Begin typing your search above and press return to search.

బయటపడిన అతిపెద్ద బ్యాంక్ స్కాం

By:  Tupaki Desk   |   23 Jun 2022 6:30 AM GMT
బయటపడిన అతిపెద్ద బ్యాంక్ స్కాం
X
దేశంలోనే అతిపెద్ద బ్యాంకు స్కాం బయటపడింది. ఢిల్లీ కేంద్రంగా వ్యాపారం చేస్తున్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) బ్యాంకుల కన్సార్షియంను రు. 34,615 కోట్లకు ముంచేసింది. డీహెచ్ఎఫ్ఎల్, దాని మాజీ ప్రమోటార్లు కపిల్ వాద్వాన్, ధీరజ్ వాద్వాన్ పై సీబీఐ కేసులు నమోదుచేసింది. బ్యాంకుల కన్సార్షియం తరపున యూనియన్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదుపై సీబీఐ కేసులు నమోదుచేసింది.

ఇప్పటివరకు బ్యాంకులను మోసం చేసిన అన్నీ కేసుల్లో చూసుకుంటే ఇపుడు డీహెచ్ఎఫ్ఎల్ పైన నమోదు చేసిన బ్యాంకు మోసం కేసే అతిపెద్దది. గతంలో ఏబీజీ షిప్ యార్డ్ కంపెనీ బ్యాంకులను మోసం చేసిన రు. 22,842 కోట్లే అతిపెద్ద మోసంగా ఉండేది.

వేల కోట్ల రూపాయలను దోచేసుకోవటంలో ఒక కంపెనీ మరో కంపెపీని మోసం చేయటం మన దగ్గర బాగా పెరిగిపోతోంది. పారిశ్రామిక వేత్తల్లో కొందరు ఏదో కారణంతో బ్యాంకుల నుండి వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని ఎగ్గొట్టేస్తున్నారు.

విజయామాల్య, మోహిల్ చోక్సీ, నీరవ్ మోడీ, సుజనాచౌదరి, రఘురామకృష్ణంరాజు లాంటి అనేకమంది పారిశ్రామికవేత్తల ముసుగులో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అప్పులుగా తీసుకోవటం ఎగ్గొట్టేయటం ఫ్యాషన్ గా మారిపోయింది. పైన చెప్పిన వాళ్ళు కాకుండా ఇంకా చాలామంది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. డీహెచ్ఎఫ్ఎల్ కుంభకోణానికి సంబంధించి 50 మంది సీబీఐ అధికారులు ఏకకాలంలో అనేక ఆఫీసుల్లో, ఇళ్ళల్లో దాడులు చేసి విచారణ మొదలుపెట్టారు.

బ్యాంకుల కన్సార్షియం 2010-18 మధ్య ఈ కంపెనీకి రు. 42,871 కోట్లను అప్పుగా మంజూరు చేసినట్లు యూనియన్ బ్యాంకు చెప్పింది. అయితే 2019 నుండి తీసుకున్న అప్పుకు సంబందించిన చెల్లింపులు కంపెనీ నుండి ఆగిపోయింది. అప్పు రాబట్టుకునేందుకు కన్సార్షియం చేసిన ప్రయత్నాలు ఫెయిలవ్వటంతో ఇదే విషయాన్ని 2021కి యూనియన్ బ్యాంకు సీబీఐకి ఫిర్యాదు చేసింది.

ఇదే సమయంలో కేపీఎంజీ అనే ఆడిట్ సంస్ధతో ఆడిట్ నిర్వహించినపుడు అప్పులు ఎగ్గొట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తానికి తాజాగా బయటపడిన బ్యాంకు మోసం కేసు ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.