయిల్ అవ్వడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సోనియా, రాహుల్, ప్రియాంక సహా కాంగ్రెస్ శ్రేణులంతా బీజేపీకి భయపడి రాలేదు. వీరే కనుక ఐకమత్యంతో ఇంకా గట్టిగా ప్రయత్నిస్తే ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హర్యానాలో షాకిచ్చినట్టే మహారాష్ట్రలో కూడా బీజేపీకి దెబ్బ పడేదన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ బీజేపీ గెలిచిందనే కంటే కాంగ్రెస్ ప్రయత్న లోపంతో ఓడిపోయిందనే చెప్పవచ్చు.