Begin typing your search above and press return to search.

దేశంలోనే అతిపెద్ద స్కాం రట్టు ... వందల కోట్లు మాయం..!

By:  Tupaki Desk   |   3 Dec 2021 12:30 AM GMT
దేశంలోనే అతిపెద్ద స్కాం రట్టు ... వందల కోట్లు మాయం..!
X
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొందరు నేరగాళ్లు సైబర్ క్షేత్రాన్ని దుర్వినియోగం చేస్తూ సమాన్యులను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న సైబర్ నేరస్తులు మన నెట్టింట్లో ప్రవేశించి మన బ్యాంకు ఖాతాను లూటీ చేస్తున్నారు. ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా ప్రైవసీని భగ్నం చేయడం, బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయడం, భద్రతకు ముప్పు కలిగించడం చేస్తున్నారు. రోజురోజుకీ సైబర్ నేరాల తీవ్రత ఊహించనంత వేగంతా విస్తరిస్తోంది. ముఖ్యంగా ఆర్థిక సంస్థలను సైబర్ నేరగాళ్లు వణికిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు చేతిలో మోసపోయిన సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులున్నారు.

సైబర్ నేరగాళ్లు గుట్టును సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర రట్టు చేశారు. ద లోన్ ఇండియా, ఎస్‌బీఐ ధనీ బజార్‌, లోన్‌ బజార్ పేర్లతో ఫేక్ కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా రూ.వందల కోట్ల మోసాలకు పాల్పడుతున్న రెండు ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో నకిలీ ఎస్బీఐ బ్యాంకు కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారని, ఇది దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసమని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. స్ఫూపింగ్‌ యాప్‌ ద్వారా ఎస్‌బీఐ అసలైన కస్టమర్‌ కేర్‌ నుంచే ఫోన్‌ చేస్తున్నట్లు నమ్మించి మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు.

ఈ అప్లికేషన్‌ను విదేశాల్లో కూడా నిందితులు వాడుతున్నారని పేర్కొన్నారు. ఈ యాప్‌ వాడకానికి సంబంధించి ఫర్మాన్‌ హుస్సేన్‌ అనే ప్రధాన నిందితుడు కీలకంగా వ్యవహరించినట్లు రవీంద్ర వెల్లడించారు. 1860 180 1290 అనే నంబర్‌ నుంచి ఫోన్ చేసి బాధితుల కార్డు వివరాలను సేకరించి డబ్బు కాజేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కేసులో మొత్తం 14 మంది నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుల నుంచి 30 సెల్‌ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, కారు, బైకు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

లోన్లు ఇస్తామని ఫోన్లు చేసి నకిలీ యాప్‌ సాయంతో మోసాలకు పాల్పడుతున్న మరో ముఠాను కూడా సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడు అభిషేక్ మిశ్రా నకిలీ యాప్‌ తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. నకిలీ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యాక వ్యక్తిగత వివరాలు తీసుకొని ఆ తర్వాత రుణం మంజూరైనట్లు చెబుతారని, ప్రాసెసింగ్‌ ఫీజు పేరిట అధిక మొత్తంలో నగదు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ ముఠాలోని సభ్యులను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి 17 సెల్‌ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, 5 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు రవీంద్ర వెల్లడించారు.