Begin typing your search above and press return to search.

చ‌రిత్ర‌లోనే అతిపెద్ద సైబ‌ర్ దాడి.. డిమాండ్‌ ఎన్ని వంద‌ల కోట్లో తెలుసా?

By:  Tupaki Desk   |   6 July 2021 3:30 AM GMT
చ‌రిత్ర‌లోనే అతిపెద్ద సైబ‌ర్ దాడి.. డిమాండ్‌ ఎన్ని వంద‌ల కోట్లో తెలుసా?
X
కంప్యూట‌ర్ చ‌రిత్ర‌లోనే అతి పెద్ద సైబ‌ర్ దాడి జ‌రిగింది. అమెరికాలోని ఫ్లోరిడా కేంద్రంగా ప‌నిచేస్తున్న ఐటీ సాఫ్ట్ వేర్ ప్రొవైడ‌ర్ కెస‌యా వీఎస్ఏ పై హ్యాక‌ర్లు దాడిచేశారు. త‌ద్వారా ఈ సంస్థ‌కు చెందిన స‌క‌ల స‌మాచారాన్ని త‌మ ఆధీనంలోకి తీసుకున్న దుండ‌గులు.. వ‌దిలేసి పోవాలంటే భారీగా డ‌బ్బులు డిమాండ్ చేశారు. ఆ మొత్తం 70 మిలియ‌న్ డాల‌ర్లు. అంటే.. మ‌న క‌రెన్సీలో ఏకంగా 520 కోట్ల రూపాయ‌లు!

ఈ సైబ‌ర్ దాడి వెనుక ర‌ష్యా హ‌స్తం ఉండొచ్చ‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆ దేశంతో సంబంధం ఉన్న ఆర్ ఈవిల్ ర్యాన్స‌మ్ వేర్ గ్యాంగ్ ఈ దాడికి పాల్ప‌డి ఉండొచ్చ‌ని సందేహిస్తున్నారు. ఇటీవ‌ల జెనీవాలో జ‌రిగిన అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ - ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ స‌మావేశంలో సైబ‌ర్ దాడుల అంశం చ‌ర్చ‌కు రావ‌డం గ‌మ‌నార్హం.

ఇలాంటి దాడుల‌ను అడ్డుకోవాల‌ని అమెరికా అధ్య‌క్షుడు అన్నారు. ఇలాంటి సైబ‌ర్ నేర‌గాళ్ల చ‌ర్య‌ల‌కు అమెరికా అడ్డుక‌ట్ట వేస్తుంద‌ని కూడా బైడెన్ అన్నారు. ఈ నేప‌థ్యంలో అమెరికాపై సైబ‌ర్ దాడి జ‌ర‌గ‌డంతో.. వారి హ‌స్తం ఉండొచ్చ‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

ప్ర‌స్తుతానికి 70 మిలియ‌న్ డాల‌ర్లు డిమాండ్ చేసిన హ్యాక‌ర్లు.. ఈ మొత్తం చెల్లించాల్సిందేన‌ని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే.. స‌మాచారం మొత్తం డార్క్ వెబ్ లో పెట్టేస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు. డార్క్ వెబ్ లో అన్నీ ఇలాంటి అక్ర‌మాల‌కు సంబంధించిన అమ్మ‌కాలు, కొనుగోళ్లు సాగుతుంటాయి. దీన్ని ఆప‌రేట్ చేయ‌డానికి ప్ర‌త్యేక స‌ర్వ‌ర్లు ఉంటాయి. వీటిని సాధార‌ణ బ్రౌజింగ్ తో గుర్తించ‌లేరు.

అయితే.. హ్యాక‌ర్లు అడిగిన మొత్తం గ‌న‌క చెల్లిస్తే మాత్రం.. హ్యాకింగ్ చ‌రిత్ర‌లోనే ఇదే అత్య‌ధిక పెద్ద డీల్ అవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఇంత మొత్తం ఎవ‌రికీ ఎవ‌రూ చెల్లించ‌లేదు. మ‌రి, దీనిపై కంపెనీ ఏం చేస్తుంది? త‌రువాత ప‌రిణామాలు ఎలా ఉండ‌బోతున్నాయి? అన్న‌ది చూడాలి.