Begin typing your search above and press return to search.

అల్ ఖైదా, తాలిబాన్‌, ఇస్లామిక్ స్టేట్‌..ఈ మూడింటికి శత్రువు ఒకటే

By:  Tupaki Desk   |   2 Sep 2021 12:30 AM GMT
అల్ ఖైదా, తాలిబాన్‌, ఇస్లామిక్ స్టేట్‌..ఈ మూడింటికి శత్రువు ఒకటే
X
అల్ ఖైదా, తాలిబాన్‌, ఇస్లామిక్ స్టేట్‌ .. ఈ మూడింటికి వేటికివాటికే ఓ ప్రత్యేకత ఉంది. అఫ్గానిస్తాన్ నుండి అమెరికా దళాలు తిరిగి వెళ్లిపోవడంతో ఇక మధ్యప్రాచ్యం, మధ్య ఆసియాలో జిహాదీ ఉగ్రవాదుల ఒక కొత్త శకం ప్రారంభం కావచ్చని నిపుణులు అంచనా. ఈ మధ్య రోజుల్లో అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ బలహీనపడినప్పటికీ, అవి ఇప్పటికీ చురుగ్గానే ఉన్నాయి. పరిస్థితులు మారడంతో అవి మళ్లీ బలం పుంజుకునే అవకాశం ఉందంటూ నిపుణులు అంచనా వేస్తున్నారు.

తాలిబాన్ లాగే అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్‌ సంస్థల్లో కూడా మత చాందస భావజాలం ఉంది. కానీ మూడు గ్రూపుల ఆశయాలు, పనితీరు మాత్రం వేరు వేరుగా ఉంటాయి. న్యూయార్క్‌ లోని థింక్‌ టాంక్ సెంటర్ భద్రతా విశ్లేషకులు, రీసెర్చర్ కాలిన్ క్లార్క్ ఈ మూడు తీవ్రవాద సంస్థల మధ్య ఉన్న వ్యత్యాసాల గురించి తెలిపారు. తాలిబాన్ అఫ్గానిస్తాన్‌ లో అత్యంత కీలకమైన సంస్థ. అల్ ఖైదా వివిధ దేశాల్లోని ఒక జిహాదీ గ్రూప్. అది తమ నెట్‌ వర్క్‌ ను మళ్లీ నిలబెట్టాలని అనుకుంటోంది. ఇస్లామిక్ స్టేట్ కూడా అలాంటిదే. కానీ, అల్ ఖైదా, తాలిబాన్ ఇద్దరికీ అది శత్రువు. ఐసిస్ ఈ రెండు సంస్థలతో పోరాడాల్సి ఉంటుందని తెలిపారు.

అల్ ఖైదా, తాలిబాన్ రెండూ 80వ దశకం చివర్లలో సోవియట్ యూనియన్‌ దాడులకు వ్యతిరేకంగా ఉనికిలోకి వచ్చాయి. 90వ దశకంలో అఫ్గానిస్తాన్ అంతర్గత వివాదాలకు, రెండు సంస్థల ఎదుగుదలకు కూడా సంబంధం ఉంది. అమెరికా 2003లో ఇరాక్ మీద దాడి చేసిన తర్వాత ఇస్లామిక్ స్టేట్ ఉనికిలోకి వచ్చింది. ఇందులో ఇరాక్ సైన్యం, అల్ ఖైదాకు సంబంధించిన వారున్నారు. అల్ ఖైదాను ఒసామా బిన్ లాడెన్ 80వ దశకం చివర్లో స్థాపించారు. మొదట్లో ఇది సోవియట్ యూనియన్‌తో పోరాడుతున్న ముస్లింలకు ఆయుధాలు, ఇతర సాయం అందించింది. దానికోసం అల్ ఖైదా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ముస్లింలను సంస్థలో చేర్చుకుంది.

సోవియట్ సైన్యం ఓటమి పాలైన తర్వాత ఉత్తర పాకిస్తాన్, దక్షిణ అఫ్గానిస్తాన్‌ లోని పష్తూన్ ఫైటర్లు, విద్యార్థులు ఉన్న తాలిబాన్ అనే ఒక గ్రూప్ చాలా జనాదరణ సంపాదించింది. అఫ్గానిస్తాన్‌ లో తాము అధికారంలోకి వస్తే శాంతిభద్రతల స్థాపనతోపాటూ ఇస్లాంలోని కఠిన షరియా చట్టం అమలు చేస్తామని తాలిబాన్ హామీ ఇచ్చారు. వారికి ప్రజల మద్దతు కూడా లభించింది. దాంతో వారు త్వరగానే కాబుల్‌ పై పట్టు సాధించగలిగారు. 1996 ప్రారంభంలో దాదాపు మొత్తం అప్గానిస్తాన్ తాలిబాన్ నియంత్రణలోకి వచ్చింది. అప్పటికి అల్ ఖైదా పాత్ర కూడా ఒక సపోర్ట్ నెట్‌ వర్క్ నుంచి ఒక పెద్ద సంస్థ స్థాయికి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని చెప్పుకున్న అల్ ఖైదా ఒక జిహాదీ సంస్థగా మారిపోయింది. వారంటే కాస్త అభిమానం ఉన్న తాలిబాన్‌లు అల్ ఖైదాకు అఫ్గానిస్తాన్‌ లో ఆశ్రయం కల్పించారు.

ఇరాక్‌ లోని అల్ ఖైదా వర్గం నేరుగా ఇస్లామిక్ స్టేట్‌ కు నాయకత్వం వహించేది. 2003లో ఇరాక్ మీద అమెరికా దాడి చేసిన తర్వాత అల్ ఖైదా విదేశీ బలగాలపై ప్రతీకారం తీర్చుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించింది. 2006లో ఇరాక్‌ లోని అల్ ఖైదా, మిగతా తీవ్రవాద గ్రూపులన్నీ విలీనం అయ్యాయి. వారు తమను ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అని పిలుచుకున్నారు. ఈ కొత్త సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంకు నేతృత్వం వహించాలని కోరుకునేది. అలా అది అల్ ఖైదా మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మారింది. 2011లో సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ప్రభావం పెరగడం మొదలైంది. ఖిలాఫత్ ప్రకటించిన అది చివరకు అల్ ఖైదాకు దూరమైంది.

ఈ మూడు తీవ్రవాద సంస్థలు ఇస్లాం సున్నీ శాఖకు చెందినవే. షియాలతో పోలిస్తే ఈ శాఖ ఖురాన్‌ లో బోధనలను చాలా కఠినంగా పాటించాలని చెబుతాయి. ముస్లిం దేశాల మధ్య కూడా ఇస్లాంలోని వివిధ బోధనలకు సంబంధించి ఎన్నో వ్యత్యాసాలు కనిపిస్తాయి. బైబిల్‌లాగే ఖురాన్‌ లో కూడా కొన్ని కఠిన నిబంధనలు ఉన్నాయి. కానీ, ఈ హింసాత్మక సిద్ధాంతాలను అత్యధిక ముస్లిం జనాభా తిరస్కరించింది. అయితే, ఈ మూడింటి మత ఛాందసవాదం ఆయా సంస్థల లక్ష్యాలను బట్టి వేరు వేరుగా ఉంటుంది. అఫ్గానిస్తాన్‌ లో షరియా చట్టం అమలు చేయాలని తాలిబాన్ భావిస్తోంది. గతంలో మహిళలకి వ్యతిరేకంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

1996 నుంచి 2001 మధ్య తాలిబాన్ పాలనలోని ఆ చేదు జ్ఞాపకాలు వెంటాడడంతో గత కొన్నివారాలుగా ఎంతోమంది అఫ్గాన్ పౌరులు స్వదేశం వదిలిపెట్టారు. తాలిబన్ల ప్రభుత్వం మళ్లీ మొదలుకావడంతోనే అందరూ ఆ కఠిన నియమాలు మళ్లీ అమల్లోకి వస్తాయేమో అని భయపడుతున్నారు. అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్‌ తో పోల్చి చూస్తే తాలిబాన్‌లో అంత మతఛాందసవాదం లేదు. వారు అఫ్గానిస్తాన్‌ కు పూర్వ వైభవం తీసుకురావాలని అనుకుంటున్నారు అని యూనివర్సిటీ ఆఫ్ జార్జ్ టౌన్‌లో తీవ్రవాదం, మధ్యప్రాచ్య అంశాల నిపుణులు డేనియల్ బెమైన్ అన్నారు.

అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్‌కు అంతర్జాతీయ స్థాయిలో లక్ష్యాలు ఉంటే, తాలిబాన్‌ మాత్రం అఫ్గానిస్తాన్ మీదే తన ఫోకస్ పెట్టింది. ఖలీఫా స్థాపనపై అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ పరస్పరం ఒక అంగీకారానికి వచ్చినట్లు కనిపించడం కూడా వింతగా ఉంటుంది. ఈ వ్యవస్థలో ఎవరు ఖలీఫాగా ఉంటే, వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు రాజకీయ, మత నాయకుడుగా ఉంటారు. అయితే , ఇస్లామిక్ స్టేట్ ఇప్పుడే ఖిలాఫత్ స్థాపన కోరుకుంటుంటే, అల్ ఖైదా దానికి అంత తొందరేం లేదని భావిస్తోంది. దానికి జిహాదీ సమాజం, ముస్లిం సమాజం ఇంకా సిద్ధంగా లేదని అది భావిస్తోందట.

తాలిబాన్, అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్‌లకు ముగ్గురికీ ఒకే ఒక శత్రువు ఉన్నారు. అమెరికా-పశ్చిమ దళాలు. ఈ మత విరోధ ప్రభుత్వాలకు ఇరాన్, సిరియా ఉదాహరణలు. అల్ ఖైదాతో పోలిస్తే ఇస్లామిక్ స్టేట్ మొదటి నుంచీ ఎక్కువ హింసాత్మక చర్యలకు పాల్పడుతోంది. పశ్చిమ దేశాలతో పోరాడడంతోపాటూ ఐసిస్ తమ సిద్ధాంతాలను నమ్మని ముస్లింలతో కూడా పోరాడుతోంది అని డెనియల్ బెమెన్ తెలిపారు. అల్ ఖైదా ప్రధాన శత్రువు అమెరికా.ఈ మూడు తీవ్రవాద సంస్థలు మనుషులను చేర్చుకునే పద్ధతి కూడా భిన్నంగా ఉంటుంది. ఈ మూడూ తమ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రాంతీయ స్థాయిలో చేర్చుకుంటున్నాయి. అయితే, అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ మాత్రం మధ్య ప్రాచ్యం బయట దేశాల ప్రజలను కూడా తమ సంస్థతో జోడించడంలో సక్సెస్ అయ్యాయి.